BRICS-2026లో భారత్.. చైనా, రష్యా, ఇరాన్‌ల మధ్య బ్యాలెన్స్ గేమ్..!
BRICS 2026లో భారత్ తన దౌత్యపరమైన బ్యాలెన్స్ గేమ్‌ను నైపుణ్యంగా ఆడుతోంది. చైనా, రష్యా, ఇరాన్‌లతో సంబంధాలు కొనసాగిస్తూనే, అమెరికా, UAEలతో స్నేహాన్ని పెంచుకుంటోంది. చాబహార్ పోర్ట్, హర్మూజ్ జలసంధి భద్రత భారత్ ఆర్థిక ప్రయోజనాలకు అత్యంత కీలకం. ఏ దేశానికీ పూర్తిగా వంగకుండా, తన స్వప్రయోజనాలను కాపాడుకోవడం భారత్ ముందున్న ప్రధాన సవాల్.

ఒకే వేదికపై భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. చుట్టూ ప్రపంచ రాజకీయాల్లో కీలకమైన దేశాల నేతలు. చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్, రష్యా అధ్యక్షుడు పుతిన్, ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పెజెష్కియన్. ఒక్కొక్కరితో భారత్‌కు ఒక్కో రకమైన సంబంధం. ఒక్కొక్కరితో ఒక్కో అవసరం. చైనాతో సరిహద్దు సమస్య ఉంది. రష్యాతో చమురు, రక్షణ సంబంధాలు ఉన్నాయి. ఇరాన్‌తో చాబహార్ పోర్టు, వాణిజ్యం, పశ్చిమాసియా మార్గాలు ఉన్నాయి. మరోవైపు అమెరికాతో కూడా భారత్‌కు బలమైన సంబంధాలు ఉన్నాయి. ఇలాంటి సమయంలో ఢిల్లీలో జరిగిన BRICS శిఖరాగ్ర సమావేశం భారత్‌కు సాధారణ సదస్సు కాదు. అందరితో మాట్లాడాలి. అందరి ప్రయోజనాలు అర్థం చేసుకోవాలి. కానీ ఎవరి వైపు పూర్తిగా వెళ్లకుండా తన దారి తాను చూసుకోవాలి. ఇదే ఇప్పుడు భారత్ ముందున్న అసలు పని.
చైనాతో పోటీ. అయినా మాటలు కొనసాగాలి. గల్వాన్ తర్వాత భారత్, చైనా మధ్య నమ్మకం బాగా దెబ్బతింది. సరిహద్దులో ఉద్రిక్తత ఇంకా పూర్తిగా ముగియలేదు. అయినా ఇరు దేశాల మధ్య చర్చలు కొనసాగుతున్నాయి. ఇప్పుడు BRICS వేదికగా మోదీ–జిన్‌పింగ్ భేటీ కూడా జరిగింది. ఏళ్ల తర్వాత చైనా అధ్యక్షుడు భారత్‌కు రావడం కూడా ప్రత్యేక పరిణామమే. చైనాతో పోటీ ఉంటుంది. భద్రత విషయంలో భారత్ అప్రమత్తంగానే ఉంటుంది. కానీ మాట్లాడకుండా సమస్యలు పరిష్కారం కావు. అందుకే ఒకవైపు సరిహద్దులో జాగ్రత్త. మరోవైపు దౌత్యంలో మాటలు. భారత్ ఇదే దారిలో వెళ్తోంది.
రష్యాతో పాత స్నేహం – కొత్త అవసరాలు
రష్యాతో భారత్‌కు చాలా ఏళ్ల సంబంధం ఉంది. రక్షణ రంగంలో రష్యా కీలక భాగస్వామి. ఇప్పుడు చమురు కూడా చాలా ముఖ్యమైన అంశంగా మారింది. ఉక్రెయిన్ యుద్ధం తర్వాత రష్యాపై పాశ్చాత్య దేశాలు ఆంక్షలు పెట్టినా.. భారత్ తన ఇంధన అవసరాలను దృష్టిలో పెట్టుకుని రష్యా నుంచి చమురు కొనుగోలు చేసింది. మోదీ–పుతిన్ భేటీలో చమురు, రక్షణ, వాణిజ్యం, ఇంధనం వంటి అంశాలు చర్చకు వచ్చాయి. అంటే రష్యాతో సంబంధం కేవలం పాత స్నేహం మీద నడవడం లేదు. భారత్ అవసరాల మీద కూడా నడుస్తోంది. రష్యా సామెతలో చెప్పాలంటే “నమ్మకమైన స్నేహితుడు వంద మంది బంధువుల కంటే మేలు అని. భారత్–రష్యా సంబంధాలకు ఇది బాగా సరిపోతుంది. కాలం మారినా కొన్ని సంబంధాలు పూర్తిగా తెగిపోకుండా కొనసాగుతుంటాయి.
ఇరాన్‌తో సంబంధం – చాబహార్ నుంచి హర్మూజ్ వరకు
ఇరాన్ విషయంలో భారత్‌కు మరో రకమైన అవసరాలు ఉన్నాయి. చాబహార్ పోర్టు భారత్‌కు చాలా ముఖ్యమైనది. మధ్య ఆసియా వైపు వెళ్లే వాణిజ్య మార్గాల్లో ఇది ఉపయోగపడుతుంది. పాకిస్థాన్‌ను దాటకుండా ఆ ప్రాంతంతో అనుసంధానం కావడానికి చాబహార్ ఒక ముఖ్యమైన మార్గం. ఇక ఇప్పుడు పశ్చిమాసియాలో యుద్ధ పరిస్థితులు పెరగడంతో హర్మూజ్ జలసంధి మరింత కీలకంగా మారింది. మోదీ–పెజెష్కియన్ భేటీలో కూడా పశ్చిమాసియా పరిస్థితులు, సముద్ర మార్గాల భద్రత, వాణిజ్యం, నౌకల రాకపోకలపై చర్చ జరిగింది. భారత్ స్పష్టంగా చెప్పింది. సమస్యలకు యుద్ధం కాదు.. చర్చలు, దౌత్యమే మార్గం అని. ఇదే భారత్ వైఖరిలో ముఖ్యమైన విషయం.
హర్మూజ్‌లో మంట పెరిగితే..!
హర్మూజ్ జలసంధి పేరు మనకు దూరంగా అనిపించొచ్చు. కానీ అక్కడ ఏం జరుగుతుందన్నది మన వంటింటి ఖర్చుపైనా ప్రభావం చూపుతుంది. భారత్ తన చమురు అవసరాల్లో దాదాపు 88 శాతం దిగుమతులపైనే ఆధారపడుతోంది. హర్మూజ్ మీదుగా వచ్చే చమురు వాటా కూడా చాలా కీలకం. అయితే ఇటీవలి పరిణామాలతో భారత్ తన దిగుమతుల్లో 70 శాతం వరకు హర్మూజ్‌కు బయట ఉన్న మార్గాల నుంచి తెచ్చుకునేలా మార్పులు చేసింది. అయినా హర్మూజ్ పూర్తిగా దెబ్బతింటే ప్రభావం తప్పదు.
చమురు ధర పెరుగుతుంది. రవాణా ఖర్చు పెరుగుతుంది. పెట్రోల్, డీజిల్ ధరలపై ఒత్తిడి వస్తుంది. సరుకు రవాణా ఖర్చు పెరుగుతుంది. దాని ప్రభావం కూరగాయల నుంచి నిత్యావసర వస్తువుల వరకు కనిపించొచ్చు. ఎరువుల ధరలు కూడా ప్రభావితమయ్యే అవకాశం ఉంది. LPG విషయంలో కూడా హర్మూజ్ చాలా ముఖ్యమైన మార్గం. భారత్ తన LPG అవసరాల్లో దాదాపు 60 శాతం దిగుమతి చేసుకుంటోంది. ఆ దిగుమతుల్లో సుమారు 90 శాతం హర్మూజ్ మీదుగా వస్తాయి. అందుకే హర్మూజ్ సమస్య అంటే కేవలం సముద్రంలో నౌకల సమస్య కాదు. చివరికి అది మన ఇంటి బడ్జెట్ సమస్యగా మారుతుంది.
