PM Modi Europe Visit: ముగిసిన ప్రధాని మోదీ మూడు రోజుల యూరప్ పర్యటన.. ఎవరెవరిని కలిసారంటే!
భారత ప్రధాని నరేంద్ర మోదీ మూడు రోజుల యూరప్ పర్యటన ముగిసింది. తన మూడు రోజుల యూరప్ పర్యటనను పూర్తి చేసుకుని, ప్రధాని నరేంద్ర మోదీ బుధవారం పారిస్‌లో కొద్దిసేపు గడిపిన తర్వాత స్వదేశానికి బయలుదేరారు.
PM Narendra Modi Departed For India: భారత ప్రధాని నరేంద్ర మోదీ మూడు రోజుల యూరప్ పర్యటన ముగిసింది. తన మూడు రోజుల యూరప్ పర్యటనను పూర్తి చేసుకుని, ప్రధాని నరేంద్ర మోదీ బుధవారం పారిస్‌లో కొద్దిసేపు గడిపిన తర్వాత స్వదేశానికి బయలుదేరారు. ప్యారిస్ పర్యటన సందర్భంగా ప్రధాని మోదీ ఫ్రాన్స్ నూతనంగా ఎన్నికైన అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్‌తో చర్చలు జరిపారు. రక్షణ, అంతరిక్షం, పౌర అణు సహకారం, ప్రజల మధ్య సంబంధాలతో పాటు ప్రాంతీయ, ప్రపంచ సమస్యలపై అనేక ద్వైపాక్షిక అంశాలపై చర్చలు జరిపారు.
ఉక్రెయిన్‌పై రష్యా సైనిక చర్య తీసుకున్న నేపథ్యంలో ప్రాంతీయ, ప్రపంచ అంశాలపై కూడా ఇరువురు నేతలు చర్చకు వచ్చినట్లు సమాచారం. ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయెల్ మాక్రాన్‌తో అనేక విభిన్న అంశాలపై చర్చించే అవకాశం లభించిందని ప్రధాని బయలుదేరే ముందు ట్వీట్ చేసిన నంగతి తెలిసిందే. బయలుదేరే ముందు ప్రధాని మోదీ ట్వీట్ చేస్తూ, “ఫ్రాన్స్ పర్యటన క్లుప్తమైనది. కానీ చాలా ఫలవంతమైనది. ప్రెసిడెంట్ ఇమ్మాన్యుయేల్ మాక్రాన్‌తో విభిన్న అంశాలపై చర్చించే అవకాశం కలిగింది. నేను ఇచ్చిన సాదరమైన ఆతిథ్యానికి ఆయనకు, ఫ్రెంచ్ ప్రభుత్వానికి ధన్యవాదాలు.” అంటూ పేర్కొన్నారు. ప్రధాని మోదీ తన పర్యటనలో జర్మనీ, డెన్మార్క్, ఫ్రాన్స్ నాయకత్వంతో పలు ఉన్నత స్థాయి సమావేశాలు నిర్వహించారు. మూడు దేశాల్లోని భారతీయ ప్రవాసులతో కూడా చర్చలు జరిపారు. తన పర్యటన సందర్భంగా, ప్రధాన మంత్రి జర్మనీ, డెన్మార్క్ వ్యాపార ప్రముఖులతో కూడా మోదీ ప్రత్యేకంగా భేటీ అయ్యారు.
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సోమవారం బెర్లిన్‌కు చేరుకున్నారు.అక్కడ 6వ భారత్-జర్మనీ అంతర్-ప్రభుత్వ సంప్రదింపులకు హాజరయ్యే ముందు జర్మనీ ఛాన్సలర్ ఓలాఫ్ స్కోల్జ్‌తో ద్వైపాక్షిక చర్చలు జరిపారు. భారత్, జర్మనీల మధ్య మొత్తం 9 ఒప్పందాలు కుదిరాయి. గ్రీన్ అండ్ సస్టైనబుల్ డెవలప్‌మెంట్ పార్టనర్‌షిప్ (JDI)పై జాయింట్ డిక్లరేషన్‌తో సహా, 2030 నాటికి భారతదేశానికి 10 బిలియన్ యూరోల కొత్త అదనపు అభివృద్ధి సహాయాన్ని అందించడానికి జర్మనీ అంగీకరించింది.
తన పర్యటనలో రెండవ రోజు, భారత ప్రధాని కోపెన్‌హాగన్ చేరుకున్నారు. అక్కడ తన డెన్మార్క్ కౌంటర్ మెట్టె ఫ్రెడ్రిక్సెన్‌తో చర్చలు జరిపారు. రెండు దేశాల మధ్య వాణిజ్యం,పర్యావరణ చర్యలపై సహకారంతో సహా ద్వైపాక్షిక అంశాలపై చర్చించారు. మైగ్రేషన్, మొబిలిటీ, నైపుణ్యాభివృద్ధి, వృత్తి విద్య, వ్యవస్థాపకత రంగాలలో సహకారంపై అవగాహన ఒప్పందం (MOU) కుదుర్చుకున్నారు. ఇంధన విధానాన్ని ప్రారంభించడం వంటి అనేక ఒప్పందాలు రెండు దేశాల మధ్య అధికారికంగా సంతకం చేశాయి.
అలాగే, నార్వే, స్వీడన్, ఐస్‌లాండ్, ఫిన్‌లాండ్ మరియు డెన్మార్క్ ప్రధాన మంత్రులతో కలిసి ప్రధాని మోదీ తన పర్యటనలో మూడో రోజు భారత్-నార్డిక్ రెండో శిఖరాగ్ర సమావేశానికి హాజరయ్యారు. సమ్మిట్ సందర్భంగా, ప్రధానమంత్రులు నార్డిక్ దేశాలు, భారతదేశం మధ్య సహకారాన్ని మరింతగా కొనసాగించాలని నిర్ణయించుకున్నారు. ఉక్రెయిన్‌లో సంఘర్షణ, బహుపాక్షిక సహకారం, వాతావరణ మార్పులతో సహా అంతర్జాతీయ శాంతి భద్రతలకు సంబంధించిన కీలక అంశాలపై తమ చర్చలను కేంద్రీకరించారు. ఆర్థిక వ్యవస్థ, ఆవిష్కరణలు, డిజిటలైజేషన్‌పై చర్చలు జరిగాయి.