Raghuram Rajan: రాఘురాం రాజన్ పొలిటికల్ ఎంట్రీ ఫిక్స్ అయిందా..? హస్తిన రాజకీయ వర్గాల్లో జోరుగా చర్చ..

|

Dec 15, 2022 | 12:28 PM

భారతీయ రిజర్వ్ బ్యాంక్ (RBI) మాజీ గవర్నర్‌ రఘురాం రాజన్.. ఆర్ధకవేత్తగా అందరికీ సుపరిచితులే.. ఆర్ధిక - రాజకీయ రంగం, ద్రవ్యోల్బణం ఇలా ఏ అంశంపైనైనా ఆయన అనర్గళంగా మాట్లాడతారు..

Raghuram Rajan: రాఘురాం రాజన్ పొలిటికల్ ఎంట్రీ ఫిక్స్ అయిందా..? హస్తిన రాజకీయ వర్గాల్లో జోరుగా చర్చ..
Rahul And Raghuram Rajan
Follow us on

భారతీయ రిజర్వ్ బ్యాంక్ (RBI) మాజీ గవర్నర్‌ రఘురాం రాజన్.. ఆర్ధకవేత్తగా అందరికీ సుపరిచితులే.. ఆర్ధిక – రాజకీయ రంగం, ద్రవ్యోల్బణం ఇలా ఏ అంశంపైనైనా ఆయన అనర్గళంగా మాట్లాడతారు.. కేంద్రంలోని మోడీ ప్రభుత్వం తీసుకున్న నోట్ల రద్దు, ఆర్ధిక పరమైన నిర్ణయాలను బహిరంగంగా వ్యతిరేకించడంతోపాటు.. నిర్మొహమాటంగా విమర్శించి వివాదాలను సైతం ఎదుర్కొన్నారు. కేంద్ర బ్యాంకు స్వయంప్రతిపత్తిని ప్రభుత్వం దెబ్బతీస్తోందని.. దేశంలో పెరుగుతున్న అసహనానికి ప్రభుత్వ విధానాలే కారణం అంటూ వ్యతిరేకతను కూడా వెళ్లబుచ్చారు. ఇలా, రఘురాం రాజన్ ఎప్పుడూ విమర్శలకు దగ్గరగా ఉంటూ వార్తల్లో ఉంటారు. అలాంటి రాఘురాం రాజన్.. తాజాగా రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారారు. రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర.. ప్రస్తుతం రాజస్థాన్‌లో కొనసాగుతోంది. ఈ పాదయాత్రలో రఘురామ్ రాజన్.. రాహుల్ గాంధీతో కలిసి అడుగులు వేశారు. జోడోయాత్రకు మద్దతు తెలిపి.. రాహుల్ గాంధీతో రఘురామ్ రాజన్ పలు అంశాలపై సుధీర్ఘంగా చర్చించారు. దీంతో కాంగ్రెస్ పార్టీలో రఘురామ్ రాజన్.. మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ పాత్రను భర్తీ చేయనున్నారా..? మన్మోహన్ లానే.. రాజన్ కు కూడా అవకాశం లభిస్తుందా..? ఆయన భవిష్యత్తులో పార్టీకి కీలకం కానున్నారా..? అనేది రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.

రాహుల్ గాంధీ ‘భారత్ జోడో’ యాత్రలో రాజన్ భాగస్వామ్యం అవడం.. గాంధీ కుటుంబ రాజకీయ ప్రత్యర్థులలో పెద్దగా ఆశ్చర్యం కలిగించకపోయినా.. రాజకీయాల్లో మాత్రం కలకలం రేపింది. ఈ క్రమంలో బీజేపీ రాజన్ పై మండిపడింది. కాంగ్రెస్ ఆర్బీఐ గవర్నర్ గా రఘురాం రాజన్‌ నియమించిందని.. మాజీ ప్రధాని మన్మోహన్‌సింగ్‌ ను ఉద్దేశించి బీజేపీ అధికార ప్రతినిధి అమిత్ మాల్వియా బుధవారం ట్వీట్ చేశారు. భారత ఆర్థిక వ్యవస్థపై ఆయన చేసిన వ్యాఖ్యాలను విస్మరించకుండా ఇలా చేయడం.. అవకాశవాదం అంటూ మాలవ్య కాంగ్రెస్ ను విమర్శించారు.

అయితే, భారత్ జోడో యాత్రలో రాజన్ పాల్గొనడం గాంధీ రాజకీయ ప్రత్యర్థుల దృష్టిని ఎందుకు ఆకర్షించింది? ముఖ్యంగా 2024 పార్లమెంటు ఎన్నికలకు ముందు రాజకీయ ప్రత్యర్థులు రాజన్‌ను ముప్పుగా పరిగణిస్తున్నారా..? అనేది పొలిటికల్ వర్గాల్లో చర్చనీయాంశమైంది.

