కర్నాటక కొత్త సీఎం ఎవరన్న విషయంపై సస్పెన్స్ కొనసాగుతోంది. బెంగళూర్‌లో సీఎల్పీ సమావేశం జరుగుతోంది. హైకమాండ్ దూతగా మహారాష్ట్ర మాజీ సీఎం సుశీల్‌కుమార్ షిండే హాజరవుతున్నారు. ఎమ్మెల్యేల అభిప్రాయాలను పార్టీ అధిష్టానానికి నివేదిస్తారు షిండే. హోటల్ శాంగ్రిల హోటల్‌కు చేరుకున్నారు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు. అయితే, సీఎం పదవి కోసం సిద్దరామయ్య , డీకే శివకుమార్ మధ్య పోటీ మరింత ముదిరింది. ఈ క్రమంలో కాంగ్రెస్ అధ్యక్షుడు ఖర్గే ఢిల్లీకి చేరుకున్నారు. సోనియాగాంధీ, రాహుల్‌తో సమావేశమయ్యారు. కొత్త సీఎం ఎంపికపై చర్చించారు. ఎమ్మెల్యేల సమావేశం తరువాతనే సీఎం అభ్యర్ధిపై నిర్ణయం ఉంటుందని ఖర్గే తెలిపారు. సీఎల్పీ భేటీకి ముగ్గురు పరిశీలకులను నియమించామన్నారు ఖర్గే. ఎమ్మెల్యేల అభిప్రాయాన్ని పరిశీలకులు సేకరిస్తారని, ఆతరువాత హైకమాండ్‌కి ఎమ్మెల్యేల అభిప్రాయాన్ని నివేదిస్తారన్నారు. ఆ తర్వాత సీఎం ఎంపికను హైకమాండ్ నిర్ణయిస్తుందన్నారు.
ఈ క్రమంలో డీకే శివకుమార్ కీలక వ్యాఖ్యలు చేశారు. తాను గతంలో సిద్దరామయ్య కేబినెట్‌లో మంత్రిగా పనిచేశానని, పార్టీ కోసం ఎన్నో త్యాగాలు చేశానని అన్నారు. ఇప్పుడు కూడా సిద్దరామయ్యకు పూర్తిగా సహకరిస్తానని తెలిపారు. తుముకూరు లోని సిద్దగంగా మఠాన్ని సందర్శించారు శివకుమార్. వొక్కలిగ మఠాధిపతులంతా డీకే శివకుమార్‌ను సీఎం చేయాలని డిమాండ్ చేస్తున్నారు.
ఇదిలాఉంటే.. 18న కర్ణాటక నూతన సీఎం ప్రమాణ స్వీకారం ఉండనుంది. అదేరోజు కేబినెట్ మంత్రులు కూడా ప్రమాణం చేయనున్నారు. ఈ ప్రమాణ స్వీకారానికి సోనియాగాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీతోపాటు.. పలు రాష్ట్రాలకు చెందిన విపక్ష పార్టీల ముఖ్యమంత్రులు హాజరుకానున్నారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం..