Karnataka Elections: చివరి వారం రోజులు జోరుగా ప్రచారం… మోదీ, రాహుల్ మకాం.. ముగిసిన కర్ణాటక ప్రచార పర్వం
ఏప్రిల్ మూడవ వారంలో వెలువడిన ప్రీపోల్ సర్వేలలో హంగ్ అసెంబ్లీ రావడం ఖాయమని మెజారిటీ సర్వే సంస్థలు వెల్లడించడంతో ప్రజల తీర్పు తమ పక్షాన మళ్ళింప చేసుకునేందుకు రెండు ప్రధాన పార్టీలు యథాశక్తి ప్రయత్నం చేశాయి.

కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ప్రచార పర్వం ముగిసింది. కాంగ్రెస్, బిజెపిల మధ్య పోటాపోటీ ప్రచారం కొనసాగింది. ఇరు పార్టీల అగ్రనేతలు ప్రచార పర్వాన్ని హోరెత్తించారు అని చెప్పవచ్చు. ఏప్రిల్ మూడవ వారంలో వెలువడిన ప్రీపోల్ సర్వేలలో హంగ్ అసెంబ్లీ రావడం ఖాయమని మెజారిటీ సర్వే సంస్థలు వెల్లడించడంతో ప్రజల తీర్పు తమ పక్షాన మళ్ళింప చేసుకునేందుకు రెండు ప్రధాన పార్టీలు యథాశక్తి ప్రయత్నం చేశాయి. మరీ ముఖ్యంగా బిజెపి అధినాయకత్వం పరిస్థితిని గమనించి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చరిస్మానే తమని విజయపు బాట పట్టించగలదని విశ్వసించి, ఆయనని రంగంలోకి దింపింది. ఏప్రిల్ 29 నుంచి మే 7వ తేదీ వరకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కర్ణాటకవ్యాప్తంగా ప్రచారం నిర్వహించారు. చివరి మూడు రోజులు అంటే మే అయిదు, ఆరు, ఏడు తేదీలలో బెంగుళూరు రాజధానిలో కిలోమీటర్ల కొద్ది ఆయన రోడ్డు షోలను నిర్వహించారు. తొలి రోజు ఏకంగా 29 కిలోమీటర్ల మేర మోదీ రోడ్ షో జరిపారు. మోదీ విజయమే కర్ణాటక విజయం అన్న విధంగా ప్రధాని ప్రచార పర్వం కొనసాగింది. ఏ చిన్న అంశాన్ని కూడా వదలని మోదీ కన్నడ ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు యధాశక్తి ప్రయత్నం చేశారు.
పది రోజుల పాటు మోదీ ప్రచారం
నిజానికి కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల షెడ్యూలు వెలువడక ముందే బిజెపి అధినాయకత్వం మరీ ముఖ్యంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, హోం మంత్రి అమిత్ షా కర్ణాటకలో విరివిగా పర్యటనలు చేశారు. ఆ రాష్ట్రానికి పలు ప్రాజెక్టులను మంజూరు చేశారు. వేలకోట్ల రూపాయల అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు. ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా కమలనాధులు ఎన్నో వ్యూహాలను అమలు చేశారు. ఇక షెడ్యూలు వెలువడిన తర్వాత బిజెపి నేతల రాకపోకలు మరింత పెరిగాయి. ప్రచార పర్వంలో చివరి వారంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పలు బహిరంగ సభలలో ప్రసంగించారు. టెర్రరిజం దగ్గర నుంచి ది కేరళ స్టోరీ సినిమా దాకా నరేంద్ర మోదీ టచ్ చేయని అంశం లేదంటే అతిశయోక్తి కాదు. పలు సభలలో కన్నడ భాషలో తన ప్రసంగాన్ని మొదలుపెట్టడం ద్వారా స్థానికుల అభిమానాన్ని చురగొనేందుకు ప్రధాని మోదీ ప్రయత్నించారు.
రాహుల్ త్యాగాల పాట
ఇక కాంగ్రెస్ పార్టీ తరపున రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే కర్ణాటక ప్రచారంలో చురుగ్గా పాల్గొన్నారు. ప్రియాంక గాంధీ కొన్ని సభలకు పరిమితం కాాగా మల్లికార్జున ఖర్గే ఉత్తర కర్ణాటక పైనే ఎక్కువ దృష్టి సారించారు. రాహుల్ గాంధీ మాత్రం సభలలో ప్రసంగించడంతోపాటు స్థానికులతో మమేకమయ్యేందుకు యత్నించారు. ప్రజా రవాణా బస్సులలో ప్రయాణం చేశారు. కిందిస్థాయి ఓటర్లను కలిసేందుకు ప్రయత్నించారు. కొన్నిచోట్ల బైకుల మీద కూడా రాహుల్ గాంధీ ప్రయాణించడం.. వాటి ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం కూడా జరిగింది. సామాన్యులతో మమేకమయ్యే గుణం కాంగ్రెస్ పార్టీ నేతలకు మాత్రమే ఉందని చాటేందుకు రాహుల్ గాంధీ ప్రాధాన్యం ఇచ్చినట్లు అవగతం అవుతోంది. గాంధీ కుటుంబీకుల త్యాగాలను రాహుల్, ప్రియాంక తమ ప్రసంగాలలో ప్రధానంగా ప్రస్తావించారు. మోదీ ఏ టెర్రరిజం గురించి అయితే మాట్లాడుతున్నారో అదే టెర్రరిజానికి తమ కుటుంబీకులు బలి అయ్యారని రాహుల్ గాంధీ చెప్పుకొచ్చారు. ఒకరకంగా చెప్పాలంటే మల్లికార్జున ఖర్గే కంటే ఎక్కువగా రాహుల్ గాంధీనే ప్రచార పర్వంలో పాల్గొన్నారు. మోదీకి దీటుగా ప్రచారం చేసేందుకు రాహుల్ గాంధీ ప్రయత్నం చేశారు. కాంగ్రెస్ నేతల్లోనే 85% కమిషన్ కరప్షన్ ఇమిడి ఉందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆరోపిస్తే.. కర్ణాటక బిజెపి నేతలకు 40 శాతం కరప్షన్ వాటా అలవాటని రాహుల్ గాంధీ ఎదురుదాడి చేశారు.
దక్షిణాదికే జెడీఎస్ పరిమితం
ఇక కర్ణాటకలో మూడో ప్రధాన పక్షం జనతా సెక్యులర్ మాత్రం దక్షిణ కర్ణాటక ప్రాంతానికి పరిమితమైనట్లు కనిపించింది. తమ పార్టీకి బాగా పట్టున్న ప్రాంతాల్లోని సీట్లను తిరిగి గెలుచుకోవడం ద్వారా హంగ్ అసెంబ్లీ ఏర్పడితే కింగ్ మేకర్ కావాలన్న ఉద్దేశం జెడిఎస్ పార్టీ అధినేత కుమారస్వామిలో కనిపించింది. దాంతో దక్షిణ కర్ణాటక ప్రాంతంలోని కొన్ని జిల్లాలపైనే ఆ పార్టీ నేతలు ఎక్కువగా ప్రచారం చేశారు సెంట్రల్ కర్ణాటకలోని తుమకూరు జిల్లాలో నాలుగు అసెంబ్లీ సీట్లున్న జేడీఎస్ పార్టీ వాటిని కాపాడుకునే ప్రయత్నం చేసింది. అయితే జెడిఎస్ ప్రచారంలో చురుకుగా ఉండకపోవడానికి కారణం ఆ పార్టీకి కాంగ్రెస్ పార్టీతో ఉన్న లోపాయికారి ఒప్పందమే కారణమని కమలనాథులు ఆరోపించారు. ప్రీపోల్ సర్వేలలో ఎక్కువ సర్వేలు కర్ణాటకలో హంగ్ అసెంబ్లీని సూచించాయి ఒక్క టీవీ9-సి ఓటర్ సర్వే మాత్రం కాంగ్రెస్ పార్టీదే విజయం అని చాటింది. పీపుల్ సర్వేల ఫలితాలను చూసిన బిజెపి వ్యూహం మార్చింది. ప్రధాని నరేంద్ర మోదీని రంగంలోకి దింపింది. దాంతో ఆయన దాదాపు పది రోజుల పాటు కర్ణాటకకే పరిమితమయ్యారు. ప్రతిరోజు బహిరంగ సభలలో పాల్గొన్నారు. మూడు రోజులపాటు రోడ్ షోలు నిర్వహించారు. కన్నడ ఓటర్ల మదిని గెలుచుకునేందుకు ప్రయత్నం చేశారు. డబుల్ ఇంజన్ సర్కార్ వస్తే కర్ణాటక.. దేశంలోనే అగ్రగామిగా మారుతుందన్న భరోసా కల్పించే ప్రయత్నం చేశారు. ప్రధాని ప్రచారం ఏ మేరకు ఫలితం ఇస్తుందో కానీ బిజెపి నేతల్లో మాత్రం ప్రచార పర్వంలో చివరి వారం రోజులు కన్నడ ఓటర్లను పూర్తిగా తమకు అనుకూలంగా మార్చి వేశాయని చెప్పుకుంటున్నారు. మే పదవ తేదీన ఓటర్ల తీర్పు ఈవీఎంలలోకి చేరుతుంది. మే 13వ తేదీన మధ్యాహ్నం కర్ణాటకలో రాజెవరో తేలబోతోంది.




