PM Modi: ప్రపంచ శక్తిగా భారత్.. 38 దేశాలతో వాణిజ్య ఒప్పందాలు.. మోదీ సర్కార్ సంస్కరణలతో నవశకానికి నాంది..

ఒకప్పుడు చర్చల దశలోనే ఆగిపోయిన వాణిజ్య ఒప్పందాలు ఇప్పుడు వాస్తవ రూపం దాల్చి 38 దేశాలతో స్వేచ్ఛా వాణిజ్యానికి దారితీశాయి. ఎంఎస్ఎంఈల ప్రపంచీకరణ నుండి రక్షణ రంగంలో ఆత్మనిర్భరత వరకు.. భారత్ తనను తాను పునర్నిర్మించుకుంటోంది. సామాన్య పౌరుడికి ఆర్థిక భరోసా ఇస్తూనే, ప్రపంచ వేదికపై సూపర్ పవర్‌గా ఎదుగుతుంది.

PM Modi: ప్రపంచ శక్తిగా భారత్.. 38 దేశాలతో వాణిజ్య ఒప్పందాలు.. మోదీ సర్కార్ సంస్కరణలతో నవశకానికి నాంది..
India Economic Transformation

Updated on: Feb 16, 2026 | 11:59 AM

భారత్ ఇప్పుడు కేవలం ఒక అభివృద్ధి చెందుతున్న దేశం మాత్రమే కాదు.. ప్రపంచ ఆర్థిక క్రమాన్ని శాసించే శక్తిగా అవతరిస్తోంది. ఇటీవల ప్రవేశపెట్టిన కేంద్ర బడ్జెట్, అంతర్జాతీయ వాణిజ్య ఒప్పందాలు దేశ ముఖచిత్రాన్ని మార్చనున్నాయి. గత దశాబ్ద కాలంగా సాగిన సంస్కరణల పరంపర ఇప్పుడు వికసిత్ భారత్ 2047 వైపు వేగంగా పరుగులు పెడుతోంది. గతంలో చర్చల దశలోనే ఆగిపోయిన వాణిజ్య ఒప్పందాలు ఇప్పుడు వాస్తవ రూపం దాల్చాయి. యూకే, యూరోపియన్ యూనియన్, ఆస్ట్రేలియా వంటి 38 భాగస్వామ్య దేశాలతో భారత్ కుదుర్చుకున్న స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాలు చారిత్రాత్మక మైలురాళ్లుగా నిలిచాయి. మన ఎగుమతుల్లో దాదాపు 99శాతం ఎగుమతులపై సుంకాలు తొలగిపోవడం వల్ల భారతీయ వస్తువులు అంతర్జాతీయ మార్కెట్లో చౌకగా లభిస్తున్నాయి. ఒప్పందాల తర్వాత ఆస్ట్రేలియా, యూఏఈలతో వాణిజ్యం ఇప్పటికే రెట్టింపు కావడం విశేషం. పీటీఐకి ఇచ్చిన ఇంటర్వూలో ప్రధాని నరేంద్ర మోదీ కీలక విషయాలను ప్రస్తావించారు.

చిన్న పరిశ్రమలే దేశానికి వెన్నెముక

ఒకప్పుడు స్థానిక మార్కెట్లకే పరిమితమైన సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలు ఇప్పుడు ప్రపంచ సరఫరా గొలుసులో కీలక భాగస్వాములుగా మారాయి. MSMEలకు వర్కింగ్ క్యాపిటల్ సులభంగా అందేలా బడ్జెట్‌లో ప్రత్యేక చర్యలు తీసుకున్నారు. జీరో డిఫెక్ట్ – జీరో ఎఫెక్ట్ నినాదంతో భారతీయ ఉత్పత్తులు ప్రపంచ స్థాయి ప్రమాణాలను అందుకుంటున్నాయి.