ఇరాన్ ఒకవైపు.. UAE మరోవైపు..!
ఇక్కడే భారత్‌కు అసలు దౌత్య పరీక్ష మొదలవుతుంది. BRICSలో ఇరాన్ ఉంది. UAE కూడా ఉంది. పశ్చిమాసియాలో ఈ దేశాల ప్రయోజనాలు ఎప్పుడూ ఒకేలా ఉండవు. ఇప్పుడు ఉద్రిక్తతల నేపథ్యంలో BRICSలో కూడా ఈ అంశంపై ఏకాభిప్రాయం తీసుకురావడం కష్టంగా మారింది. కానీ భారత్‌కు ఇరాన్ కూడా ముఖ్యం. UAE కూడా ముఖ్యం. UAE భారత్‌కు పెద్ద వాణిజ్య భాగస్వామి. ఇరాన్ చాబహార్ మార్గం వల్ల వ్యూహాత్మకంగా ముఖ్యం. గల్ఫ్ ప్రాంతం నుంచి వచ్చే ఇంధనం కూడా భారత్‌కు చాలా అవసరం. భారత్ ఇప్పుడు ఒకరి వైపు నిలబడి మరొకరిని దూరం చేసుకునే పరిస్థితిలో లేదు.
అమెరికాతోను భారత్ చెలిమి..
ఇంకో వైపు అమెరికా ఉంది. భారత్‌కు అమెరికాతో రక్షణ, టెక్నాలజీ, పెట్టుబడులు, వాణిజ్యం వంటి రంగాల్లో సంబంధాలు ఉన్నాయి. ఇండో-పసిఫిక్‌లో కూడా రెండు దేశాల సహకారం ఉంది. అదే సమయంలో రష్యాతో చమురు సంబంధాలు కొనసాగుతున్నాయి. చైనాతో పోటీ ఉన్నా.. BRICSలో కలిసి కూర్చోవాల్సి వస్తోంది. ఇరాన్‌తో సంబంధాలు ఉన్నాయి. UAEతో కూడా బలమైన భాగస్వామ్యం ఉంది. అందుకే భారత విదేశాంగ విధానం ఇప్పుడు ఒకే శిబిరం చుట్టూ తిరగడం లేదు. అందరితో మాట్లాడటం. అవసరమైన చోట కలిసి పనిచేయడం. కానీ నిర్ణయం మాత్రం తన ప్రయోజనాన్ని బట్టి తీసుకోవడం. ఇదే భారత్ బ్యాలెన్స్ గేమ్.
BRICSను అమెరికా వ్యతిరేక వేదికగా మార్చకూడదు. రష్యా, ఇరాన్ అమెరికా విధానాలపై తీవ్రంగా విమర్శలు చేస్తుంటాయి. చైనా కూడా అమెరికాతో పోటీలో ఉంది. కానీ భారత్ BRICSను పూర్తిగా అమెరికా వ్యతిరేక వేదికగా మార్చాలని కోరుకోవడం లేదు. ప్రధాని మోదీ కూడా BRICS పాశ్చాత్య దేశాలకు వ్యతిరేకంగా ఉండే కూటమి కాదని స్పష్టం చేశారు. అభివృద్ధి చెందుతున్న దేశాలకు మరింత బలం, ఎక్కువ ప్రాతినిధ్యం కల్పించే వేదికగా ఉండాలని భారత్ కోరుతోంది. ఇదే భారత్‌కు ఉన్న ప్రత్యేక స్థానం. ఒకవైపు రష్యాతో మాట్లాడగలదు. మరోవైపు అమెరికాతో కూడా చర్చించగలదు. చైనాతో విభేదాలు ఉన్నా మంతనాలు చేయగలదు. ఇరాన్‌తో సంబంధాలు కొనసాగిస్తూ UAEతోనూ భాగస్వామ్యం పెంచుకోగలదు. అసలు బలం. ఎవరి మాట వినాలో తెలుసుకోవడంలోనే ఉంది. భారత్‌కు ఇప్పుడు ప్రపంచ రాజకీయాల్లో ఒక ప్రత్యేక అవకాశం ఉంది.
