Karnataka Hijab Row: కర్ణాటకలో విద్యార్థుల ఆందోళనల వెనుక రాజకీయ కారణాలు?

కర్ణాటకలో ప్రస్తుతం విద్యార్ధుల ఆందోళనలు కొనసాగుతున్నాయి. అయితే, ఈ ఆందోళనలు రాజకీయ ప్రేరేపితమైనవి అని విశ్లేషకులు భావిస్తున్నారు.

Karnataka Hijab Row: కర్ణాటకలో విద్యార్థుల ఆందోళనల వెనుక రాజకీయ కారణాలు?
Karnataka Hijab Issue
Follow us
KVD Varma

|

Updated on: Feb 10, 2022 | 5:58 PM

Karnataka Hijab Row: కర్ణాటకలో మొదలైన ఒక వివాదం క్రమేపీ దేశవ్యాప్తంగా విస్తృతమైన చర్చకు తెరలేపింది. హిజాబ్ (తలచుట్టూ కపుకునే కండువా) ధరించడంపై ఉడిపిలోని ప్రభుత్వ బాలికల ప్రీ-యూనివర్శిటీ కళాశాలకు వ్యతిరేకంగా గత డిసెంబర్ నెలలో కొంతమంది విద్యార్థులు నిరసన వ్యక్తం చేశారు. ఆ తరువాత వివిధ ఘటనల నేపధ్యంలో కర్ణాటక ప్రభుత్వం(Karnataka Government) పాఠశాలలకు మూడు రోజుల సెలవు ప్రకటించింది. దీంతో ఇది పెద్ద వివాదానికి దారితీసింది. కళాశాలలు. హింస, నిరసనల నేపథ్యంలో రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాల్లో నిషేధాజ్ఞలు కూడా విధించారు. కాలేజీలో హిజాబ్‌పై నిషేధం విధించడంపై దాఖలైన పిటిషన్లపై హైకోర్టు(High Court) విచారణ జరుపుతోంది. అయితే, కర్నాటక కోస్తా ప్రాంతానికి చెందిన రాజకీయ పరిశీలకులు ఈ వివాదాన్ని రాజకీయాలకు సంబంధించినదిగా అభివర్ణిస్తున్నారు. ఇది విద్యార్ధుల సమస్య ఏమాత్రం కాదని వారు అభిప్రాయపడుతున్నారు.

సమస్య ప్రారంభమైంది ఇలా..

వాస్తవానికి డిసెంబర్ నెలలో ఉడిపిలోని ప్రభుత్వ కళాశాలకు చెందిన ఆరుగురు విద్యార్థులు తరగతి గదిలో తమను హిజాబ్ ధరించడానికి అనుమతించనందుకు కళాశాల లోపల నిరసనకు దిగారు. డిసెంబరు 30, 2021 నుండి నిరసన కొనసాగుతోంది. నిరసన తెలిపిన విద్యార్థుల్లో ఒకరు జనవరి 31న హైకోర్టును ఆశ్రయించడంతో సమస్య చెలరేగింది. ఆ తరువాత ఈ సమస్య రాష్ట్రంలోని కనీసం 42 కళాశాలల్లో గందరగోళానికి దారితీసింది.

పరిశీలకులు ఏమంటున్నారు?

అయితే, మత రాజకీయాలు ప్రబలంగా ఉన్న కోస్తా ప్రాంతంలో ఎన్నికల ప్రయోజనాల కోసం రాజకీయాలు చేయడం దీని వెనుక ప్రధాన సమస్య అని ఇటువంటి సంఘటనలను నిశితంగా పరిశీలిస్తున్న నిపుణులు.. కార్యకర్తలు అంటున్నారు.

హిజాబ్‌పై మొదటి నిరసన ఉడిపిలో జరిగినప్పుడు, క్యాంపస్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా (CFI), సోషల్ డెమోక్రటిక్ పార్టీ ఆఫ్ ఇండియా (SDPI) మద్దతు ఉన్న విద్యార్థి ఉద్యమం వారికి మద్దతు ఇచ్చింది. ఉడిపి బీజేపీ ఎమ్మెల్యే, కాలేజీ డెవలప్‌మెంట్ అండ్ మేనేజ్‌మెంట్ కమిటీ అధ్యక్షుడు రఘుపతి భట్ తొలుత స్పందించారు. ఈ అంశం కాంగ్రెస్‌కు చెందిన ముస్లిం ఓట్లను చీల్చేందుకు సిఎఫ్‌ఐకి అవకాశం కల్పించిందని ఈ ప్రాంత రాజకీయ పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు. స్థానిక సంస్థల ఎన్నికలలో SDPI కొన్ని వార్డులను గెలుచుకుంది అదేవిధంగా వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయాలని యోచిస్తోంది. మరోవైపు 2013 ఎన్నికల్లో ఓడిపోయి 2018లో చివరి నిమిషంలో టికెట్‌ దక్కించుకున్న రఘుపతి భట్‌ తన ఓటు బ్యాంకును పదిలం చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నారని పరిశీలకులు అంటున్నారు.

