Justice NV Ramana: సుప్రీంకోర్టు ప్రదాన న్యాయమూర్తిగా ఎన్వీ రమణ.. సీజేఐ పదవి చేపట్టనున్న రెండో తెలుగు వ్యక్తిగా రికార్డు

తెలుగు తేజం జస్టిస్ నూతలపాటి వెంకట రమణను సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా నియమిస్తూ రాష్ట్రపతి రామ్ నాధ్ కోవింద్ ఉత్తర్వులు జారీ చేశారు.

Justice NV Ramana: సుప్రీంకోర్టు ప్రదాన న్యాయమూర్తిగా ఎన్వీ రమణ.. సీజేఐ పదవి చేపట్టనున్న రెండో తెలుగు వ్యక్తిగా రికార్డు
Justice NV Ramana
Follow us
Balaraju Goud

|

Updated on: Apr 06, 2021 | 1:26 PM

justice nv ramana as CJI: తెలుగు తేజం జస్టిస్ నూతలపాటి వెంకట రమణను సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా నియమిస్తూ రాష్ట్రపతి రామ్ నాధ్ కోవింద్ ఉత్తర్వులు జారీ చేశారు . ప్రస్తుత చీఫ్ జస్టిస్ బాబ్డే ఏప్రిల్ 23న పదవీ విరమణ చేయనున్న సంగతి తెలిసిందే. బాబ్డే స్థానంలో జస్టిస్ ఎన్వీ రమణ ఈ పదవిలో కూర్చోనున్నారు. 2021 ఏప్రిల్ 24 నుండి 2022 ఆగస్టు 26వ తేదీ వరకు జస్టిస్ రమణ ఈ పదవిలో కొనసాగనున్నారని ఆ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు రాష్ట్రపతి. ఎన్‌వీ రమణ నియామకం పట్ల తెలుగు రాష్ట్రాల ప్రజలే కాదు..న్యాయకోవిదులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

సీనియారిటీ ప్రకారం జస్టిస్‌ ఎన్వీ రమణను తదుపరి ప్రధాన న్యాయమూర్తిగా నియమించాలని జస్టిస్‌ బాబ్డే కేంద్ర న్యాయశాఖకు సిఫార్సు చేశారు. ఈ ప్రతిపాదనలను పరిశీలించిన కేంద్ర న్యాయశాఖ.. రాష్ట్రపతి ఆమోదానికి పంపింది. తాజాగా, ఇందుకు సంబంధించి రాష్ట్రపతి ఆమోద ముద్ర వేయడంతో జస్టిస్ ఎన్వీ రమణ నియామకం ఖరారయ్యింది.

జస్టిస్ ఎన్‌వీ.రమణ సుప్రీంకోర్టుకు 48వ ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలు స్వీకరించనున్నారు. ఈనెల 24న రాష్ట్రపతి రామ్ నాధ్ కోవింద్ ఆయన చేత ప్రమాణ స్వీకారం చేయించనున్నారు. ఇక, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలు చేపట్టనున్న రెండో తెలుగు వ్యక్తిగా జస్టిస్ ఎన్వీ రమణ చరిత్ర సృష్టించనున్నారు. గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కు చెందిన జస్టిస్ కోకా సుబ్బారావు 1966 జూన్ 30 నుంచి 1967 ఏప్రిల్ 11 వరకూ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా పనిచేశారు.

జస్టిస్ ఎన్వీ రమణ 1957 ఆగస్టు 27న ఆంధ్రప్రదేశ్‌లోని కృష్ణా జిల్లా పొన్నవరం గ్రామంలో గణపతిరావు, సరోజిని జస్టిస్‌ వెంకటరమణ దంపతులకు జన్మించారు. ఆయన తల్లిదండ్రులది ఒక సాధారణ వ్యవసాయ కుటుంబం కావడం విశేషం. కంచికర్లలో ఉన్నత పాఠశాల విద్యాభ్యాసం పూర్తి చేసుకున్న ఆయన.. అమరావతిలోని ఆర్.వి.వి.ఎన్.కాలేజీలో బీఎస్సీలో పట్టా సాధించారు. అనంతరం 1982 లో నాగార్జున విశ్వవిద్యాలయంలో న్యాయశాస్త్రంలో డిగ్రీ పూర్తి చేసిన జస్టిస్‌ రమణ.. 1983 ఫిబ్రవరి 10న బార్‌ అసోసియేషన్‌లో పేరు నమోదు చేసుకున్నారు. అంచలంచెలుగు ఎదుగుతూ హైకోర్టు న్యాయమూర్తిగా స్థాయికి చేరుకున్నారు. అనంతరం.. 2000 సంవత్సరంలో జూన్‌ 27న ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టు శాశ్వత న్యాయమూర్తిగా నియమితులయ్యారు. 2013 మార్చి 10 నుంచి మే 20 వరకూ ఏపీ హైకోర్టు యాక్టింగ్ ఛీఫ్ జస్టిస్‌గా కూడా పనిచేశారు.

ఆంధ్రప్రదేశ్ హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తిగా కూడా విధులు నిర్వహించారు. ఆ తరువాత 2013 సెప్టెంబరు 2న ఢిల్లీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా పని చేశారు. 2014 ఫిబ్రవరి 17న సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా ఉన్నతస్థాయికి ఎదిగారు. 2017 ఫిబ్రవ‌రి 14 నుంచి సుప్రీంకోర్టు జ‌డ్జిగా పదవి బాధ్యతలు నిర్వహించారు.

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా చంద్రబాబు ఉన్న సమయంలో ఏపీ ప్రభుత్వ అదనపు అడ్వకేట్ జనరల్ గా పనిచేశారు. సెంట్రల్ అడ్మినిస్ట్రేటివ్ ట్రైబ్యునల్(క్యాట్), ఉమ్మడి ఏపీ హైకోర్టు, సుప్రీం కోర్టుల్లో ప్రాక్టీసు చేశారు. అంతేకాదు వివిధ ప్రభుత్వ సంస్థలకు పానెల్ కౌన్సిల్ మెంబర్‌గా ఉన్నారు. క్యాట్‌లో కేంద్ర ప్రభుత్వం, రైల్వేల తరఫున కూడా వకాల్తా పుచ్చుకున్నారు.

హైకోర్టుతో పాటు కేంద్ర, రాష్ట్ర పరిపాలనా ట్రిబ్యునళ్లలో ప్రాక్టీస్ చేపట్టిన వెంకటరమణ.. సుప్రీంకోర్టులో కూడా పలు కేసులు వాదించారు. రాజ్యాంగపరమైన, క్రిమినల్, సర్వీస్, అంతర్రాష్ట్ర నదీ జలాల సంబంధిత కేసుల వాదన ఆయన ప్రత్యేకతలు. పలు ప్రభుత్వ సంస్థలకు ప్యానల్ అడ్వకేట్‌గా వ్యవహరించిన వెంకటరమణ.. కేంద్ర ప్రభుత్వ అదనపు స్టాండింగ్ కౌన్సిల్‌గా పని చేశారు. కేంద్రప్రభుత్వ అదనపు అడ్వకేట్ జనరల్‌గానూ బాధ్యతలు నిర్వర్తించిన వెంకటరమణ.. దేశ, విదేశాల్లో జరిగిన పలు న్యాయసదస్సుల్లో ప్రసంగాలు చేశారు. ఎన్వీ రమణ నియాకం పట్ల తెలుగు రాష్ట్రాల ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

Read Also…