AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Nimisha Priya case: సుప్రీంకోర్టులో నిమిష ప్రియ కేసు విచారణ… తదుపరి విచారణ ఆగస్టు 14కు వాయిదా

యెమెన్‌ దేశంలో కేరళ నర్స్‌ నిమిషా ప్రియకు ఉరిశిక్ష అమలు వాయిదా పడింది. ఈ మేరకు కోర్టుకు తెలిపారు పిటిషనర్‌ నిమిష తల్లి తరపు న్యాయవాది. శుక్రవారం సుప్రీంకోర్టులో కేరళ నర్సు నిమిష ప్రియ కేసు విచారణ చేపట్టింది. జస్టిస్ విక్రమ్‌నాథ్, జస్టిస్ సందీప్ మెహతా ధర్మాసనం విచారణ...

Nimisha Priya case: సుప్రీంకోర్టులో నిమిష ప్రియ కేసు విచారణ... తదుపరి విచారణ ఆగస్టు 14కు వాయిదా
Nimisha Case
K Sammaiah
|

Updated on: Jul 18, 2025 | 12:08 PM

Share

యెమెన్‌ దేశంలో కేరళ నర్స్‌ నిమిషా ప్రియకు ఉరిశిక్ష అమలు వాయిదా పడింది. ఈ మేరకు కోర్టుకు తెలిపారు పిటిషనర్‌ నిమిష తల్లి తరపు న్యాయవాది. శుక్రవారం సుప్రీంకోర్టులో కేరళ నర్సు నిమిష ప్రియ కేసు విచారణ చేపట్టింది. జస్టిస్ విక్రమ్‌నాథ్, జస్టిస్ సందీప్ మెహతా ధర్మాసనం విచారణ సందర్భంగా న్యాయవాది ఉరిశిక్ష అమలు వాయిదా పడినట్లు వెల్లడించారు. బ్లడ్ మనీ గురించి చర్చించేందుకు యెమెన్ వెళ్లాల్సి ఉందని, అక్కడ ఒక మత గురువు ఈ వ్యవహారంలో భాగమయ్యారని తెలిపారు. కేంద్ర ప్రభుత్వానికి అభ్యర్థన ఇచ్చేందుకు నిమిష తల్లిదండ్రులకు అనుమతి ఇచ్చింది కోర్టు. ఆ అభ్యర్థనపై మెరిట్స్ ప్రకారం కేంద్రం నిర్ణయం తీసుకోవాలని సూచించింది. తదుపరి విచారణ ఆగస్ట్ 14కు వాయిదా వేసింది.

అయినే మృతుడి కుటుంబానికి బ్లడ్‌ మనీ చెల్లిస్తామన్న నిమిష కుటుంబం ఆఫర్‌ను బాధిత కుటుంబ సభ్యులు తిరస్కరించారు. డబ్బుతో రక్తాన్ని కొనలేరని అంటోంది బాధితుడు తలాల్‌ కుటుంబం. నిమిష ఉరిశిక్ష వాయిదా పడిందని, రద్దు కాలేదని వాళ్లు స్పష్టం చేశారు. వాస్తవానికి గురువారం ఆమెకు ఉరిశిక్ష అమలుకావాల్సి ఉంది. అయితే కేరళ మతపెద్ద అబూ బాకర్‌ జోక్యంతో ఉరి వాయిదా పడింది. యెమెన్‌లో హూతీ ప్రభుత్వంతో చర్చలు కొనసాగుతున్నాయని అబూ బాకర్‌ ప్రకటించారు. నిమిషా ప్రియను కాపాడేందుకు బాధితుడి కుటుంబానికి 8 కోట్ల 60 లక్షల రూపాయలు బ్లడ్ మనీగా ప్రియ కుటుంబం అందించేందుకు సిద్దమయ్యింది. కాని వాళ్లు అందుకు ఒప్పుకోవడం లేదు.

మృతుడు తలాల్‌ అదిబ్‌ మెహది కుటుంబం మాత్రం ఆమెకు శిక్ష పడాల్సిందేనని పట్టుబడుతోంది. నేరానికి క్షమాపణ ఉండదని మృతుడు సోదరుడు అబ్దుల్‌ ఫత్తా మెహది స్పష్టంచేశారు. ఆమెకు శిక్ష పడాల్సిందేనని, బ్లడ్‌మనీకి అంగీకరించబోమని వెల్లడించారు. డబ్బుతో మనిషి ప్రాణానికి వెలకట్టలేమని అన్నారు. న్యాయం దక్కాల్సిందే అన్నారు. . అలాగే దోషిని బాధితురాలిగా చిత్రీకరించే ప్రయత్నం చేయొద్దని వ్యాఖ్యానించారు.

నిమిష మరణశిక్ష వాయిదా పడిన విషయాన్ని భారత విదేశీ వ్యవహారాల శాఖ వెల్లడించింది. యెమెన్‌ జైలు అధికారులతోపాటు ప్రాసిక్యూషన్‌ కార్యాలయంతో నిరంతరం సంప్రదింపులు జరుపుతున్నట్లు తెలిపింది. బాధితుడి కుటుంబంతో నిమిష కుటుంబం ఒప్పందం చేసుకోవచ్చన్నారు. బాధిత కుటుంబానికి ఒక మిలియన్‌ డాలర్ల దాదాపు రూ.8.6కోట్ల క్షమాధనాన్ని ఇచ్చేందుకు నిమిష ప్రియ కుటుంబం సిద్ధమైంది. ఇందుకు వారు అంగీకరిస్తే.. నిమిష ప్రియకు మరణశిక్ష తప్పే అవకాశం ఉంది.

అయితే బ్లడ్‌మనీని తీసుకునేలా బాధిత కుటుంబాన్ని ఒప్పించేందుకు మత గురువు కాంతాపురం ఏపీ అబూబాకర్‌ ముస్లియార్‌ సంప్రదింపులు జరుపుతున్నారు. ఆ చర్చలు ఎలాంటి ఫలితాన్ని ఇస్తాయోనన్న ఉత్కంఠ నెలకొంది.