ఈ వివాదం స్థానికంగానే ముగిసి పోయేదే. కానీ, రఘుపతి భట్ అలాగే ఏబీవీపీ ప్రోత్సాహంతో రాష్ట్రంలోని ఇతర జిల్లాలకు విస్తరించిందని సీఎఫ్‌ఐ నాయకులు తెలిపారు. ఈ విషయంపై న్యూస్ 9తో మాట్లాడిన CFI రాష్ట్ర అధ్యక్షుడు అథవుల్లా పుంజల్‌కట్టే, “విద్యార్థులు తమ వద్దకు వచ్చిన తర్వాత మాత్రమే CFI సమస్యలో తలదూర్చింది” అని చెప్పారు.

“మేము దాగుడు మూతలు ఆడము, మేము అమ్మాయిలతో ఉన్నాము. వారికి న్యాయం జరిగే వరకు మేము అండగా ఉంటాము. వారు వారి రాజ్యాంగ హక్కులను డిమాండ్ చేస్తున్నారు. మేము వారికి బహిరంగంగా మద్దతు ఇస్తున్నాము” అని ఆయన స్పష్టం చేశారు.

“నిరసనలో ఉన్న విద్యార్థులు తమ హక్కులను కోరుతూ మొదట వారి ప్రిన్సిపాల్.. సంబంధిత అధికారులను సంప్రదించారు. అయితే, వారు ఈ విషయాన్ని పట్టించుకోలేదు. దీంతో విద్యార్ధులు మమ్మల్ని తరువాత హైకోర్టును ఆశ్రయించారు. ఇది అకస్మాత్తుగా తలెత్తిన సమస్య కాదు. పదే పదే ఈ ప్రాంతంలో ఈ సమస్య తలెత్తుతోంది. డిప్యూటీ కమిషనర్ సమస్యను పరిష్కరించవచ్చు, కానీ రఘుపతి భట్‌ను సవాలు చేసే ధైర్యం ఎవరికీ లేదు ”అని CFI రాష్ట్ర అధ్యక్షుడు అన్నారు. ఈ వివాదానికి ఎమ్మెల్యే, బీజేపీ నేతలపై ఆయన నిందలు వేస్తున్నారు. ‘ఇది రఘుపతి భట్‌ రాజకీయం. యశ్‌పాల్‌ సువర్ణ (బీజేపీ నేత) రాజకీయంగా ఎదగాలని చూస్తున్నారని, అందుకే ఇలాంటి కుట్రలు పన్నుతున్నారని ఆయన ఆరోపిస్తున్నారు. బీజేపీ, సంఘ్‌పరివార్‌ విభజనకు పూనుకుంటున్నారని పుంజల్‌కట్టె అంటున్నారు. రాజకీయాలు.. కాషాయ జెండా కట్టడం, కాషాయ జెండా ఎగురవేయడం, ముస్లిం అమ్మాయిలపై దాడులు చేయడం.. ఇవన్నీ హిందూ, ముస్లింలను విభజించే బీజేపీ అజెండాలే.. బీజేపీకి చూపించే అభివృద్ధి ఏమీ లేదు, అందుకే ఎన్నికల్లో తమకు తోడ్పడే సమాజాన్ని పోలరైజ్ చేస్తున్నారు. అంటూ తీవ్రంగా విమర్శిస్తున్నారు పుంజల్‌కట్టె. ఆరోపణలను ఖండిస్తున్న బీజేపీ..

