AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

మీరు కొనే టికెట్‌ ధర తక్కువే.. మీ ప్రయాణానికి రైల్వే ఖర్చు చేసేది అంతకంటే ఎక్కువే!

భారతీయ రైల్వేలో ప్రయాణికులు చెల్లించే టికెట్‌ ధరకు, వారి ప్రయాణానికి అయ్యే వాస్తవ ఖర్చుకు మధ్య భారీ వ్యత్యాసం ఉంది. 2023-24 ఆర్థిక సంవత్సరంలో ప్రయాణికుల రవాణాపై రైల్వేకు వచ్చిన ఆదాయం కంటే ఖర్చు రూ.60,466 కోట్లు అధికంగా ఉంది. సగటున ప్రయాణికులు తమ ప్రయాణానికి అయ్యే అసలు ఖర్చులో 45 శాతం తక్కువే చెల్లిస్తున్నారు.

మీరు కొనే టికెట్‌ ధర తక్కువే.. మీ ప్రయాణానికి రైల్వే ఖర్చు చేసేది అంతకంటే ఎక్కువే!
Indian Railways
Santosh Nair
| Edited By: |

Updated on: Nov 21, 2026 | 8:58 AM

Share

శుక్రవారం రాత్రి.. ఓ సుదూర ప్రయాణ రైలు జనరల్‌ బోగీలో విపరీతమైన రద్దీ. ముగ్గురు కూర్చోవాల్సిన సీటులో ఐదుగురు సర్దుకున్నారు. తండ్రి మోకాళ్ల మధ్య ఇనుప ట్రంకు పెట్టె.. తల్లి ఒడిలో పసిబిడ్డ.. కాళ్ల దగ్గర రొట్టెలున్న సంచి. పదేళ్ల కుమారుడు కిటికీ పక్కన కూర్చుని బయటకు చూస్తున్నాడు. బంధువుల పెళ్లికి వెళ్లేందుకు ఆ కుటుంబం ఉదయం టికెట్లు కొనుక్కుంది. మరో పదకొండు గంటల్లో గమ్యస్థానానికి చేరుకుంటుంది. అయితే ఆ కుటుంబానికి తెలియని విషయమొకటుంది. తాము చెల్లించిన టికెట్‌ ధర కంటే తమ ప్రయాణానికి రైల్వే వెచ్చిస్తున్న మొత్తం చాలా ఎక్కువ!

భారతీయ రైల్వేలో ప్రయాణం అంటే సామాన్యుడికి అందుబాటులో ఉండే రవాణా సాధనం. బస్సులు, విమానాలతో పోలిస్తే తక్కువ ఖర్చుతో వందల కిలోమీటర్లు ప్రయాణించవచ్చు. అయితే మనం కొనే రైలు టికెట్‌ ధరే ప్రయాణానికి అయ్యే అసలు ఖర్చు కాదని తెలుసా? ప్రయాణికుల నుంచి రైల్వే వసూలు చేస్తున్న మొత్తానికి, వారిని గమ్యస్థానాలకు చేర్చేందుకు చేస్తున్న ఖర్చుకు మధ్య భారీ వ్యత్యాసం ఉంది. ఆ తేడాను ప్రభుత్వమే సబ్సిడీ రూపంలో భరిస్తోంది.

రూ.100 టికెట్‌కు అసలు ఖర్చు రూ.182!

2023-24 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన గణాంకాల ప్రకారం.. ప్రయాణికుల రవాణా కోసం భారతీయ రైల్వే వెచ్చించిన ఖర్చు, టికెట్ల ద్వారా వచ్చిన ఆదాయం కంటే చాలా ఎక్కువ. ఈ రెండింటి మధ్య వ్యత్యాసాన్ని సుమారు రూ.60,466 కోట్లుగా రైల్వే లెక్కల్లో పేర్కొన్నారు. సగటున ఒక ప్రయాణికుడి ప్రయాణ ఖర్చులో దాదాపు 45 శాతాన్ని రైల్వే రాయితీగా భరిస్తోంది.

అంటే ప్రయాణికుడు రూ.100 టికెట్‌ కొంటే.. ఆ ప్రయాణాన్ని పూర్తిచేయడానికి రైల్వేకు సుమారు రూ.182 ఖర్చవుతున్నట్లు లెక్క. మిగిలిన మొత్తాన్ని ప్రయాణికుడి నుంచి కాకుండా మరో మార్గంలో సమకూర్చుకోవాల్సి వస్తోంది. అందుకే రైలు టికెట్‌ ధర వెనుక కనిపించని ఆర్థిక లెక్కలున్నాయి.

కోట్లాది మందికి రైల్వేనే ఆధారం

భారతీయ రైల్వే ఏటా 720 కోట్లకు పైగా ప్రయాణాలను నిర్వహిస్తోంది. దేశంలో కోట్లాది కుటుంబాలకు సుదూర ప్రయాణాలకు రైలే ప్రధాన ఆధారం. ముఖ్యంగా ఏసీ సౌకర్యం లేని సాధారణ, నాన్‌ ఏసీ బోగీల్లోనే అత్యధికులు ప్రయాణిస్తున్నారు.

రైల్వే కోచ్‌లలో దాదాపు 70 శాతం, సీట్లలో 78 శాతం నాన్‌ ఏసీ విభాగానికి చెందినవే. 2024-25లో సుమారు 651 కోట్ల మంది జనరల్‌, అన్‌రిజర్వ్‌డ్‌ టికెట్లపై ప్రయాణించారు. అంటే పరీక్ష రాసేందుకు మరో జిల్లాకు వెళ్లే విద్యార్థి నుంచి.. పండగకు సొంతూరికి చేరుకునే వలస కార్మికుడి వరకు.. బంధువుల ఇంట్లో శుభకార్యానికి వెళ్లే కుటుంబం నుంచి రోజువారీ ప్రయాణికుడి వరకు ఎంతోమందికి రైల్వే అందించే తక్కువ ధరల ప్రయాణమే ఆధారం.

సరుకు రవాణాతో ప్రయాణికులకు ఊరట!

మరి ప్రయాణికుల నుంచి వసూలు చేయని డబ్బును రైల్వే ఎలా భర్తీ చేస్తోంది? ఇక్కడే సరుకు రవాణా కీలకంగా మారుతోంది. బొగ్గు, ధాన్యం, సిమెంట్‌, ఉక్కు వంటి వస్తువులను రైళ్లలో తరలించడం ద్వారా రైల్వేకు ఆదాయం వస్తోంది. ఈ సరుకు రవాణా ద్వారా వచ్చే మిగులు ఆదాయాన్ని ప్రయాణికుల రవాణాకు అయ్యే లోటును భర్తీ చేసేందుకు ఉపయోగిస్తున్నట్లు రైల్వే ఆర్థిక వ్యవహారాల నిపుణులు చాలాకాలంగా విశ్లేషిస్తున్నారు.

సరళంగా చెప్పాలంటే.. ఒకవైపు బొగ్గుతో వెళ్తున్న గూడ్స్‌ రైలు సంపాదించే ఆదాయం.. మరోవైపు తక్కువ ధరకు ప్రయాణిస్తున్న సామాన్యుడికి పరోక్షంగా ఉపయోగపడుతోంది. అంటే మనం కొనే చౌక టికెట్‌ వెనుక సరుకు రవాణా ఆదాయం కూడా కీలక పాత్ర పోషిస్తోంది.

తక్కువ ధర మంచిదేనా? నష్టమూ ఉందా?

ప్రయాణికులకు తక్కువ ధరలకు టికెట్లు అందించడం సరైన విధానమేనని కొందరు వాదిస్తున్నారు. రైల్వే అనేది కేవలం లాభాలు ఆర్జించే వ్యాపార సంస్థ కాదు.. ప్రజలకు సేవలందించే వ్యవస్థ. తక్కువ ఆదాయం ఉన్నవారు, విద్యార్థులు, కార్మికులు, గ్రామీణ ప్రాంతాల ప్రజలు సుదూర ప్రయాణాలు చేయగలుగుతున్నారంటే అందుకు తక్కువ టికెట్‌ ధరలే కారణం. పూర్తి ఖర్చును ప్రయాణికుల నుంచే వసూలు చేస్తే సామాన్యులకు రైలు ప్రయాణం భారంగా మారుతుందన్నది వారి అభిప్రాయం.

మరోవైపు ప్రయాణికుల రవాణాలో నష్టాలు పెరిగితే రైల్వే అభివృద్ధిపై ప్రభావం పడుతుందని ఇంకొందరు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కొత్త రైల్వే లైన్లు, ఆధునిక సిగ్నలింగ్‌ వ్యవస్థలు, అదనపు బోగీలు, ప్రయాణికుల భద్రత వంటి అంశాలకు పెట్టుబడులు అవసరం. ఆదాయంలో ఎక్కువ భాగం నిర్వహణ ఖర్చులకే వెళ్తే ఈ అభివృద్ధి పనులకు నిధులు సమకూర్చడం కష్టమవుతుంది. పైగా సరుకు రవాణాపై మరింత భారం మోపితే వస్తువుల ధరలు పెరిగే అవకాశం ఉంది. అప్పుడు రైల్వేకు పోటీగా రోడ్డు మార్గంలో లారీ రవాణా పెరిగే ప్రమాదమూ ఉంది.

