Prophet Row: ప్రయాగ్‌రాజ్ హింసాకాండలో ప్రధాన నిందితుడి ఇల్లు కూల్చివేత.. ఎందుకంటే..
ప్రయాగ్‌రాజ్ హింసాకాండలో ప్రధాన నిందితుడైన జావేద్ మహ్మద్ ఇంటిని ఈ రోజు (జూన్ 12) మధ్యాహ్నం ఉత్తరప్రదేశ్ పోలీసులు కూల్చివేశారు. కూల్చివేతకు ముందు అతని ఇంట్లో అక్రమ ఆయుధాలు, అభ్యంతరకర పోస్టర్లు..
Prayagraj violence case: ప్రయాగ్‌రాజ్ హింసాకాండలో ప్రధాన నిందితుడైన జావేద్ మహ్మద్ ఇంటిని ఈ రోజు (జూన్ 12) మధ్యాహ్నం ఉత్తరప్రదేశ్ పోలీసులు కూల్చివేశారు. కూల్చివేతకు ముందు అతని ఇంట్లో అక్రమ ఆయుధాలు, అభ్యంతరకర పోస్టర్లు కనుగొన్నట్లు యూపీ పోలీసులు తెలిపారు. 12 బోర్ ఇల్లీగల్ పిస్టల్లు, 315 బోర్ పిస్టల్ గన్‌లు, తూటాలు, కోర్టుకు వ్యతిరేకంగా అభ్యంతరకరమైన వ్యాఖ్యలతో కూడిన కొన్ని పత్రాలను కనుగొన్నట్లు సీనియర్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ అజయ్ కుమార్ మీడియాకు తెలిపారు. అక్రమ నిర్మాణం కారణంగా అతని ఇంటిని కూల్చివేస్తున్నట్లు ఇంటి బయట నోటీసులు అంటించి, ఆ తర్వాత కొన్ని గంటల వ్యవధిలోనే ఇంటిని కూల్చివేసినట్లు పేర్కొన్నారు.
కాగా మహ్మద్ ప్రవక్తపై బీజేపీ మాజీ అధికార ప్రతినిధి నూపుర్ శర్మ చేసిన వ్యాఖ్యలకు వ్యతిరేకంగా ప్రయాగ్‌రాజ్‌లో శుక్రవారం చెలరేగిన నిరసనల్లో జావేద్ కీలక కుట్రదారుగా గుర్తించబడ్డాడు. ఈ క్రమంలో అతని ఇంటిని సోదా చేయగా అక్రమ ఆయుధాలు, పోస్టర్లు బయటపడ్డాయి. ఇప్పటికే ప్రయాగ్‌రాజ్ హింసాకాండలో జావెద్ మహ్మద్ దోషిగా అరెస్టయ్యాడు. ఈ కేసులో మిగిలిన సూత్రదారులను కూడా త్వరలోనే పట్టుకుంటామని ప్రయాగ్‌రాజ్ సీనియర్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ (SSP) అజయ్ కుమార్ మీడియాతో అన్నారు.