జలియన్ వాలాబాగ్ ఘటనకు 105 ఏళ్లు.. లండన్ వెళ్లి మరీ ప్రతీకారం తీర్చుకున్న విప్లవీరుడు ఉధమ్ సింగ్ గురించి తెలుసా..
జనరల్ డయ్యర్‌ను చంపాలని నిర్ణయం తీసుకున్న ఉధమ్ సింగ్.. భారతదేశ స్వాతంత్ర్యం కోరుకుంటున్న ఉన్న ఇతర దేశాలలోని వ్యక్తులను సంప్రదించడం ప్రారంభించాడు. అతను జపాన్, బర్మా, ఇటలీ, జర్మనీ, పోలాండ్ , ఫ్రాన్స్ నుండి విప్లవకారులను సంప్రదించాడు. అయితే 1927 సంవత్సరంలో, జనరల్ డయ్యర్ అనారోగ్యంతో మరణించాడు. విప్లవకారులకు ఆయుధాలు ఇచ్చాడనే ఆరోపణలపై ఉధమ్ సింగ్‌ను బ్రిటిష్ వారు జైలుకు పంపారు. అప్పటికీ ప్రతీకార భావం అతనిలో తగ్గలేదు.
బ్రిటిష్ వారి దాస్య శృంఖలాల నుంచి విముక్తి పొందాలని భారతదేశంలో ఉద్యమం జరుగుతోంది.. అదే సమయంలో బ్రిటిష్ ప్రభుత్వం భారతీయులకు ఉచ్చు బిగించడానికి కొత్త చట్టాలను తీసుకువస్తోంది. వీటిలో ఒకటి రౌలత్ చట్టం. 1919లో రౌలత్ చట్టాన్ని ప్రవేశపెట్టినప్పుడు.. దీనిని భారతీయులు తీవ్రంగా వ్యతిరేకించారు. ఈ చట్టానికి నిరసనగా 1919 ఏప్రిల్ 13న బైశాఖి రోజున అమృత్‌సర్‌లోని జలియన్‌వాలాబాగ్ వేదికగా ఒక సమావేశాన్ని ఏర్పాటు చేసుకున్నారు. శాంతియుతంగా జరుగుతున్న సభలో వేలాది మంది పాల్గొన్నారు. అయితే ఎలాంటి ముందస్తు హెచ్చరికలు చేయకుండా బ్రిటిష్ అధికారి జనరల్ డయ్యర్ ఈ సమావేశంపై విచక్షణారహితంగా కాల్పులు జరిపారు.
జలియన్‌వాలాబాగ్‌లో వేలాది మంది చనిపోయారు. భారీ సంఖ్యలో గాయపడ్డారు. ఈ దురాగతానికి అప్పటి గవర్నర్ జనరల్ కూడా డయ్యర్‌కు మద్దతు పలికారు. జలియన్ వాలాబాగ్ మారణకాండ జరిగిన 21 ఏళ్ల తర్వాత ఉధమ్ సింగ్ ప్రతీకారం తీర్చుకున్నాడు. భారత చరిత్రలో చీకటి రోజు.. జలియన్ వాలాబాగ్ ఊచకోత శనివారం 105 సంవత్సరాలు పూర్తి చేసుకుంది.