మౌలిక సదుపాయాల్లో మెగా పెట్టుబడులు

ప్రభుత్వం మౌలిక సదుపాయాల కల్పనపై అసాధారణమైన దృష్టి సారించింది. 2013తో పోలిస్తే మూలధన వ్యయం 5 రెట్లు పెరగడం గమనార్హం. దక్షిణ భారత దేశంలో హై-స్పీడ్ డైమండ్ కారిడార్ ద్వారా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాలకు రవాణా విప్లవం రాబోతోంది. కేవలం డేటా వినియోగదారులుగానే కాకుండా ప్రపంచ డేటా సెంటర్లకు హబ్‌గా భారత్‌ను మార్చేందుకు పన్ను ప్రోత్సాహకాలు ప్రకటించారు. ఇది మన యువతకు ఐటీ, AI రంగాల్లో భారీగా ఉద్యోగాలను సృష్టించనుంది.

రక్షణ రంగంలో ఆత్మనిర్భర గర్జన

రక్షణ రంగానికి రికార్డు స్థాయిలో రూ.7.85 లక్షల కోట్ల కేటాయింపులు జరిగాయి. ఇందులో విశేషం ఏమిటంటే.. ఈ బడ్జెట్‌లో 75శాతం నిధులను స్వదేశీ కంపెనీల నుంచే ఆయుధాలు, పరికరాల కొనుగోలుకు కేటాయించడం. దీనివల్ల మన సైన్యం బలోపేతం అవ్వడమే కాకుండా రక్షణ ఎగుమతుల్లో భారత్ మునుపెన్నడూ లేని విధంగా దూసుకుపోతోంది. మన రక్షణ ఎగుమతులు రూ.23,000 కోట్లు దాటడం భారత్ యొక్క సాంకేతిక పటిమకు నిదర్శనం. ఆపరేషన్ సిందూర్ ద్వారా మన సైన్యం చూపిన ధైర్యం ఈ ఆధునీకరణకు మరింత స్ఫూర్తినిచ్చింది.

డిజిటల్ లీడర్‌షిప్ – AI హబ్

భారత్ కేవలం డేటాను వినియోగించే దేశంగా మాత్రమే కాకుండా డేటాను భద్రపరిచే, ప్రాసెస్ చేసే కేంద్రంగా మారుతోంది. టెక్నాలజీ రంగంలో నాయకత్వం వహించేందుకు డేటా సెంటర్లకు ప్రత్యేక పన్ను ప్రోత్సాహకాలు కల్పించారు. కృత్రిమ మేధస్సు అభివృద్ధికి అవసరమైన కంప్యూటింగ్ శక్తిని భారత్‌లోనే నిర్మించేలా ప్రణాళికలు సిద్ధమయ్యాయి.

మహిళా నేతృత్వంలో అభివృద్ధి

నారీ శక్తి లేకుండా విక్షిత్ భారత్ సాధ్యం కాదనే నినాదంతో ప్రభుత్వం మహిళా సంక్షేమం, సాధికారతకు పెద్దపీట వేసింది. వరుసగా 9 సార్లు బడ్జెట్ ప్రవేశపెట్టిన ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కృషిని ఈ సందర్భంగా ప్రశంసిస్తూ.. మహిళల కోసం ప్రత్యేక పథకాలను బడ్జెట్‌లో పొందుపరిచారు.

రిఫార్మ్ ఎక్స్‌ప్రెస్: ఆగని సంస్కరణల పర్వం

జీఎస్‌టీ సరళీకరణ, కార్మిక చట్టాల సవరణ, డిజిటల్ పేమెంట్స్‌లో అగ్రస్థానం.. ఇలా ప్రతి రంగంలోనూ భారత్ తనను తాను పునర్నిర్మించుకుంటోంది. ఇదే సమయం.. సరైన సమయం అనే నినాదంతో ప్రభుత్వం ముందుకు సాగుతోంది.

ప్రధాని మాటల్లో చెప్పాలంటే.. ఇది బలవంతంగా వచ్చిన మార్పు కాదు, ఒక సామాజిక సంకల్పం. యహి సమయ్ హై, సహి సమయ్ హై అనే నినాదం ఇప్పుడు జాతీయ విశ్వాసంగా మారింది. 2047 నాటికి అభివృద్ధి చెందిన భారత్‌ను నిర్మించే క్రమంలో ఈ 2026 బడ్జెట్ ఒక బలమైన పునాదిగా నిలవనుంది.