NASA Astronaut Training Programme: చిన్నప్పటి నుంచి ఆకాశానికి వెళ్లాలని, అక్కడి రహస్యాలు తెలుసుకోవాలని చాలామందికి ఆసక్తి ఉంటుంది. అందుకోసం ఎంతో కష్టపడతారు. అనుకున్న లక్ష్యాన్ని చేరుకునేదాకా విశ్రమించరు. కేరళకు చెందిన అథిరా ప్రీతి రాణి (Athira Preetha Rani) కూడా ఈ కోవకే చెందుతుంది. చిన్నతనం నుంచి అంతరిక్షానికి వెళ్లాలన్న తన కలను నెరవేర్చుకునే దిశలో అథిరా మొదటి అడుగు వేసింది. అమెరికాకు చెందిన ప్రతిష్ఠాత్మక అంతరిక్ష పరిశోధనా సంస్థ నాసా (NASA) ఆస్ట్రోనాట్ ట్రైనింగ్ ప్రోగ్రామ్‌కి రాణి ఎంపికైంది. ఈ ట్రైనింగ్ ప్రోగ్రామ్‌ను అథిరా విజయవంతంగా పూర్తిచేస్తే కల్పనా చావ్లా, సునీతా విలియమ్స్ తర్వాత అంతరిక్ష యాత్ర చేయనున్న మూడో భారతీయ మహిళగా చరిత్ర పుటల్లోకి ఎక్కనుంది.
ఆశయానికి భర్త సహాయం తోడైంది..
కేరళలోని తిరువనంతపురానికి చెందిన వేణు, ప్రీతిల కుమార్తెనే అథిరా. బాల్యం నుంచి అంతరిక్షం, ఆస్ట్రోనాట్స్ అంటే ఆసక్తి ఎక్కువ. విద్యాభ్యాసం కూడా అటువైపే సాగించింది. చదువుకుంటూనే తిరువనంతపురంలోని ఆస్ట్రానామికల్ సొసైటీ నిర్వహించే ఆస్ట్రానమీ తరగతులకు హాజరైంది. ఆతర్వాత కెనడాలోని అల్గోనిక్విన్ కాలేజీలో స్కాలర్‌షిప్‌తో రోబోటిక్ కోర్సులో సీటు సాధించింది. చిన్న చితకా ఉద్యోగాలు చేస్తూనే మంచి మెరిట్‌తో కోర్సును పూర్తి చేసుకుంది. ఇదే సమయంలో గోకుల్‌ను ప్రేమించి పెళ్లిచేసుకుంది. దీంతో ఆమె ఆశయానికి భర్త సహాయం కూడా తోడైంది. ఈక్రమంలోనే అంతరిక్ష పరిశోధనలకు సంబంధించి కెనడాలో ఓ స్టార్టప్‌ను ప్రారంభించింది.
12 మందిలో ఒకరిగా..
కాగా స్టార్టప్‌ను నిర్వహిస్తూనే ఆస్ట్రోనాట్ ట్రైనింగ్ కార్యక్రమం గురించి తెలుసుకుంది అథీరా. నాసా, కెనడా స్పేస్ ఏజెన్సీ, నేషనల్ రిసెర్చ్ కౌన్సిల్ ఆఫ్ కెనడాలు సంయుక్తంగా నిర్వహించే ఇంటర్నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఆస్ట్రోనాటికల్ సైన్స్ ఆస్ట్రోనాట్ ట్రెయినింగ్ ప్రోగ్రామ్‌కి దరఖాస్తు చేసింది. తనకున్న పరిజ్ఞానంతో అన్ని పరీక్షలు, ఇంటర్వ్యూలను క్లియర్ చేసిం ఈ ట్రైనింగ్ ప్రోగ్రామ్‌కు ఎంపికైంది. కాగా ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాలకు చెందిన 12 మందిని ఈ ప్రోగ్రామ్‌కు ఎంపిక చేశారు. 3 నుంచి 5 ఏళ్లపాటు ట్రైనింగ్ ఉంటుంది. శిక్షణ తర్వాత బయో ఆస్ట్రోనాటిక్స్‌లో రిసెర్చ్ చేయాలనే కోరిక ఉందని అథిరా చెబుతోంది.
మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి..