గుండెపోటు మరణాలకు కోవిడ్ వ్యాక్సినే కారణమా? నిజం నిగ్గుతేల్చిన కర్ణాటక కమిటీ!
కర్ణాటక ప్రభుత్వం నియమించిన ప్రత్యేక నిపుణుల కమిటీ, ఆకస్మిక గుండెపోటు మరణాలకు, కోవిడ్-19 టీకాలకు మధ్య ఎటువంటి సంబంధం లేదని తేల్చింది. జన్యుపరమైన, పర్యావరణ కారకాల కలయిక వల్ల ఈ మరణాలు సంభవించవచ్చని నివేదిక పేర్కొంది. టీకాలతో గుండె సమస్యలకు సంబంధం లేదని నివేదిక స్పష్టం చేసింది.

కర్ణాటక ప్రభుత్వం నియమించిన ప్రత్యేక నిపుణుల కమిటీ ఆకస్మిక గుండెపోటు మరణాలకు, కోవిడ్-19 టీకాలకు మధ్య ఎటువంటి సంబంధం లేదని తేల్చింది. జయదేవా ఇన్స్టిట్యూట్ ఆఫ్ కార్డియోవాస్కులర్ సైన్స్ అండ్ రీసెర్చ్ డైరెక్టర్ డాక్టర్ కెఎస్ రవీంద్రనాథ్ అధ్యక్షతన ఉన్న ఈ ప్యానెల్ జూలై 2న తన పరిశోధనలను సమర్పించింది. హసన్ జిల్లా చోటు చేసుకున్న ఆందోళనకరమైన మరణాల తర్వాత ప్రభుత్వం ఈ కమిటీ ఏర్పాటు చేసింది. జన్యుపరమైన, పర్యావరణ కారకాల కలయిక వల్ల మరణాలు సంభవించవచ్చని నివేదిక తేల్చింది.
ఆకస్మిక గుండె మరణాలు పెరగడానికి ఏ ఒక్క కారణం కారణం కాదని ప్యానెల్ పేర్కొంది. కోవిడ్ తర్వాత వెంటనే గుండె సంబంధిత సంఘటనలలో తాత్కాలిక పెరుగుదల ఉన్నప్పటికీ, వాపు కారణంగా, దీర్ఘకాలిక ప్రభావం చాలా తక్కువగా కనిపిస్తుంది. జయదేవ హాస్పిటల్‌లో కొనసాగుతున్న ప్రీమెచ్యూర్ కార్డియాక్ రిజిస్ట్రీ కోవిడ్‌కు ముందు, తర్వాత డేటా మధ్య పోలికను సాధ్యం చేసిందని డాక్టర్ రవీంద్రనాథ్ అన్నారు. “కోవిడ్ తర్వాత మధుమేహం, రక్తపోటు 5 నుంచి 6 శాతం పెరుగుదలను మేం గమనించాం. ఇది ఆరోగ్య ధోరణులలో మార్పును సూచిస్తుంది” అని ఆయన అన్నారు.
“మేం రోగులను విశ్లేషించాం, వారి ప్రమాద ప్రొఫైల్స్ మారాయని కనుగొన్నాం. మేం ICMR, ఇతర పీర్-రివ్యూడ్ అధ్యయనాలను సమీక్షించాం, ఏకాభిప్రాయం స్పష్టంగా ఉంది. కోవిడ్ టీకా, పెరిగిన గుండె సంబంధిత సంఘటనల మధ్య ప్రత్యక్ష సంబంధం లేదు,” అని ఆయన వివరించారు. “అయితే తీవ్రమైన కోవిడ్ ఉన్న వ్యక్తులు, ముఖ్యంగా ICU కేసులు, కోలుకున్న తర్వాత ఆరు నెలల నుండి ఒక సంవత్సరం లోపు గుండెపోటు పెరుగుదలను చూపించాయి. కానీ దీర్ఘకాలిక డేటా, మూడు నుండి నాలుగు సంవత్సరాలలో సాధారణ జనాభాలో గుండె సంబంధిత సంఘటనలలో నిరంతర పెరుగుదల కనిపించడం లేదు.” అని వెల్లడించారు.
కోవిడ్ టీకాలు యువకులలో ఆకస్మిక మరణాలకు కారణమవుతున్నాయనే వాదనలను కూడా ఈ అధ్యయనం ఖండించింది. బదులుగా టీకాలు గుండె సమస్యల నుండి దీర్ఘకాలిక రక్షణను అందిస్తాయని సూచించే ప్రపంచ ఆధారాలను ఈ కమిటీ మరోసారి ధృవీకరించింది. ఆకస్మిక గుండె మరణాలు, శవపరీక్ష ఆధారిత రిజిస్ట్రీల కోసం రాష్ట్రవ్యాప్త నిఘా వ్యవస్థను ఏర్పాటు చేయడంతో సహా బహుముఖ ప్రజారోగ్య వ్యూహాన్ని కూడా ప్యానెల్ తన నివేదికలో సిఫార్సు చేసింది. అయితే హసన్ జిల్లాలో వరుస గుండెపోటు మరణాలు వెంటవెంటనే చోటు చేసుకోవడంతో.. కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ఆందోళన వ్యక్తం చేశాడు. ఈ గుండెపోటు మరణాలకు కోవిడ్ టీకాలతో ఏమైనా లింక్ ఉందా అని ఆయన అనుమానం వ్యక్తం చేశారు. ఈ మరణాలపై నివేదిక ఇవ్వాలని ఆయనే స్వయంగా ఈ కమిటీ ఏర్పాటుకు ఆదేశాలు ఇచ్చారు. తాజాగా ఆ కమిటీ ఆయన అనుమానాన్ని తీర్చేసింది.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి




