తమిళనాడులో చికెన్ షవర్మా తిని బాలిక మృతి చెందిన ఘటన మరువకముందే.. ఇప్పుడు కేరళలో మరో సంఘటన చోటు చేసుకుంది. కేరళలో చికెన్ షవర్మా తిని అస్వస్థతకు గురైన ఓ యువకుడు చికిత్స అందక మృతి చెందాడు. కాక్కనాడ్‌లోని మేవేలిపురంలోని ఓ రెస్టారెంట్‌లో చికెన్ షావర్మా తిన్న యువకుడి ఆరోగ్యం క్షీణించటంతో అతడు మరణించాడు. మృతి చెందిన యువకుడిని 22 ఏళ్ల డి. రాహుల్ నాయర్‌గా గుర్తించారు. కొచ్చిన్‌లోని స్పెషల్ ఎకనామిక్ జోన్‌కు సంబంధించిన ఓ సంస్థలో ఉద్యోగిగా పనిచేస్తున్నాడు.
పాలా నివాసి అయిన రాహుల్ తన స్నేహితులతో కలిసి చిట్టెటుకరలో ఉంటున్నాడు. అందిన సమాచారం ప్రకారం..అతని మరణానికి కారణం శరీరంలోని సెప్టిసిమియా అని తెలిసింది. ఇది అంతర్గత అవయవాలను ప్రభావితం చేసే తీవ్రమైన ఇన్ఫెక్షన్ అని ఆసుపత్రి ప్రతినిధి తెలిపారు. అక్టోబరు 22న అపస్మారక స్థితిలో ఉన్న ఆయనను ఆస్పత్రికి తరలించి వెంటనే వెంటిలేటర్‌పై ఉంచారు. కానీ కోలుకోలేదు. రక్త పరీక్షలో ఫుడ్ పాయిజన్ అని నిర్ధారించారు.
మరింత నిర్ధారణ కోసం ఆసుపత్రి నమూనాలను కొచ్చిలోని మరో ఆస్పత్రిలోని ల్యాబ్‌కు పంపించారు. ఇంకా ఫలితాలు రాలేదని వైద్యులు తెలిపారు. ఈ కేసుకు సంబంధించి రెస్టారెంట్ యజమానిపై పోలీసులు పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. షవర్మా తిని ప్రజల ఆరోగ్యం క్షీణించిందని వరుసగా వస్తున్న ఫిర్యాదులు నేపథ్యంలో నగర కార్పొరేషన్ ఆరోగ్య అధికారులు హోటల్‌ను మూసివేశారు. ఇదే రెస్టారెంట్‌లో భోజనం చేసిన మరో ముగ్గురు కస్టమర్లు అస్వస్థతకు గురయ్యారని వచ్చిన సమాచారంతో ఫుడ్ అండ్ సేఫ్టీ విభాగం ముమ్మర విచారణ జరుపుతోంది.
ఇటీవలే, ఇలాంటి సంఘటన తమిళనాడులో చోటు చేసుకుంది. తమిళనాడులోని నమ్మక్కళ్ కు చెందిన ఒక వ్యక్తి దగ్గరలో ఉన్న రెస్టారెంట్‌లో చికెన్ షవర్మ, మరికొన్ని నాన్ వెజ్ ఫుడ్ ఐటమ్స్ కూడా కొనుగోలు చేశాడు. ఇంటికి పార్శిల్ తీసుకెళ్లిన అతడు..తన భార్య, కుమార్తె కలిసి ముగ్గురూ తిన్నారు. ఆ తర్వాత అతని కుమార్తె తీవ్రమైన కడుపు నొప్పితో అవస్థపడింది. కడుపు నొప్పి తట్టుకోలేక ఆ చిన్నారి మెలికలు తిరిగిపోతుంటే వెంటనే దగ్గర్లని ఆసుపత్రికి తీసుకువెళ్లారు. పరీక్షించిన వైద్యులు ఫుడ్ పాయిజన్‌గా నిర్ధారించారు.చికిత్స అనంతరం ఇంటికి పంపించారు. కానీ, పాపం ఆ తర్వాత రోజే చిన్నారి మరణించింది. దీంతో తల్లిదండ్రులు కన్నీరు మున్నీరుగా విలపించారు. కూతురి మరణంతో ఆ వ్యక్తి రెస్టారెంట్ పై పోలీసులకు ఫిర్యాదు చేశారు. వెంటనే రెస్టారెంట్ మూసివేయాలని డిమాండ్ చేశారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి..