కాషాయం కండువా కప్పుకున్న సింధియా .. ఇక అసెంబ్లీలో కమల్ నాథ్ బల పరీక్ష?

కాంగ్రెస్ పార్టీతో తన 18 ఏళ్ళ అనుబంధానికి స్వస్తి చెప్పి.. ఆ పార్టీకి గుడ్ బై చెప్పిన జ్యోతిరాదిత్య సింధియా లాంఛనంగా బుధవారం బీజేపీలో చేరారు.

కాషాయం కండువా కప్పుకున్న సింధియా .. ఇక అసెంబ్లీలో కమల్ నాథ్  బల పరీక్ష?
Follow us
Umakanth Rao

| Edited By: Pardhasaradhi Peri

Updated on: Mar 11, 2020 | 3:34 PM

కాంగ్రెస్ పార్టీతో తన 18 ఏళ్ళ అనుబంధానికి స్వస్తి చెప్పి.. ఆ పార్టీకి గుడ్ బై చెప్పిన జ్యోతిరాదిత్య సింధియా లాంఛనంగా బుధవారం బీజేపీలో చేరారు. పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ఆయనకు పార్టీ కండువా కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. ఇక మధ్యప్రదేశ్ లో సీఎం కమల్ నాథ్ ప్రభుత్వం రాష్ట్ర అసెంబ్లీలో బలపరీక్షను తప్పనిసరిగా ఎదుర్కొనవలసిన పరిస్థితి ఏర్పడింది. సింధియా వెంట ఉన్న ఆరుగురు మంత్రుల రాజీనామాలను ఆమోదిస్తున్నట్టు స్పీకర్ ప్రజాపతి ప్రకటించారు.

ఈ మంత్రులను సభ్యత్వానికి అనర్హులుగా ప్రకటించాలని రాష్ట్ర కాంగ్రెస్ డిమాండ్ చేస్తోంది. కాగా- కాంగ్రెస్ పార్టీకి సింధియా ద్రోహం చేశారని ఆరోపిస్తూ భోపాల్ లో పార్టీ కార్యకర్తలు ఆయన పోస్టర్లను దగ్ధం చేశారు. తన ప్రభుత్వం మైనారిటీలో పడినప్పటికీ సభలో తన ప్రభుత్వ మెజారిటీని నిరూపించుకోగలనని కమల్ నాథ్ మళ్ళీ విశ్వాసం వ్యక్తం చేశారు. సింధియా వెంట ఉన్న ఎమ్మెల్యేల్లో పలువురు తిరిగి తమ ‘శిబిరం’ లోకివస్తారని ఆయన అన్నారు. వారిలో చాలామంది అసంతృప్తితో ఉన్నట్టు తెలిసిందన్నారు. బహుశా ఈ నెల 16 లోగా రాష్ట్ర శాసన సభలో కమల్ నాథ్ బల పరీక్షను ఎదుర్కోవలసి రావచ్ఛు.