మాస్క్‌ తప్పనిసరి.. ఉల్లంఘించారో 10వేలు జరిమానా, రెండేళ్ల జైలు శిక్ష

కరోనా వ్యాపించకుండా ఉండేందుకు అందరూ మాస్క్‌లు ధరించాలని, సామాజిక దూరం పాటించాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ సూచించిన విషయం తెలిసిందే.

మాస్క్‌ తప్పనిసరి.. ఉల్లంఘించారో 10వేలు జరిమానా, రెండేళ్ల జైలు శిక్ష
Follow us

| Edited By:

Updated on: Jul 05, 2020 | 11:35 AM

కరోనా వ్యాపించకుండా ఉండేందుకు అందరూ మాస్క్‌లు ధరించాలని, సామాజిక దూరం పాటించాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ సూచించిన విషయం తెలిసిందే. అయితే ఇప్పటికీ కొంతమంది బయటకు వచ్చినప్పుడు వాటిని పెట్టుకోవడం లేదు. మరోవైపు దేశవ్యాప్తంగా సామాజిక వ్యాప్తి కేసులు పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో కేరళ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. అంటువ్యాధుల చట్టం కింద పలు నిబంధనలతో కూడిన  ఓ ఆర్డినెన్స్‌ను తీసుకొచ్చింది. వీటిలో ఏ నిబంధనలు ఉల్లంఘించినా.. పదివేలు జరిమానా, రెండేళ్లు జైలు శిక్ష విధించనున్నట్లు పేర్కొంది.

ఆర్డినెన్స్‌లోని నిబంధనలు: 1.పబ్లిక్ ప్రదేశాల్లో, పని ప్రదేశాల్లో, సామూహికంగా ఉండే చోట మాస్క్ తప్పనిసరిగా వాడాలి. 2.పబ్లిక్ ప్రదేశాల్లో, కార్యక్రమాల్లో ప్రతి ఒక్కరూ ఆరు అడుగుల దూరం పాటించాలి. 3.షాపులు, వ్యాపార కార్యకలాపాలు నిర్వహించే ప్రదేశాల్లో 25 మందికి మించి ఉండకూడదు. 4.వివాహాల కార్యక్రమాల్లో 50కి మించి ఉండకూడదు. అక్కడ కూడా మాస్క్‌లు ధరించి, సామాజిక దూరం పాటించాలి. అక్కడ శానిటైజర్లు వాడాలి. అంత్యక్రియలకు 20 మందికి మించి హాజరుకాకూడదు. 5.ధర్నాలు, ర్యాలీలకు ప్రభుత్వం నుంచి అనుమతి తీసుకోవాలి. అందులోనూ 10 మందికి మించి పాల్గొనకూడదు. 6.రోడ్లు, ఫుట్‌ఫాత్‌లపై ఉమ్మివేయకూడదు. 7.ఇతర ప్రదేశాల నుంచి కేరళకు వచ్చే వారు తమ పేరును ‘రెవెన్యూ డిపార్ట్‌మెంట్‌ జాగ్రత’ పోర్టల్‌లో రిజిస్టర్‌ చేసుకోవాలి.

ఓ ఏడాది వరకు ఈ ఆర్డినెన్స్‌ను అమలు చేస్తామని, ఆ తరువాత పరిస్థితులను బట్టి అందులో మార్పులు ఉంటాయని కేరళ ప్రభుత్వం తెలిపింది.