ఇది నా ప్రభుత్వంపై కుట్రలానే ఉంది, బాలీవుడ్ చిత్రం లోని క్లిప్ ను వాడుకున్న పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్
తన ప్రభుత్వాన్ని అస్థిర పరచేందుకు ప్రతిపక్షాలు కుట్ర పన్నుతున్నాయని . పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ఆరోపించారు. తన ప్రభుత్వంతో బాటు తన నేతృత్వంలోని అధికార...
తన ప్రభుత్వాన్ని అస్థిర పరచేందుకు ప్రతిపక్షాలు కుట్ర పన్నుతున్నాయని . పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ఆరోపించారు. తన ప్రభుత్వంతో బాటు తన నేతృత్వంలోని అధికార పార్టీని సైతం ఇబ్బందుల్లో పెట్టేందుకు విపక్షాలు యత్నిస్తున్నాయని ఆయన అన్నారు. ఈ సందర్భంగా ఆయన 1984 నాటి బాలీవుడ్ చిత్రంలోని ఓ క్లిప్ ను వినియోగించుకున్నారు. ‘ఇంక్విలాబ్’ అనే ఆ సినిమాలో అవినీతి నేత పాత్ర పోషించిన నటుడు ఖాదర్ ఖాన్.. ఎన్నికైన ఓ ప్రభుత్వాన్ని పడగొట్టేందుకు ఎలాంటి కుయుక్తులు పన్నాలో తమ పార్టీ నేతలకు వివరిస్తారు. ప్రజలే ఈ ప్రభుత్వాన్ని అసహ్యించుకునేలా వారిలో మార్పును తేవాలని, మన చేతులకు మట్టి అంటకుండా చూసుకోవాలని ఆయన తమ పార్టీ సభ్యులకు బోధిస్తారు. ఇందుకోసం 50 లక్షలు ఖర్చయినా ఫరవాలేదని అంటాడు. మరి ఒక్కసారిగా పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ కి ఈ సినిమా ఎందుకు గుర్తొచ్చిందో కానీ పని గట్టుకుని ఈ మూవీ క్లిప్ ని తన ట్విటర్ లో పోస్ట్ చేసి.. ఇది తన ప్రభుత్వాన్ని పడగొట్టే కుట్ర మాదిరే ఉందన్నారు.
ఇటీవల ఈ దేశంలో ఇమ్రాన్ ఖాన్ ప్రభుత్వం గద్దె దిగాలంటూ 11 పార్టీల అతి పెద్ద విపక్ష కూటమి ర్యాలీలు నిర్వహించింది . మానవ హక్కులను కాలరాస్తున్న ఈ ప్రభుత్వానికి అధికారంలో కొనసాగే హక్కు లేదని ఈ కూటమి ఆరోపించింది. సైన్యం చేతిలో ఇది కీలుబొమ్మ సర్కార్ అని పలువురు విపక్ష నేతలు దుయ్యబట్టారు. కాగా ఇమ్రాన్ ఖాన్ తన రాజకీయాల కోసం ఓ బాలీవుడ్ మూవీలోని ఈ క్లిప్ ను వాడుకోవడాన్ని అనేకమంది ట్విటర్ యూజర్లు అపహాస్యం చేశారు. తన పదవికి ఎక్కడ గండం పట్టుకుంటుందోనని ఇమ్రాన్ ఖాన్ కి భయం వేస్తున్నట్టు ఉందని, అయినా ఓ సినిమా క్లిప్ ను ఆయన వినియోగించుకోవడమేమిటని వారు ట్వీట్ చేశారు. ఒకప్పుడు బాలీవుడ్ చిత్రాలను పొగిడిన ఈయన ఇప్పుడు ఇలా తన స్వార్థంకోసం విచిత్రమైన పోకడలకు పోతున్నారని వారన్నారు.