ఎన్నికల రాష్ట్రంలో 21 మంది అధికారులపై వేటు.. కారణం ఏంటంటే?
ప్రభుత్వ ఉద్యోగులు ఎన్నికల విధుల్లో పాల్గొంటే వారికి టీఏ, డీఏల రూపంలో అదనపు ఆదాయం లభిస్తుంది. కానీ ఎన్నికల విధులకు బదులు ప్రచారంలో పాల్గొంటే ఏం జరుగుతుంది? సస్పెన్షన్ వేటు పడుతుంది. జమ్ము కాశ్మీర్‌లో ఇదే జరిగింది. ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నందుకు 21 మంది ప్రభుత్వోద్యోగులు సస్పెండ్ అవగా, మరో ఐదుగురు కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులను విధుల నుంచి తప్పుకోవాల్సి వచ్చింది.
ప్రభుత్వ ఉద్యోగులు ఎన్నికల విధుల్లో పాల్గొంటే వారికి టీఏ, డీఏల రూపంలో అదనపు ఆదాయం లభిస్తుంది. కానీ ఎన్నికల విధులకు బదులు ప్రచారంలో పాల్గొంటే ఏం జరుగుతుంది? సస్పెన్షన్ వేటు పడుతుంది. జమ్ము కాశ్మీర్‌లో ఇదే జరిగింది. ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నందుకు 21 మంది ప్రభుత్వోద్యోగులు సస్పెండ్ అవగా, మరో ఐదుగురు కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులను విధుల నుంచి తప్పుకోవాల్సి వచ్చింది. ప్రస్తుతం అసెంబ్లీ కల్గిన కేంద్ర పాలిత ప్రాంతంగా ఉన్న జమ్ము-కాశ్మీర్‌లో అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్నాయి. ఇప్పటికే మొదటి దశ పోలింగ్ పూర్తవగా, సెప్టెంబర్ 25 (రేపు) 2వ దశ పోలింగ్ జరగనుంది. ఎన్నికలను పూర్తి పారదర్శకంగా, నిష్పక్షపాతంగా నిర్వహించేందుకు కేంద్ర ఎన్నికల సంఘం అన్ని రకాలుగా ప్రయత్నాలు చేస్తోంది. ఈ క్రమంలో కొంతమంది ప్రభుత్వోద్యోగులు తమకు నచ్చిన రాజకీయ పార్టీల కోసం ప్రచారం కూడా చేస్తున్న విషయం ఈసీ (ECI) దృష్టికి వచ్చింది. దీనిపై క్షేత్రస్థాయిలో విచారణ జరిపించిన చీఫ్ ఎలక్ట్రోరల్ ఆఫీసర్ (CEO), ఆ నివేదికను ఆధారంగా చేసుకుని 21 మంది అధికారులపై సస్పెన్షన్ వేటు వేశారు. మరో ఐదుగురు కాంట్రాక్ట్, ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులు కావడంతో వారిని విధుల నుంచి తప్పిస్తూ ఆదేశాలు జారీ చేశారు. వీరితో పాటు మరో 20 మందిని తాము పనిచేస్తున్న కార్యాలయాల నుంచి మరో ప్రాంతానికి బదిలీచేసి, ఇతర కార్యాలయాలకు అటాచ్ చేశారు. మొత్తం 51 మందిపై ఈ తరహా ఫిర్యాదులు రాగా, క్షేత్రస్థాయిలో విచారణలో ఎవరైతే రాజకీయ పార్టీలకు అనుకూలంగా ప్రచారం చేస్తున్నారని తేలిందో వారిపైనే చర్యలు తీసుకున్నామని ఎన్నికల అధికారులు వెల్లడించారు.
2వ దశ పోలింగ్‌కు సర్వం సిద్ధం
సెప్టెంబర్ 18న జరిగిన మొదటి దశ పోలింగ్ ప్రశాంతంగా ముగియడంతో పాటు అనూహ్య రీతిలో 60 శాతాన్ని దాటి పోలింగ్ నమోదుకావడంతో కేంద్ర ఎన్నికల సంఘం అధికారులు 2వ దశ పోలింగ్ కోసం మరింత ఉత్సాహంగా ఏర్పాట్లు చేస్తున్నారు. నిజానికి మొదటి దశలో దక్షిణ కాశ్మీర్‌లోని ఉగ్రవాద ప్రభావిత ప్రాంతాలైన పుల్వామా, కుల్గాం, షోఫియాం, అనంత్‌నాగ్, దోడా, కిష్త్వార్ వంటి జిల్లాలు ఉండగా.. అక్కడ ఎన్నికల నిర్వహణ ఒక సవాలుగా మారింది. దాదాపు ప్రతి రోజూ ఉగ్రవాదులకు – భద్రతా బలగాలకు మధ్య కాల్పులతో దద్దరిల్లుతున్న ఈ రాష్ట్రంలో ఇప్పుడు 2వ దశ పోలింగ్ కోసం కూడా కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు జరుగుతున్నాయి. ప్రతి పోలింగ్ స్టేషన్‌కు 3 అంచెల భద్రత కల్పించారు. రాష్ట్ర పోలీసులు, కేంద్ర పారామిలటరీ బలగాలు, ఆర్మీ యూనిట్లు ఈ భద్రతా విధుల్లో పాల్గొంటున్నాయి. లైన్ ఆఫ్ కంట్రోల్ (LoC)కు సమీపంలో ఉన్న పోలింగ్ స్టేషన్ల వద్ద మరింత కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేశారు.
2వ దశలో 6 జిల్లాల్లోని 26 అసెంబ్లీ నియోజకవర్గాలకు పోలింగ్ జరగనుంది. వీటిలో కాశ్మీర్ లోయలోని గందర్బల్, శ్రీనగర్, బుద్గాం జిల్లాలు ఉండగా, జమ్ము ప్రాంతంలోని రియాసీ, రాజౌరీ, పూంఛ్ జిల్లాలున్నాయి. ఈ విడతలో మొత్తం 25.78 లక్షల మంది ఓటర్లు తమ ఓటుహక్కు వినియోగించుకోనున్నారు. ఈ విడతలో పోలింగ్ జరిగే ప్రాంతాల్లో నేషనల్ కాన్ఫరెన్స్ వైస్ ప్రెసిడెంట్ ఒమర్ అబ్దుల్లా పోటీ చేస్తున్న 2 నియోజకవర్గాలు ఉన్నాయి.
మరిన్ని జాతీయ వార్తలు చదవండి