కేరళ సీఎం పినరయ్ విజయన్ కుమార్తె వీణ వివాహం,.. డీఎఫ్‌వైఐ (డెమోక్రటిక్ యూత్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా) జాతీయ అధ్యక్షుడు పీఏ మహ్మద్ రియాజ్‌తో సోమవారం జరిగింది. కరోనా వైరస్ మహమ్మారి వ్యాప్తి కారణంగా ఎలాంటి హంగూ ఆర్భాటాలు లేకుండా ఈ కార్యక్రమం జరిగింది. బంధువులు, అతిథులు భౌతికదూరం పాటిస్తూ, మాస్క్‌లు ధరించి ఈ వేడుకలో పాల్గొన్నారు. వీరిది మతాంతర వివాహం. సాదాసీదాగా పెళ్లి జరిగింది. ఇరువురు దండలు మార్చుకుని అతి కొద్ది మంది అతిథులు, దగ్గరి బంధువుల సమక్షంలో నిరాడంబరంగా ఈ వివాహం జరిగింది. ముఖ్యమంత్రి విజయన్ నివాసం వద్దే ఈ వివాహ వేడుకను నిర్వహించారు. కాగా, వీరిద్దరికీ ఇది రెండో పెళ్లి కావడం గమనార్హం.
పినరయ్ విజయన్, కమల విజయన్ దంపతుల పెద్ద కుమార్తె వీణ… ఒరాకిల్‌లో చాలా కాలం పాటు సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌గా పనిచేశారు. తర్వాత బెంగళూరులో సొంతంగా స్టార్టప్ కంపెనీ ప్రారంభించారు. ఇక పెళ్లి కొడుకు మహ్మద్ రియాజ్ విషయానికి వస్తే విద్యార్థి ఉద్యమాల్లో పాల్గొని చురుకైన నాయకుడిగా గుర్తింపు పొందారు. వృత్తి రీత్యా అడ్వకేట్ . ఎస్ఎఫ్ఐ(స్టూడెంట్ ఆఫ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా) సభ్యుడిగా రాజకీయాల్లోకి ప్రవేశించారు. ఆ తర్వాత సీపీఎంలో క్రియాశీలక సభ్యుడిగా కొనసాగుతున్నారు. 2009 లోక్‌సభ ఎన్నికల్లో కోజికోడ్ నియోజకవర్గం నుంచి సీపీఎం అభ్యర్థిగా పోటీ చేశారు. కాంగ్రెస్ అభ్యర్థి ఎమ్‌కే రాఘవన్ చేతిలో స్వల్ప ఓట్ల తేడాతో ఓటమి పాలయ్యారు.