డాలర్ స్మగ్లింగ్ కేసులో కేరళ స్పీకర్ శ్రీరామకృష్ణన్ కు కస్టమ్స్ శాఖ సమన్లు
అసలే కేరళ గోల్డ్ స్మగ్లింగ్ కేసులో సీఎం పినరయి విజయన్ పీకల్లోతు కష్టాల్లో మునగగా.. ఇప్పుడిక అసెంబ్లీ స్పీకర్ పి. శ్రీరామకృష్ణన్ పేరు కూడా బయటకు రావడం సంచలనం సృస్తిస్తోంది.
అసలే కేరళ గోల్డ్ స్మగ్లింగ్ కేసులో సీఎం పినరయి విజయన్ పీకల్లోతు కష్టాల్లో మునగగా.. ఇప్పుడిక అసెంబ్లీ స్పీకర్ పి. శ్రీరామకృష్ణన్ పేరు కూడా బయటకు రావడం సంచలనం సృస్తిస్తోంది. డాలర్ స్మగ్లింగ్ కేసులో ఈ నెల 12 న తమ ముందు హాజరు కావాలని కస్టమ్స్ శాఖ ఆయనకు నోటీసులు జారీ చేసింది. గతంలో కూడా ఇందుకు సంబంధించి ఆయన వాంగ్మూలాన్ని సేకరించేందుకు ఈ శాఖ చాలాసార్లు యత్నించింది. కేరళ గోల్డ్ స్మగ్లింగ్ కేసు ప్రధాన నిందితురాలు స్వప్న సురేష్..సీఎం విజయన్ పైన, స్పీకర్ పైన తీవ్ర ఆరోపణలు చేయడంతో ఈయనను కూడా కస్టమ్స్ శాఖ విచారించనుంది. తిరువనంతపురం లోని కొచ్చి ఈడీ కార్యాలయంలో శ్రీరామకృష్ణన్ ను అధికారులు విచారించనున్నారు. యూఏఈ కాన్సులేట్ సాయంతో ముఖ్యమంత్రి, స్పీకర్ కూడా విదేశీ కరెన్సీ స్మగ్లింగ్ కి పాల్పడ్డారని స్వప్న సురేష్ ఆరోపించినట్టు తెలుస్తోంది. 1,90,000 డాలర్ల (రూ. 1.30 కోట్లు) స్మగ్లింగ్ కు సంబంధించి గత జనవరిలో శ్రీరామకృష్ణన్ ప్రైవేట్ సహాయ కార్యదర్శి వాంగ్మూలాన్ని కస్టమ్స్ శాఖ సేకరించింది.
యూఏఈ కాన్సులేట్ లోని మాజీ ఫైనాన్స్ హెడ్ సాయంతో ఈ మొత్తాన్ని ఒమన్ లోని మస్కట్ కు తరలించారని ఆయన చెప్పినట్టు సమాచారం. కాగా- సప్న సురేష్ తన స్టేట్ మెంట్ లో ముఖ్యమంత్రి, స్పీకర్ సహా ముగ్గురు మంత్రులపై కూడా దిగ్భ్రాంతికరమైన ఆరోపణలు చేసిందని కస్టమ్స్ అధికారులు కేరళ హైకోర్టుకు తెలిపారు. ఇదివరకటి యూఏఈ కాన్సల్ జనరల్ తో సీఎంకి, స్పీకర్ కి సన్నిహిత సంబంధాలు ఉన్నాయని ఆమె చెప్పినట్టు కస్టమ్స్ కమిషనర్ సుమిత్ కుమార్ వెల్లడించారు. వీరంతా కలిసి డబ్బు చెల్లింపు లావాదేవీల్లో అనుచిత పద్ధతులకు పాల్పడ్డారని ఆమె పేర్కొన్నట్టు ఆయన తెలిపారు. ఈ వ్యవహారంతో రాష్ట్రంలో పినరయి విజయన్ ప్రభుత్వం రాజీనామా చేయాలని విపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి. రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు ఎప్రిల్ 6 జరగనున్న తరుణంలో ఇది విజయన్ ప్రభుత్వానికి పెద్ద దెబ్బే !
మరిన్ని చదవండి ఇక్కడ :