చౌక టికెట్‌.. రద్దీ ప్రయాణం!

ఇక్కడ మరో ఆసక్తికరమైన అంశం ఉంది. తక్కువ ధరకు ప్రయాణించే అవకాశం ఉండటం వల్ల రైల్వేపై డిమాండ్‌ పెరుగుతోంది. కానీ ప్రయాణికుల సంఖ్యకు అనుగుణంగా బోగీలు, సీట్లు అందుబాటులో లేకపోతే రద్దీ తప్పదు. జనరల్‌ బోగీల్లో కూర్చోవడానికి చోటు లేక నిలబడే ప్రయాణికులు, రిజర్వేషన్‌ బోగీల్లో వెయిటింగ్‌ లిస్టులు.. ఇవన్నీ ఆ డిమాండ్‌కు అద్దం పడుతున్నాయి.

అంటే సామాన్యుడికి అందుబాటులో ఉండే తక్కువ టికెట్‌ ధర ఒకవైపు ప్రయాణానికి ఊతమిస్తుంటే.. మరోవైపు పెరుగుతున్న రద్దీకి అనుగుణంగా సదుపాయాలు కల్పించాల్సిన అవసరాన్నీ గుర్తుచేస్తోంది. తక్కువ ధరకు ప్రయాణం అందించడంతో పాటు సౌకర్యవంతమైన ప్రయాణాన్ని కల్పించడం కూడా రైల్వే ముందున్న పెద్ద సవాలు.

పర్యావరణానికీ మేలు చేసే ప్రయాణం

రైలు ప్రయాణాన్ని కేవలం టికెట్‌ ధర, రైల్వే ఆదాయం కోణంలోనే చూడలేం. ఒకే రైలులో వేలాది మంది ప్రయాణించవచ్చు. అదే సంఖ్యలో ప్రజలు రోడ్డు మార్గంలో వేర్వేరు వాహనాల్లో వెళ్తే ట్రాఫిక్‌ రద్దీ, ఇంధన వినియోగం, కాలుష్యం మరింత పెరిగే అవకాశం ఉంది. రైలు రవాణా వల్ల రహదారులపై వాహనాల సంఖ్య తగ్గడంతో పాటు పర్యావరణానికి కూడా మేలు జరుగుతుంది. ఈ ప్రయోజనాలన్నింటినీ ఆర్థిక లెక్కల్లో పూర్తిగా చూపించడం సాధ్యం కాదు.

చివరికి తేలాల్సిన లెక్క ఇదే!

రైల్వే టికెట్‌ ధర తక్కువగా ఉండాలా? ఎక్కువగా ఉండాలా? అనే చర్చ కంటే.. ప్రభుత్వం అందిస్తున్న రాయితీలు నిజంగా అవసరమైన ప్రయాణికులకు ఎంతవరకు ఉపయోగపడుతున్నాయి? పెరుగుతున్న ప్రయాణికుల సంఖ్యకు అనుగుణంగా సదుపాయాలు మెరుగుపడుతున్నాయా? భద్రత, సౌకర్యం, రైళ్ల సంఖ్య పెంచేందుకు తగిన పెట్టుబడులు పెడుతున్నారా? అన్న ప్రశ్నలు ముఖ్యమైనవి.

రైలు కిటికీ పక్కన కూర్చున్న ఆ పదేళ్ల బాలుడికి తన ప్రయాణం వెనుక ఇన్ని ఆర్థిక లెక్కలున్నాయని తెలియదు. అతడికి తెలిసిందల్లా బంధువుల పెళ్లికి వెళ్లడం.. రైలు ప్రయాణాన్ని ఆస్వాదించడం మాత్రమే. కానీ అతడు ప్రయాణిస్తున్న ఆ రైలులోని టికెట్‌ ధరకు, వాస్తవ ఖర్చుకు మధ్య ఉన్న తేడాను ఎవరో ఒకరు భరిస్తున్నారు. అదే సమయంలో ఆ రైల్వే వ్యవస్థను నడిపించేందుకు ప్రతి ఒక్కరి ప్రయాణం, సరుకు రవాణా, ప్రభుత్వ పెట్టుబడులు.. అన్నీ తమవంతు పాత్ర పోషిస్తున్నాయి.

ఒక్కసారి ఆలోచించండి.. మీ రైలు ప్రయాణానికి మరొకరు సబ్సిడీ ఇస్తుంటే.. మీరు ఎక్కిన రైలు ద్వారా మరొకరి ప్రయాణానికీ పరోక్షంగా సహాయం అందుతోందా?

Follow Us