AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ISROలో ప్రైవేటీకరణ కలకలం.. కులశేఖరపట్నం లాంచ్ సెంటర్‌పై ఉద్యోగుల వ్యతిరేకత

భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో తీసుకున్న కీలక నిర్ణయంపై ఇప్పుడు ఉద్యోగుల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. గత కొన్ని సంవత్సరాలుగా మన దేశ అవసరాల కోసమే కాకుండా, శ్రీహరికోట నుంచి ఇస్రో చేపడుతున్న ప్రయోగాల ద్వారా ఇతర దేశాలకు చెందిన ఉపగ్రహాలను కూడా విజయవంతంగా అంతరిక్ష కక్ష్యలోకి ప్రవేశపెడుతోంది. ఇప్పటివరకు వందలాది విదేశీ ఉపగ్రహాలను విజయవంతంగా కక్ష్యలోకి ప్రవేశపెట్టిన ఘనత ఇస్రోకు ఉంది. దీంతో అంతర్జాతీయ మార్కెట్‌లో వాణిజ్య ప్రయోగాల కోసం ఇస్రోకు విపరీతమైన డిమాండ్ పెరిగింది. ఈ పెరుగుతున్న అవసరాలకు అనుగుణంగా, త్వరితగతిన ప్రయోగాలు చేపట్టేందుకు చిన్న తరహా రాకెట్ల అభివృద్ధిపై కూడా ఇస్రో ప్రత్యేక దృష్టి సారించింది..

ISROలో ప్రైవేటీకరణ కలకలం.. కులశేఖరపట్నం లాంచ్ సెంటర్‌పై ఉద్యోగుల వ్యతిరేకత
ISRO Staff Oppose Private Management Plan
Ch Murali
| Edited By: |

Updated on: Sep 08, 2026 | 9:45 AM

Share

సాధారణంగా పీఎస్ఎల్వీ, జీఎస్ఎల్వీ వంటి ప్రయోగ వాహకాలను సిద్ధం చేసి ప్రయోగించేందుకు నెలల సమయం పడుతుంది. ఒక్కో ప్రయోగానికి రెండు నుంచి మూడు నెలల సమయం కూడా అవసరమవుతుంది. అయితే చిన్న ఉపగ్రహాలను తక్కువ సమయంలో అంతరిక్షంలోకి పంపేందుకు ఎస్ఎస్ఎల్వీ — స్మాల్ శాటిలైట్ లాంచ్ వెహికల్ — అనే కొత్త తరహా ప్రయోగ వాహకాన్ని ఇస్రో అభివృద్ధి చేసింది. వారం నుంచి పది రోజుల వ్యవధిలోనే ప్రయోగానికి సిద్ధమయ్యేలా దీనిని రూపొందించారు. ఇప్పటికే దీనికి సంబంధించిన ప్రయోగాత్మక ప్రయోగాలు కూడా విజయవంతంగా జరిగాయి. ప్రస్తుతం శ్రీహరికోట నుంచి దేశ అవసరాలకు సంబంధించిన కీలక అంతరిక్ష ప్రయోగాలు కొనసాగుతున్నాయి. ఇదే సమయంలో శ్రీహరికోటకు ప్రత్యామ్నాయంగా తమిళనాడులో రెండో రాకెట్ ప్రయోగ కేంద్రం ఏర్పాటు చేయాలనే ప్రయత్నాలు కూడా చాలా కాలంగా జరుగుతున్నాయి. ప్రస్తుతం ఈ ప్రాజెక్టు నిర్మాణం చివరి దశకు చేరుకుని దాదాపు పూర్తికావస్తోంది.