ఇవి కూడా చదవండి

ఎకానామిస్ట్‌గా 2008 ప్రపంచ ఆర్థిక సంక్షోభాన్ని అంచనా వేసిన ఘనత రాజన్ కే దక్కుతుంది. ఇంకా ఎన్నో విషయాలను ప్రస్తావించి భవిష్యత్తుగా ఆర్ధిక పరిస్థితులపై కూడా ఆయన వేసిన అంచనాలు సఫలికృతం అయ్యియి. ఈ క్రమంలో కాంగ్రెస్ పార్టీకి తదుపరి మన్మోహన్ సింగ్ గా మారనున్నారా..? అనేది కాలమే నిర్ణయించనుంది. భారత్ జోడో యాత్రలో పాల్గొనడంతో.. కాంగ్రెస్ పార్టీలో ఆయన ప్రధాన పాత్రను చేపట్టే అవకాశం కూడా ఉందని పేర్కొంటున్నారు. నిశితంగా పరిశీలిస్తే.. రాజన్, మన్మోహన్ సింగ్ ఇద్దరూ వారి కెరీర్ మార్గాలలో అద్భుతమైన సారూప్యతలు కలిగి ఉన్నారు. ఇద్దరూ భారత ప్రభుత్వంలో, సెంట్రల్ బ్యాంక్‌లో కీలక పాత్రల్లో పనిచేశారు. ఇద్దరికీ అంతర్జాతీయంగా గౌరవం కూడా ఉంది. మన్మోహన్ సింగ్ లాగానే రాజన్‌కు కూడా భారత ఆర్థిక వ్యవస్థలోని సూక్ష్మబేధాలన్నీ బాగా తెలుసు.. సామాజిక-రాజకీయ సమస్యలపై అనర్గళంగా మాట్లాడటం, ఎలాంటి విషయాన్నైనా సుధీర్ఘంగా చర్చించడం.. విమర్శలు చేయడం రాజన్ కు కలిసి వచ్చే విషయంగా పరిగణిస్తున్నారు. ఇది రాజన్ కు మొదటి నుంచి వార్తల్లో నిలిచేలా చేస్తోంది. దీంతో పేద, మధ్య తరగతిలో రాజన్ సుపరిచితుడిగా నిలిచారు.

యూపీఏ హయాంలో భారత ఆర్థిక వ్యవస్థలో రాజన్ కీలక పాత్ర పోషించారు. కావున ఈ విషయాలను ప్రస్తావిస్తూ.. కాంగ్రెస్ రాజన్‌ను ఎన్నికల ముందు.. పలు కీలక బాధ్యతలను అందించే అవకాశముందని పేర్కొంటున్నారు. కేంద్రం నిర్ణయాలు, రాజకీయ, ఆర్థిక వ్యవస్థ ఇలా అన్ని అంశాలను సుధీర్ఘంగా ప్రస్తావించే రాజన్ కు కలిసి వచ్చే అంశంగా మారనుంది. అంతర్జాతీయంగా రూపాయి పతనం, ఆర్థిక సంక్షోభం, ద్రవ్యోల్బణం, పెరుగుతున్న నిరుద్యోగం ఇలా అన్నింటిని కాంగ్రెస్ ప్రజల్లోకి తీసుకెళ్లాలని చూస్తోంది. దీనికి రాజన్ వ్యూహాలను అందించనున్నారని తెలుస్తోంది.

రాజన్, మన్మోహన్ పాపులారిటీ..

రాజన్, మన్మోహన్ ఇద్దరి పాపులారిటీ చూస్తే.. రాజన్ మన్మోహన్ కంటే కొంచెం ముందు వరుసలో నిలుస్తారని చాలామంది ఆర్ధికవేత్తలు పేర్కొంటారు. ప్రపంచ స్థాయి ఆర్ధిక నిపుణుల్లో రాజన్ ఒకరు.. అయితే, ఆయన భారత మంత్రిత్వ శాఖలో ఏ పదవి పొందలేదు. ఏది ఏమైనప్పటికీ 2024 ఎన్నికలకు ముందు UPA రాజకీయ సమరంలో రాజన్ స్టార్ ఇమేజ్‌ని తీసుకొచ్చే అవకాశం కూడా లేకపోలేదని పేర్కొంటున్నారు.

