సాయుధ దళాలు ఆయుధాలను వదలలేదు. విదేశాంగ మంత్రి ఎస్.జైశంకర్
లదాఖ్ సరిహద్దుల్లో భారత సైనికులను నిరాయుధులుగా పంపారని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ చేసిన ఆరోపణను విదేశాంగ మంత్రి ఎస్,జైశంకర్ ఖండించారు. సరిహద్దుల్లో ఉండే సైనికులు ఎప్పుడూ ఆయుధాలను వదలరని..
లదాఖ్ సరిహద్దుల్లో భారత సైనికులను నిరాయుధులుగా పంపారని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ చేసిన ఆరోపణను విదేశాంగ మంత్రి ఎస్,జైశంకర్ ఖండించారు. సరిహద్దుల్లో ఉండే సైనికులు ఎప్పుడూ ఆయుధాలను వదలరని.. వాటిని తమ వెంట ఉంచుకుంటారని ఆయన ట్వీట్ చేశారు. 2005 లో భారత, చైనా దేశాల మధ్య కుదిరిన ఒప్పందం ప్రకారం.. సైనికులు తుపాకులను వాడరాదన్న నిబంధన ఉందని ఆయన స్పష్టం చేశారు. గాల్వన్ వ్యాలీలో కూడా ఈ నెల 15 న సైనికులు ఆయుధాలను తీసుకువెళ్లారని, కానీ ముఖా ముఖి తలపడినప్పుడు వాటిని వాడరాదన్న నియమం ఉందని ఆయన వివరించారు. కాగా- నిరాయుధులైన భారత సైనికులను హతమార్చి చైనా పెద్ద నేరం చేసిందని రాహుల్ ఆరోపించారు. దీన్ని కూడా జైశంకర్ ప్రస్తావిస్తూ.. రాహుల్ ఒకసారి ఉభయ దేశాల మధ్య కుదిరిన ద్వైపాక్షిక ఒప్పందాలను గుర్తు చేసుకోవాలని కోరారు.