తమిళనాడులోని కులశేఖరపట్నంలో నిర్మిస్తున్న ఈ రెండో రాకెట్ ప్రయోగ కేంద్రం అత్యంత కీలకమైనది. అయితే ఈ కేంద్రం నిర్వహణను ప్రైవేట్ సంస్థలకు అప్పగించేందుకు నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. దీనిపై ఆసక్తి ఉన్న ప్రైవేట్ సంస్థల నుంచి దరఖాస్తులు కూడా ఆహ్వానిస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. అయితే ఈ నిర్ణయాన్ని ఇస్రో ఉద్యోగులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఇస్రోకు సొంతంగా రాకెట్ ప్రయోగాలు నిర్వహించే పూర్తి సామర్థ్యం ఉన్నప్పుడు, ఇంత కీలకమైన ప్రయోగ కేంద్రాన్ని ప్రైవేట్ సంస్థల చేతుల్లోకి ఎందుకు ఇవ్వాలనే ప్రశ్నను వారు లేవనెత్తుతున్నారు. దాదాపు రెండు వేల ఎకరాలకు పైగా విస్తీర్ణంలో కులశేఖరపట్నంలో ఈ రెండో లాంచ్ సెంటర్‌ను కేంద్ర ప్రభుత్వం భారీ వ్యయంతో నిర్మిస్తోంది. నిర్మాణం దాదాపు పూర్తయి, ప్రారంభానికి సిద్ధమవుతున్న ఈ కేంద్రంలో రాకెట్ ప్రయోగాలకు అవసరమైన మౌలిక సదుపాయాలను కూడా ఏర్పాటు చేస్తున్నారు. అన్ని విధాలుగా ప్రయోగాలకు అనుకూలంగా తీర్చిదిద్దిన ఈ అత్యాధునిక కేంద్రాన్ని ప్రైవేట్ సంస్థలకు నిర్వహణ కోసం అప్పగించాల్సిన అవసరం ఏమిటని ఉద్యోగులు ప్రశ్నిస్తున్నారు.

దేశవ్యాప్తంగా ఉన్న ఇస్రో ఉద్యోగులు ఈ నిర్ణయానికి వ్యతిరేకంగా ఏకమవుతున్నారు. కర్ణాటక, కేరళ, ఆంధ్రప్రదేశ్‌లోని తిరుపతి జిల్లా శ్రీహరికోటతో పాటు ఢిల్లీలోని వివిధ ఇస్రో కేంద్రాల్లో పనిచేస్తున్న ఉద్యోగులు కూడా ఈ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఉద్యోగ ప్రతినిధులు ఇస్రో చైర్మన్ డాక్టర్ వి. నారాయణన్‌ను కలిసి తమ అభ్యంతరాలను తెలియజేశారు. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని, కులశేఖరపట్నం లాంచ్ కేంద్రం నిర్వహణను ప్రైవేట్ సంస్థలకు అప్పగించే ప్రయత్నాలను విరమించుకోవాలని ఉద్యోగులు డిమాండ్ చేస్తున్నారు. లేనిపక్షంలో దేశవ్యాప్తంగా ఉన్న ఇస్రో ఉద్యోగులందరూ కలిసి పెద్ద ఎత్తున ఉద్యమానికి దిగుతామని హెచ్చరిస్తున్నారు. కులశేఖరపట్నం నుంచి ప్రారంభమవుతున్న ఈ ప్రైవేటీకరణ ప్రక్రియ భవిష్యత్తులో దేశవ్యాప్తంగా ఉన్న ఇతర ఇస్రో కేంద్రాల నిర్వహణకు కూడా విస్తరించే ప్రమాదం ఉందని ఉద్యోగులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

ఇవి కూడా చదవండి

క్రమంగా దేశ అంతరిక్ష పరిశోధన రంగంలోని కీలకమైన మౌలిక సదుపాయాలు ప్రైవేట్ సంస్థల చేతుల్లోకి వెళ్లిపోయే అవకాశం ఉందని అంటున్నారు. అందుకే ఈ నిర్ణయాన్ని పూర్తిస్థాయిలో వ్యతిరేకిస్తున్నామని, ఎట్టి పరిస్థితుల్లోనూ దీనిని సమర్థించబోమని ఇస్రో ఉద్యోగులు స్పష్టం చేస్తున్నారు. మరి ఉద్యోగుల ఆందోళనను కేంద్ర ప్రభుత్వం, ఇస్రో యాజమాన్యం ఏ విధంగా పరిగణిస్తుంది? నిర్మాణం దాదాపు పూర్తయి, రాకెట్ ప్రయోగాలకు సిద్ధమవుతున్న తమిళనాడులోని కులశేఖరపట్నం రెండో లాంచ్ కేంద్రం నిర్వహణను ప్రైవేట్ సంస్థలకు అప్పగించాలనే నిర్ణయాన్ని ప్రభుత్వం వెనక్కి తీసుకుంటుందా? లేక ఇప్పటికే తీసుకున్న నిర్ణయం ప్రకారమే ముందుకు సాగుతుందా? అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.

Follow Us