భారత ప్రభుత్వంలో పలు కీలక బాధ్యతలను నిర్వర్తించిన రఘురామ్ రాజన్.. అతను ప్రస్తుతం చికాగో విశ్వవిద్యాలయం స్కూల్ ఆఫ్ బిజినెస్‌లో ఫైనాన్స్ ప్రొఫెసర్‌గా ఉన్నారు. రాజన్ ఇప్పటికీ.. ఆర్థిక, రాజకీయ అంశాలపై మీడియాతో ఎప్పటికప్పుడు మాట్లాడుతూ.. పలు విషయాలను చర్చించడం, విమర్శలు చేయడం కొనసాగిస్తున్నారు. నల్లధనం – నిరుద్యోగంపై చర్చలలో రాజన్ మాటలు.. రాజకీయ నాయకుల కంటే ఎక్కువ మార్కును కలిగిఉంటాయి. ఎందుకంటే ఆయన ప్రసంగం అందరినీ ఆకట్టుకుంటుంది.

ఆర్థిక మంత్రి నుంచి ప్రధాని వరకు..

1991లో ఆర్థిక మంత్రి పోర్ట్‌ఫోలియోకు మన్మోహన్ ఎంపిక కావడం చాలా మందిని ఆశ్చర్యపరిచింది. 59 ఏళ్ల తర్వాత, ఆయన రాజకీయ రహిత సాంకేతిక నిపుణుడిగా, తన జీవితమంతా ఆర్థిక శాస్త్రం, విద్యాపరమైన ప్రయోజనాలను అభ్యసించే వ్యక్తిగా మన్మోహన్ కనిపించారు. అయితే, పీవీ నరసింహరావు ప్రభుత్వం ఆర్థిక గందరగోళంలో కూరుకుపోకుండా నడిపించి మన్మోహన్‌ అప్పటి రాజకీయాల్లో కీలకంగా వ్యవహరించారు. కానీ కొన్ని నిర్ణయాలు కలిసిరాకపోవడం.. ప్రతిపక్షాలు విమర్శించడం ఇలా అన్నింటిని మన్మోహన్ ఎదుర్కొన్నారు. యూపీఏ కూటమిలో ప్రధానమంత్రి పదవిని సైతం పొంది.. కీలక పాత్రను పొషించారు. 2004, 2009లో మన్మోహన్ యూపీఏ ప్రభుత్వంలో రెండుసార్లు ప్రధాని పదవిలో కొనసాగారు. ఆయనకు విపక్షాల నుంచి ప్రశంసలు, విమర్శలు సైతం దక్కాయి.

రాజన్ ప్రవేశంతో..

కాంగ్రెస్ 2024 ఎన్నికలే టార్గెట్ గా ముందుకు సాగుతోంది. ఈ సమయంలో రాజన్ ప్రవేశం కాంగ్రెస్ పార్టీకి పునరుజ్జీవం కానుందని రాజకీయ విశ్లేషకులు పేర్కొంటున్నారు. ఈ సమయంలో రాజన్ కోల్పోయిన అధికారాన్ని కట్టబెట్టేందుకు.. యూపీఏకు రాజకీయ, ఆర్ధిక దిశానిర్దేశాన్ని చేస్తారని భావిస్తున్నారు. బలమైన నాయకుల అండతో కాంగ్రెస్ 2024 ఎన్నికలకు వెళుతుందని.. దీనికి చాలామంది మేధావులు సహకరిస్తారని అభిప్రాయపడుతున్నారు.

అయితే, ఇటీవల కాలంలో కాంగ్రెస్.. పెద్దగా రాణించలేకపోవడం మైనస్ గా మారింది. జాతీయ స్థాయిలో కాంగ్రెస్ సీట్లు తగ్గిపోవడం, ఇటీవల జరిగిన పలు రాష్ట్రాల ఎన్నికల్లో ఘోర పరాభవంతో నాయకత్వ శూన్యత కనిపిస్తోంది. ఈ క్రమంలో బిజెపి నేతృత్వంలోని ఎన్‌డిఎకు తీవ్రమైన సవాలును చేసేందుకు.. 1991 లో నరసింహారావు ప్రభుత్వానికి మన్మోహన్ సింగ్ వలే.. రాజన్ కీలకం అవుతారా అనడంలో ఎలాంటి సందేహం అక్కర్లేదు.. ఎందుకంటే.. భారతీయ మధ్యతరగతి ఓటర్లకు సుపరిచితుడైన రాజన్ కాంగ్రెస్ కు మద్దతు ఇవ్వడం.. ట్రంప్ కార్డ్‌గా మారుతుందా..? రాజన్ వల్ల భవిష్యత్తులో కాంగ్రెస్ ఎలా కలిసివస్తుంది అనేది.. చర్చనీయాంశంగా మారింది.

మరిన్ని జాతీయ వార్తల కోసం..