సిఎఫ్‌ఐ ఉడిపిలో విలేకరుల సమావేశం నిర్వహించి, ఈ సమస్య వెనుక భట్.. సంఘ్ పరివార్ ఉన్నారని ఆరోపించింది. CFI ఆరోపణలను తిప్పికొట్టిన బీజేపీ నేత రఘుపతి భట్‌, తాను ఈ విషయాన్ని నిశ్శబ్దంగా పరిష్కరించడానికి ప్రయత్నించానని, అయితే దానిని మీడియాకు లీక్ చేసింది CFI అని న్యూస్9తో చెప్పారు. “మా కాలేజీ నుంచి వార్తలు బయటకు రాకుండా ఉండేందుకు నేను నా వంతు ప్రయత్నం చేసాను. నేను విద్యార్థులు అలాగే, వారి తల్లిదండ్రులతో రెండు రౌండ్లు సమావేశాలు నిర్వహించాను. కానీ, మేము సమస్యను చర్చిస్తున్నప్పుడు కూడా SDPI అదేవిధంగా CFI వార్తలను లీక్ చేశాయి.” అని ఆయన చెప్పారు. అకస్మాత్తుగా ఈ సమస్య తఎందుకు తలెత్తింది అనే ప్రశ్నకు సమాధానంగా ఇది భారతదేశ పరువు తీయడానికి అంతర్జాతీయ సమూహాలు చేసిన కుట్ర అని భట్ ఆరోపించారు. “నవంబర్ 1న, మేము పాఠశాలలో 1,000 మంది విద్యార్థులందరినీ ఫోటో తీశాము. విద్యార్థులలో ఎవరూ ఆ సమయంలో హిజాబ్ ధరించలేదు. నిరసన వ్యక్తం చేస్తున్న ఆరుగురు బాలికలలో నవంబర్ 29 న హిజాబ్ లేకుండా CFI కార్యాలయం వద్ద ప్రమాణం చేయడం కనిపించింది. అకస్మాత్తుగా, డిసెంబర్ 30 నుంచి ఈ విద్యార్థులు తమ నిరసనలు ప్రారంభించారు. దీని వెనుక SDPI, క్యాంపస్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా వంటి కొన్ని సంస్థలు ఉన్నాయని ఇది స్పష్టంగా సూచిస్తుంది.” అంటూ ఆయన వివరించారు. పాకిస్థాన్ మీడియా, ఇస్లామిక్ న్యూస్ ఛానెల్స్‌లో కొన్ని అంతర్జాతీయ సంస్థలు దీని వెనుక ఉన్నట్టు స్పష్టం అవుతోంది. మన దేశంలో మహిళలకు స్వేచ్ఛ లేదన్న భావన కలిగించేందుకు రాష్ట్రానికి వ్యతిరేకంగా కుట్రలు పన్నుతున్నారు. ఈ సంస్థలు ఈ బాలికలకు మూడు రోజుల పాటు శిక్షణ ఇచ్చాయి. అని భట్ ఆరోపించారు. అయితే, ఈ ఆరోపణలను సిఎఫ్‌ఐ నాయకులూ ఖండించారు. తాము ఎవరికీ ఎటువంటి శిక్షణా ఇవ్వలేదని వారు చెప్పారు.

ఈ అంశంపై తమ వైఖరిని స్పష్టం చేస్తూ ఏబీవీపీ రాష్ట్ర సంయుక్త ఆర్గనైజింగ్ సెక్రటరీ బసవరాజు మాట్లాడుతూ.. తాము హిజాబ్‌తో పాటు కాషాయ వస్త్రాలకు వ్యతిరేకమని అన్నారు. “CFI ఆరోపణల్లో నిజం లేదు. CFI కాలేజీలో హిజాబ్ కావాలి, కానీ మేము హిజాబ్ అలాగే కాషాయం రెండింటికీ వ్యతిరేకం. మేము కొనసాగుతున్న నిరసనలలో పాల్గొనడం లేదు. మా సభ్యులు ఎవరూ అందులో భాగం కాదు.” అని చెప్పారు. న్యూస్ 9 తో మాట్లాడుతూ, మాజీ ప్రాథమిక.. మాధ్యమిక విద్యా శాఖ మంత్రి, బిజెపి ఎమ్మెల్యే ఎస్ సురేష్ కుమార్ వివాదానికి SDPI కారణమని ఆరోపించారు. “విషయం కోర్టులో ఉంది, అది తేల్చనివ్వండి.. నేను ఒక్కటి స్పష్టం చేయాలనుకుంటున్నాను, విద్యారంగంలో లేని కొన్ని శక్తులు ఈ సమస్యకు ఆజ్యం పోస్తున్నాయి. వారు విద్యార్థులను ఉపయోగించుకుంటున్నారు.” అని వ్యాఖ్యానించారు.

మొత్తమ్మీద ఈ అంశాన్ని విద్యార్ధుల సమస్యగా ఆ ప్రాంతంలోని రాజకీయ పరిశీలకులు భావించడం లేదు. ఇది రాజకీయ అంశం అనే వారు అభిప్రాయపడుతున్నారు. ఒకవైపు సిఎఫ్ఐ, మరోవైపు, బీజేపీ చేస్తున్న ప్రకటనలు.. వ్యాఖ్యానాలు కూడా ఇదే నిజమనే భావన ప్రజల్లో కలిగిస్తున్నాయి.

ఇవి కూడా చదవండి: Hijab row update: హిజాబ్‌ వివాదంపై కర్ణాటక హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు.. సోమవారం నుంచి..

Great Khali: ఎన్నికల వేల బీజేపీలో చేరిన మహా బలుడు.. ప్రధాని మోడీపై ది గ్రేట్ ఖలీ ప్రశంసలు..