ఇలాంటి వ్యక్తిని ఎప్పుడూ చూడలేదు.. ఆయన పక్కనుంటే చిన్న పిల్లలా మారిపోయా: రాశి ఖన్నా
అందాల భామ రాశి ఖన్నా వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉంది. హిట్లు, ఫ్లాప్స్ తో సంబంధం లేకుండా వరుసగా సినిమాలు చేస్తూ ప్రేక్షకులను మెప్పిస్తుంది. బడా సినిమాలకోసం ఎదురుచూడకుండా వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకుంటుంది. ఊహలు గుసగుసలాడే సినిమాతో పరిచయమైన ఈ అమ్మడు. తక్కువ సమయంలోనే ఎక్కువ క్రేజ్ సొంతం చేసుకుంది.

సూపర్‌స్టార్ రజనీకాంత్‌తో కలిసి స్క్రీన్ షేర్ చేసుకోవాలనే కోరిక ఎంతోమంది నటీనటులకు ఉంటుంది. అలాంటి అరుదైన అవకాశాన్ని అందిపుచ్చుకున్నారు అందాల భామ రాశీ ఖన్నా. ప్రస్తుతం తలైవా హీరోగా తెరకెక్కుతున్న 173వ చిత్రం ‘ధర్మన్’లో ఆమె కీలక పాత్రలో కనిపించనున్నారు. ఈ సినిమా షూటింగ్‌లో రజనీకాంత్‌తో కలిసి పనిచేసిన అనుభవం తనకు ఎప్పటికీ గుర్తుండిపోతుందని రాశీ ఖన్నా చెప్పుకొచ్చారు. ముఖ్యంగా ఆయన వ్యక్తిత్వం, అందరితో కలిసిపోయే విధానం తనను ఎంతగానో ఆకట్టుకున్నాయని వెల్లడించారు. సాధారణంగా సూపర్‌స్టార్ అనే ఇమేజ్ ఉన్న వ్యక్తులతో మాట్లాడాలంటే ఎవరైనా కొంత ఇబ్బందిగా భావిస్తారు. కానీ రజనీకాంత్ విషయంలో అలాంటి పరిస్థితి ఎదురుకాలేదని రాశీ తెలిపారు. సెట్స్‌లో ఆయన ఎంతో సాధారణంగా ఉంటారని, ఎలాంటి హంగూ ఆర్భాటాలు లేకుండా అందరితో స్నేహపూర్వకంగా మెలుగుతారని వివరించారు. షూటింగ్ సమయంలో ఆయనతో ఎన్నో విషయాలు మాట్లాడే అవకాశం దక్కిందని, ఒక్కోసారి తన ప్రశ్నలతో ఆయనను విసిగించేదాన్నని సరదాగా గుర్తుచేసుకున్నారు. తాను అడిగే ప్రశ్నలకు రజనీకాంత్ ఎంతో ఓపికగా సమాధానాలు చెప్పేవారని, ఆయనతో మాట్లాడుతున్నప్పుడు ఒక స్టార్ హీరోతో ఉన్నాననే భావన కలిగేది కాదని రాశీ పేర్కొన్నారు. ఇంతటి స్టార్‌డమ్ ఉన్నప్పటికీ ఆయనలో కనిపించే నిరాడంబరత తనకు ప్రత్యేకంగా అనిపించిందని ప్రశంసించారు.
ఈ కామెంట్స్ ‘ధర్మన్’ సినిమాపై మాత్రమే కాకుండా రజనీకాంత్ వ్యక్తిత్వంపై కూడా అభిమానుల్లో ఆసక్తి పెరుగుతోంది. ఇక ‘ధర్మన్’ విషయానికి వస్తే.. ఈ సినిమా రజనీకాంత్ కెరీర్‌లో అత్యంత ఆసక్తికరమైన ప్రాజెక్టుల్లో ఒకటిగా మారుతోంది. ‘ఓ మై కడవులే’, ‘డ్రాగన్’ చిత్రాలతో మంచి గుర్తింపు తెచ్చుకున్న దర్శకుడు అశ్వత్ మారిముత్తు ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. కమల్ హాసన్‌కు చెందిన రాజ్ కమల్ ఫిల్మ్స్ ఇంటర్నేషనల్, టర్మరిక్ మీడియా సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఇందులో రజనీకాంత్ డాక్టర్ పాత్రలో కనిపించనుండటం మరో ప్రత్యేకత. ఇప్పటికే విడుదలైన ప్రచార చిత్రాలు సినిమాపై భారీ హైప్ క్రియేట్ చేశాయి. ముఖ్యంగా చేతిలో రక్తపు మరకలున్న సర్జికల్ కత్తితో రజనీకాంత్ కనిపించిన తీరు అభిమానులను ఆశ్చర్యపరిచింది. ఆయన పాత్రలో నెగెటివ్ షేడ్స్ ఉంటాయా? సాధారణ వైద్యుడిగా కనిపిస్తూనే నేర సామ్రాజ్యంపై పోరాటం చేస్తారా? అనే ఆసక్తికరమైన చర్చలు సాగుతున్నాయి. మరోవైపు ఈ చిత్రంలో భారీ తారాగణం ఉండటం కూడా ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. రాశీ ఖన్నా, సిమ్రాన్, యోగిబాబు వంటి నటీనటులతో పాటు లేడీ సూపర్‌స్టార్ నయనతార కూడా ఈ ప్రాజెక్టులో భాగమయ్యారు. తాజాగా టాలీవుడ్ క్రేజీ హీరోయిన్ శ్రీలీల కూడా ఈ సినిమాలోకి ఎంట్రీ ఇచ్చారని టాక్.
రజనీకాంత్, శ్రీలీల కాంబినేషన్ తొలిసారి తెరపై కనిపించనుండటంతో ఈ జోడీపై ఆసక్తి నెలకొంది. అలాగే టాలీవుడ్ ఎనర్జిటిక్ హీరో రామ్ పోతినేని కూడా ఈ చిత్రంలో నటిస్తున్నట్లు రాశీ ఖన్నా సోషల్ మీడియా పోస్టుతో వెల్లడైంది. ఆయన పాత్రకు సంబంధించి రకరకాల ప్రచారాలు జరుగుతున్నప్పటికీ పూర్తి వివరాలు మాత్రం బయటకు రాలేదు. అనిరుధ్ రవిచందర్ సంగీతం అందిస్తుండగా, నికేత్ బొమ్మి సినిమాటోగ్రఫీ బాధ్యతలు చేపట్టారు. యాక్షన్ సన్నివేశాలకు అన్బరివ్ ద్వయం పనిచేస్తోంది. ఇప్పటికే పలు షెడ్యూళ్ల చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ సినిమా చివరి దశ షూటింగ్ వైపు అడుగులు వేస్తోంది. నవంబర్‌లో శ్రీలీల చేరికతో ప్రాజెక్టుపై మరోసారి చర్చ మొదలైంది. రజనీకాంత్, కమల్ హాసన్ వంటి దిగ్గజాల నిర్మాణ భాగస్వామ్యం ఉండటంతో ఈ సినిమాపై ట్రేడ్ వర్గాల్లోనూ భారీ అంచనాలు ఉన్నాయి. విడుదల తేదీ విషయానికి వస్తే.. తొలుత సంక్రాంతి 2027 విడుదలపై ప్రచారం జరిగినప్పటికీ, తాజాగా ఏప్రిల్ 2027లో సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
