పిల్లల సంరక్షణ కోసం కేరళ శిశు సంక్షేమ శాఖ మార్గదర్శకాలు
కరోనా వైరస్ సెకండ్‌వేవ్ ఉధృతి భయంకరంగా ఉంది.. పాజిటివ్ కేసుల సంఖ్య విపరీతంగా పెరుగుతోంది. మరణాలు కూడా ఎక్కువగానే ఉంటున్నాయి.
కరోనా వైరస్ సెకండ్‌వేవ్ ఉధృతి భయంకరంగా ఉంది.. పాజిటివ్ కేసుల సంఖ్య విపరీతంగా పెరుగుతోంది. మరణాలు కూడా ఎక్కువగానే ఉంటున్నాయి. అన్ని వయసులవారిని కరోనా కాటేస్తున్నది. పిల్లలను కూడా వదిలిపెట్టడం లేదు. చిన్నారులకు కరోనా వైరస్ సోకదని, ఒకవేళ సోకినా పిల్లలకు ఏమీ కాదని ఇంతకాలం అనుకున్నాం కానీ, ఇప్పుడు పరిస్థితి మారింది. రోజురోజుకూ విజృంభిస్తున్న కరోనా వైరస్ ఇప్పుడు పిల్లల మీద కూడా విరుచుకుపడుతోంది. అందుకే చిన్నారులను జాగ్రత్తగా చూసుకోవలసిన అవసరం ఏర్పడింది. ఇందుకోసం కేరళ శిశు సంక్షేమ శాఖ ప్రత్యేక నోటీసు ఇచ్చింది. పదేళ్లలోపు పిల్లల సంరక్షణపై తల్లిదండ్రులు ప్రత్యేక దృష్టి పెట్టాలని తెలిపింది.. కరోనా వైరస్ విపరీతంగా పెరుగుతున్నదని, ప్రస్తుతం పరిస్థితి ఘోరంగా ఉంది కాబట్టి అప్రమత్తతో ఉండాలని హెచ్చరించింది. చిన్నపిల్లలను తాకడానికి లేదా ముద్దు పెట్టుకోవడానికి ఇతరులను ఎట్టి పరిస్థితుల్లోనూ అనుమతించవద్దని సూచించింది. పిల్లల బాధ్యతను తల్లిదండ్రులు మాత్రమే తీసుకోవాలి తప్ప వేరే వాళ్లకు అప్పగించకూడదని తెలిపింది.
పిల్లలను బయట తిప్పకపోవడమే శ్రేయస్కరమని సలహా ఇచ్చింది. రద్దీ ప్రదేశాలకు అసలే తీసుకెళ్లకూడదని, మారాం చేసినా పట్టించుకోవద్దని తెలిపింది కేరళ శిశు సంక్షేమ శాఖ. అలాగే తల్లి పాలు తీసుకుంటున్న పిల్లల పట్ల మరింత జాగ్రత్త అవసరం. పేరంట్స్ కూడా బయటకు వెళ్లకుండా ఉండాలి. పిల్లలతో ఫ్యామిలీ ఫంక్షన్లకు వెళ్లడం మానేయాలి. విందులు, వినోదాలకు వెళ్లకూడదు. పిల్లలు అమ్మమ్మ ఇంటికో, నాయనమ్మ ఇంటికో వెళతానన్నా ఒప్పుకోవద్దు. బంధువుల ఇళ్లకు పిల్లలను తీసుకెళ్లకూడదు. పిల్లలు అనారోగ్యంతో ఉన్నట్టుగా అనిపిస్తే వెంటనే దగ్గరలోని ఆరోగ్య కేంద్రానికి తెలిపాలి. వారు తదుపరి చికిత్స సూచించినట్లయితేనే ఇంకో ఆసుపత్రికి తీసుకెళ్లాలి. కరోనా విస్తరిస్తున్న ఇలాంటి విపత్కర సమయంలో పుట్టు వెంట్రుకలు, బారసాల వంటి కార్యక్రమాలను అసలు పెట్టుకోవద్దు. పిల్లలకు సంబంధించిన ఆచారాలను, సంప్రదాయాలను వాయిదా వేసుకోవడం చాలా మంచిది.
పిల్లలకు రోగ నిరోధక శక్తిని పెంచే ఆహారాన్ని ఇవ్వాలి. ఇరుగు పొరుగు పిల్లలతో కలిసి ఆడుకోనివ్వొద్దు. కరోనా అదుపులోకి వచ్చేంత వరకు పక్కింటికి కూడా పిల్లలను పంపించవద్దు. పిల్లల చేతులను తరచుగా కడగాలి. బిస్కెట్లు, చాక్లెట్లు, క్యాండీలు తదితరాలు పిల్లల కోసం తెస్తే వాటిని ముందుగా శుభ్రపరచాలి. మీ చేతులు కూడా శుభ్రంగా కడుక్కున్నాకే పిల్లలకు వాటిని ఇవ్వాలి. పిల్లలతో బయటకు వెళ్లాల్సిన అత్యవసర పరిస్థితులు ఏర్పడితే మాత్రం ఆరోగ్య అధికారులకు చెప్పి వెళ్లాలి. ఇంట్లో శానిటైజర్ జాగ్రత్త తీసుకోవాలి. శిశువు చేతులు శుభ్రపరచాలి… ఇలా అన్ని జాగ్రత్తలను సూచించింది శిశు సంక్షేమ శాఖ. అంతే కాదు.. సూచనలను పాటించని తల్లిదండ్రులపై కఠినమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. ఈ జాగ్రత్తలన్నీ మన కోసమేనని, మన పిల్లల కోసమేనని, మన దేశం కోసమేనని తెలిపింది. ఈ జాగ్రత్తలు ఒక్క కేరళ రాష్ట్రానికే వర్తించవు.. మనం కూడా వీటన్నింటినీ పాటిస్తే పిల్లలు ఆరోగ్యంగా ఉంటారు.
మరిన్ని ఇక్కడ చూడండి: Sai Pallavi: సాయి పల్లవి రిజక్ట్ చేసిన సినిమాలు ఏవో తెలుసా.. ఆ స్టార్ హీరోలకు కూడా ఫిదా బ్యూటీ నో చెప్పిందా..
Viral Video: పసిబిడ్డను ఆడించిన గొరిల్లా..!! నెటిజన్లు ఫిదా.. వైరల్ వీడియో...