బ్రిగేడియర్ జనరల్ రెజినాల్డ్ డయ్యర్ ఆదేశాలు జారీ
బైసాఖి రోజు 13 ఏప్రిల్ 1919న రౌలత్ చట్టానికి వ్యతిరేకంగా అమృత్‌సర్‌లోని జలియన్‌వాలా బాగ్ సహా దేశవ్యాప్తంగా శాంతియుత ప్రదర్శన జరుగుతోంది. జలియన్‌వాలా బాగ్ సమావేశానికి వేలాది మంది ప్రజలు హాజరయ్యారు. ఈ ప్రదర్శన సమయంలో బ్రిటిష్ బ్రిగేడియర్ జనరల్ రెజినాల్డ్ డయ్యర్ తన బృందంతో అకస్మాత్తుగా అక్కడికి చేరుకున్నాడు. తన సైన్యంతో జలియన్ వాలాబాగ్‌ను అన్ని వైపుల నుండి చుట్టుముట్టాడు. జనరల్ డయ్యర్ ఎటువంటి హెచ్చరికలు ఇవ్వకుండా నిరాయుధ నిరసనకారులపై కాల్పులు జరపాలని ఆదేశించాడు. దీంతో బ్రిటీష్ సైనికుల చేతిలోని తుపాకులు గర్జించాయి. దీంతో జలియన్ వాలాబాగ్ మృతదేహాలతో నిండిపోయింది. ఈ కాల్పుల్లో వెయ్యి మందికి పైగా చనిపోయారు. ఒకటిన్నర వేల మందికి పైగా గాయపడ్డారు. ఆ సమయంలో పంజాబ్ గవర్నర్‌గాఉన్న మైఖేల్ ఓడ్వైర్ కూడా మారణకాండకు సాక్ష్యంగా నిలిచాడు. జనరల్ డయ్యర్‌తో పాటు నిలబడి వినోదంగా చూశాడు.
ఉధమ్ సింగ్ మనసులో ప్రతీకార జ్వాల
జలియన్‌వాలాబాగ్‌లో జరిగిన ఊచకోత సమయంలో అక్కడ 20-21 ఏళ్ల యువకుడు కూడా ఉన్నాడు. అతని పేరు ఉధమ్ సింగ్. అనాథాశ్రమంలో పెరిగిన ఉధమ్ సింగ్ బ్రిటీష్ అధికారి జనరల్ డయ్యర్ చర్యలను తన కళ్లతో చూసినప్పుడు అతని హృదయంలో ప్రతీకార జ్వాల రాజుకుంది. ఈ ఘటనపై పంజాబ్‌తో పాటు యావత్ దేశంలో ఆగ్రహావేశాలు వ్యక్తం అయ్యాయి. ఇంత మంది మరణానికి కారణమైన జనరల్ డయ్యర్‌ను తన చేతులతో చంపాలని ఉధమ్ సింగ్ నిర్ణయించుకున్నాడు. దీని తరువాత ఉధమ్ సింగ్ దేశ స్వాతంత్ర్యం కోసం పోరాడుతున్న విప్లవకారులతో చేతులు కలిపాడు. ఉద్యమంలో చేరాడు.
వనరులను సేకరించడం ప్రారంభించిన ఉధమ్ సింగ్
ఉధమ్ సింగ్ మొదట గదర్ పార్టీలో చేరారు. ఆ తర్వాత ఆజాద్ పార్టీ పేరుతో సొంత పార్టీని స్థాపించి మెల్లగా తన లక్ష్యం దిశగా పయనించడం మొదలుపెట్టాడు. ఇంతలో షహీద్ భగత్ సింగ్‌ను కలిశాడు. మరోవైపు జనరల్ డయ్యర్‌ను చంపాలనే కోరిక మనసులో బలపడుతోంది. అందుకోసం వనరుల సేకరణ ప్రారంభించారు. ఇదిలా ఉండగా జలియన్‌వాలాబాగ్ ఊచకోతపై దర్యాప్తు చేసేందుకు అప్పటి భారత విదేశాంగ కార్యదర్శి ఎడ్విన్ మాంటెగ్ హంటర్ కమిషన్‌ను ఏర్పాటు చేశాడు.
