Khalistani Flag Row: హిమాచల్ ప్రదేశ్ సీఎంతో ప్రధాని మోదీ కీలక భేటీ.. ఖలిస్తానీ బ్యానర్లు, జెండాలపైనే ప్రధాన చర్చ
హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీ భవనం వెలుపల ఖలిస్తానీ బ్యానర్లు, జెండాలు పెట్టడం చర్చనీయాంశమైంది. ఇదిలా ఉంటే, తాజాగా హిమాచల్ ముఖ్యమంత్రి జై రామ్ ఠాకూర్ ప్రధానమంత్రి నరేంద్ర మోదీని కలిశారు.
Khalistani Flag Row: హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీ భవనం వెలుపల ఖలిస్తానీ బ్యానర్లు, జెండాలు పెట్టడం చర్చనీయాంశమైంది. ఇదిలా ఉంటే, తాజాగా హిమాచల్ ముఖ్యమంత్రి జై రామ్ ఠాకూర్ ప్రధానమంత్రి నరేంద్ర మోదీని కలిశారు. ఈ సమావేశంలో ఖలిస్తాన్ అంశంపై కూడా చర్చించినట్లు తెలిసింది. అదే సమయంలో మే 31న హిమాచల్ ప్రదేశ్‌లో పర్యటించాల్సిందిగా ప్రధానిని సీఎం జై రామ్ ఠాకూర్ ఆహ్వానించారు.
రాష్ట్రానికి రావల్సిన అనేక ప్రాజెక్టులపై కూడా ఇద్దరి మధ్య చర్చ జరిగినట్లు సమాచారం. హిమాచల్ ప్రదేశ్‌కు రావాల్సిందిగా ప్రధానిని ఆహ్వానించిన సందర్భంగా సీఎం జైరామ్ ఠాకూర్ మాట్లాడుతూ .. ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలో కేంద్ర ప్రభుత్వం 8 ఏళ్లు పూర్తి చేసుకోబోతోందని.. ఈ కార్యక్రమం హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలో చేయాలని కోరామన్నారు. అలాగే, హిమాచల్ ప్రదేశ్‌లోని పలు ప్రాజెక్టుల పురోగతిపై ప్రధానితో మాట్లాడినట్లు ఆయన తెలిపారు. పలు అభివృద్ధి పనుల్లో భాగంగా ప్రారంభోత్సవం, శంకుస్థాపన కోసం కొన్ని ప్రాజెక్టులు పూర్తయ్యాయి. ఇందుకోసం హిమాచల్ ప్రదేశ్‌కు రావాలని ప్రధానిని ఆహ్వానించామన్నారు.
ఖలిస్తాన్ కేసులో దేవభూమి హిమాచల్‌లోని సుహృద్భావ వాతావరణాన్ని పాడుచేసేవారిని సహించేది లేదని సీఎం జై రామ్ ఠాకూర్ అన్నారు. ధర్మశాల అసెంబ్లీలో జరిగిన ఘటనలో నిందితుడు హర్విందర్ సింగ్ కుమారుడు రాజిందర్ సింగ్‌ను పంజాబ్‌లో అరెస్టు చేశారు. రాష్ట్ర అసెంబ్లీ కాంప్లెక్స్ ధర్మశాలలోని గోడపై ఖలిస్తానీ జెండా మరియు గ్రాఫిటీ ఆరోపణలను ఈ నిందితుడు అంగీకరించాడు. ఖచ్చితంగా హిమాచల్ పోలీసులు, పంజాబ్ పోలీసుల సంయుక్త ప్రయత్నాలతో, రెండవ నిందితుడు వినీత్ సింగ్‌ను కూడా త్వరలో అరెస్టు చేస్తామని సీఎం జై రామ్ ఠాకూర్ తెలిపారు.