భారత్-చైనా మధ్య చర్చలు.. సేనల మళ్లింపుపై పరస్పర అంగీకారం

భారత్-చైనా మధ్య చర్చల్లో సైనిక దళాల మళ్లింపుపై పరస్పర అంగీకారం కుదిరిందని, చర్చలు సౌహార్దపూరిత, సానుకూల వాతావరణంలో జరిగాయని సైనికవర్గాలు వెల్లడించాయి. లదాఖ్ తూర్పు ప్రాంతంలో అన్ని వివాదాస్పద భూభాగాల నుంచి ఉభయ దేశాల సైనికులు తిరిగి తమ స్థావరాల వైపునకు మళ్లే..

  • Umakanth Rao
  • Publish Date - 2:17 pm, Tue, 23 June 20
భారత్-చైనా మధ్య చర్చలు.. సేనల మళ్లింపుపై పరస్పర అంగీకారం

భారత్-చైనా మధ్య చర్చల్లో సైనిక దళాల మళ్లింపుపై పరస్పర అంగీకారం కుదిరిందని, చర్చలు సౌహార్దపూరిత, సానుకూల వాతావరణంలో జరిగాయని సైనికవర్గాలు వెల్లడించాయి. లదాఖ్ తూర్పు ప్రాంతంలో అన్ని వివాదాస్పద భూభాగాల నుంచి ఉభయ దేశాల సైనికులు తిరిగి తమ స్థావరాల వైపునకు మళ్లే అవకాశాలపై ఈ చర్చలు జరిగాయని, రెండు పక్షాలూ వీటిని మరింత ముందుకు తీసుకువెళ్తామని (చర్చల కొనసాగింపు) ఈ వర్గాలు వివరించాయి. లెఫ్టినెంట్ జనరల్ స్థాయిలో ఈ సంప్రదింపులు చైనా వైపున్న  ఛుషుల్ సెక్టార్ లోని మోల్డోలో జరిగాయి. కాగా-ఇండో-చైనా మధ్య నిన్న 11 గంటల పాటు  సుదీర్ఘంగా జరిగిన చర్చలు అసంపూర్తిగా ముగిసిన సంగతి తెలిసిందే. ఇండియా తరఫున లెఫ్టినెంట్ జనరల్ హరీందర్ సింగ్, చైనా తరఫున టిబెట్ మిలిటరీ డిస్ట్రిక్ట్ కమాండర్ ఈ సంప్రదింపుల్లో పాల్గొన్నారు. వీరి స్థాయిలో ఇవి జరగడం ఇది మూడో సారి. గాల్వన్ వ్యాలీలోని అన్ని ‘స్టాండ్ ఆఫ్ పాయింట్ల’ నుంచి ఉభయ దేశాల దళాలూ వెనక్కి వెళ్లాలని ఈ నెల 6న జరిగిన చర్చల్లో నిర్ణయించారు. అయితే ఈ నెల 15 న ఈ లోయలో ఇరు దేశాల సైనికుల మధ్య పెను ఘర్షణ జరిగి.. 20 మంది భారత సైనికులు మృతి చెందారు. ఈ ఘర్షణ అనంతరం మేజర్ జనరల్ స్థాయిలో మూడు రౌండ్ల చర్చలు జరిగాయి. మే 2 కు ముందున్న స్థితిని పునరుధ్ధరించాలని భారత సైన్యం కోరుతోంది.

అటు-ఆర్మీ చీఫ్ జనరల్ ఎం.ఎం.నరవాణే ….నియంత్రణ రేఖ పొడవునా గల భారత సెక్యూరిటీని సమీక్షించారు. లదాఖ్, అరుణాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రాల్లో చైనాతో గల సరిహద్దు ప్రాంతాలోని భద్రత గురించి ప్రధానంగా ఆయన ఉన్నత సైనిక వర్గాలతో సమీక్ష జరిపారు. మరోవైపు-ఇరు దేశాల సరిహద్దుల్లో నిర్మిస్తున్న పలు రోడ్ల ప్రాజెక్టుల పురోగతిని కేంద్రం నిన్న మదింపు చేసింది. సెంట్రల్ పబ్లిక్ వర్క్స్ డిపార్ట్ మెంట్, బోర్డర్ రోడ్ ఆర్గనైజేషన్, ఇండో-టిబెటన్ బోర్డర్ పోలీసులతో కేంద్ర హోం శాఖ ఉన్నత స్థాయి సమీక్ష జరిపి.. ముఖ్యంగా 32 ప్రాజెక్టుల నిర్మాణాన్ని వేగవంతం చేయాలని నిర్ణయించింది.