చైనా పెద్ద ఆర్థిక శక్తి. రష్యా పెద్ద ఇంధన, రక్షణ భాగస్వామి. ఇరాన్ పశ్చిమాసియా మార్గాల్లో కీలక దేశం. UAE గల్ఫ్‌లో ముఖ్యమైన భాగస్వామి. అమెరికా మరోవైపు కీలక వ్యూహాత్మక భాగస్వామి. ఈ దేశాలన్నింటితో భారత్‌కు ఏదో ఒక అవసరం ఉంది. అందుకే ఎవరి వెంట నడవాలి అన్నదానికంటే, అందరితో కలిసి నడుస్తూనే తన ప్రయోజనాన్ని ఎలా కాపాడుకోవాలి అన్నదే భారత్ ముందున్న అసలు సవాలు. అందరితో కలిసి ఉండాలి. కానీ తన ఇంటి తలుపు తానే కాపాడుకోవాలన్నది నిజం. ప్రస్తుత పరిస్థితికి ఇదే భారత్ దౌత్యానికి సరైన మాట.
హర్మూజ్ విషయంలో..
ఇప్పుడు భారత్ కోరుకునేది ఒక్కటే. హర్మూజ్ మార్గం తెరిచి ఉండాలి. నౌకలు సురక్షితంగా వెళ్లాలి. చమురు సరఫరా ఆగకూడదు. యుద్ధం మరింత విస్తరించకూడదు. అందుకే మోదీ–పెజెష్కియన్ భేటీలో కూడా సముద్ర మార్గాల భద్రత, వాణిజ్య రాకపోకలు, నౌకల భద్రతపై దృష్టి పెట్టారు. ఇది కేవలం ఇరాన్ సమస్య కాదు. ఇది భారత్ ఇంధన భద్రతకు సంబంధించిన విషయం. అదే సమయంలో BRICSలో ఇరాన్, UAE, సౌదీ అరేబియా వంటి దేశాలను ఒకే టేబుల్‌పై కూర్చోబెట్టడం కూడా భారత్‌కు ఒక అవకాశం. విభేదాలు ఉన్నా మాట్లాడుకునే వేదికగా BRICSను నిలబెట్టగలిగితే.. భారత్ పాత్ర మరింత పెరుగుతుంది.
చివరికి భారత్ దారి ఇదే!
చైనాతో పోటీ ఉంటుంది. రష్యాతో స్నేహం కొనసాగుతుంది. ఇరాన్‌తో చాబహార్ సంబంధం బలపడుతుంది. UAEతో వాణిజ్యం పెరుగుతుంది. అమెరికాతో భాగస్వామ్యం కూడా కొనసాగుతుంది. ఇవన్నీ ఒకేసారి చేయడం అంత సులభం కాదు. కానీ భారత్ ఇప్పుడు అదే ప్రయత్నం చేస్తోంది. BRICSలో భారత్ ఎవరి వైపు ఉందన్నదాని కంటే, BRICSను తనకు ఉపయోగపడే వేదికగా ఎలా మార్చుకుంటుందన్నదే ముఖ్యం. హర్మూజ్‌లో మంటలు పెరిగితే చమురు ధర నుంచి మన ఇంటి ఖర్చు వరకు ప్రభావం వస్తుంది. అందుకే యుద్ధం తగ్గడం భారత్‌కు రాజకీయంగా మాత్రమే కాదు.. ఆర్థికంగా కూడా చాలా అవసరం. చైనా, రష్యా, ఇరాన్, UAE, అమెరికా అందరితో సంబంధాలు కొనసాగిస్తూ ఎవరి ఒత్తిడికీ పూర్తిగా లోనుకాకుండా తన ప్రయోజనాన్ని కాపాడుకోవడం. ఇదే ఇప్పుడు భారత్ ముందున్న అసలు సవాల్.
కొండవీటి శివనాగరాజు డిప్యూటీ అవుట్‌పుట్ ఎడిటర్, టీవీ9.