బ్రిగేడియర్ జనరల్ రెజినాల్డ్ డయ్యర్ ముందుగానే కాల్పులు జరపాలనే నిర్ణయం తీసుకుని జలియన్‌వాలాబాగ్‌కు వెళ్లినట్లు కమిషన్ ముందు అంగీకరించాడు. దీని తరువాత బ్రిగేడియర్ జనరల్ రెజినాల్డ్ డయ్యర్ కల్నల్ స్థాయికి దిగజారారు. మరోవైపు ఈ ఘటనపై ప్రపంచవ్యాప్తంగా బ్రిటిష్ వారిపై విమర్శలు తలెత్తాయి. జనరల్ డయ్యర్ పై తీవ్ర ఒత్తిడి ఏర్పడింది. దీంతో అతను 1920లో రాజీనామా చేసి, ఆరోగ్య కారణాలను చూపించి బ్రిటన్‌కు తిరిగి పంపించేశారు.
ఎన్నో దేశాలు దాటి లండన్ చేరుకున్న ఉధమ్ సింగ్
అయితే జనరల్ డయ్యర్‌ను చంపాలని నిర్ణయం తీసుకున్న ఉధమ్ సింగ్.. భారతదేశ స్వాతంత్ర్యం కోరుకుంటున్న ఉన్న ఇతర దేశాలలోని వ్యక్తులను సంప్రదించడం ప్రారంభించాడు. అతను జపాన్, బర్మా, ఇటలీ, జర్మనీ, పోలాండ్ , ఫ్రాన్స్ నుండి విప్లవకారులను సంప్రదించాడు. అయితే 1927 సంవత్సరంలో, జనరల్ డయ్యర్ అనారోగ్యంతో మరణించాడు. విప్లవకారులకు ఆయుధాలు ఇచ్చాడనే ఆరోపణలపై ఉధమ్ సింగ్‌ను బ్రిటిష్ వారు జైలుకు పంపారు. అప్పటికీ ప్రతీకార భావం అతనిలో తగ్గలేదు.
జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత ఉధమ్ సింగ్ 1934లో మారువేషంలో నైరోబీ, ఆఫ్రికా, బ్రెజిల్ తదితర దేశాల మీదుగా లండన్ చేరుకున్నాడు. అక్కడ కారు, రివాల్వర్ కొన్నాడు. జనరల్ డయ్యర్ మరణించినప్పటికి జలియన్‌వాలాబాగ్ మారణకాండలో డయ్యర్ తో పాటు నిలబడి కనిపించిన గవర్నర్ మైఖేల్ ను చంపాలని నిర్ణయించుకున్నాడు.
మైఖేల్ డయ్యర్ ఛాతీలోకి దూసుకెళ్లిన బుల్లెట్లు
మార్చి 13, 1940న జలియన్‌వాలాబాగ్ మారణకాండ జరిగి 21 ఏళ్లు పూర్తయ్యాయి. లండన్‌లోని రాయల్ సెంట్రల్ ఏషియన్ సొసైటీకి చెందిన కాక్స్టన్ హాల్‌లో ఓ కార్యక్రమం జరిగింది. ఇందులో మైఖేల్ డయ్యర్ కూడా ప్రసంగం చేస్తున్నాడు. అక్కడకు ఉధమ్ సింగ్ రివాల్వర్‌ని పుస్తకంలో దాచుకుని అక్కడికి చేరుకున్నాడు. మైఖేల్ డయ్యర్ తన ప్రసంగంలో మరోసారి జలియన్ వాలాబాగ్ మారణకాండను ప్రస్తావిస్తూ, అవకాశం ఇస్తే జలియన్ వాలాబాగ్ మారణకాండను పునరావృతం చేస్తానని అన్నారు. ఇది విన్న ఉధమ్ సింగ్ తన రివాల్వర్ తో బుల్లెట్ల వర్షం కురిపించాడు. 21 ఏళ్ల క్రితం చేసిన శబధం నెరవేన తర్వాత ఉధమ్ సింగ్ నవ్వుతూ నిలబడ్డాడు. బ్రిటిష్ వారు అతన్ని అరెస్టు చేసి 1940 జూలై 31న లండన్‌లో ఉరితీశారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..