ముంబైని ముంచెత్తుతున్న భారీ వర్షాలు

భారీ వర్షాలకు ముంబై మళ్లీ అతలాకుతలం అవుతోంది. ఎడతెరిపిలేని వర్షాలకు ప్రధాన రహదారులు చెరువులను తలపిస్తున్నాయి. రైలు, రోడ్డు మార్గాల్లో వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది.

ముంబైని ముంచెత్తుతున్న భారీ వర్షాలు

Edited By:

Updated on: Sep 24, 2020 | 10:34 AM

భారీ వర్షాలకు ముంబై మళ్లీ అతలాకుతలం అవుతోంది. ఓ వైపు కరోనా వెంటాడుతుంటే.. మరోవైపు భారీ వర్షాలు వణికిస్తున్నాయి. ముంబైలోని అనేక ప్రాంతాలు జలమయమయ్యాయి. ఎడతెరిపిలేని వర్షాలకు ప్రధాన రహదారులు చెరువులను తలపిస్తున్నాయి. రైలు, రోడ్డు మార్గాల్లో వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. పీకల్లోతు నీటిలో ప్రయాణికులు తీవ్ర అవస్థలు ఎదుర్కొంటున్నారు.

ముంబై ప్రధాన రహదారులను వరద ముంచెత్తుండటంతో వాహనాలు ఎక్కడికక్కడే నిలిచిపోపోయి ట్రాఫిక్‌ సమస్య ఏర్పడింది. నగరానికి వరద ముప్పు పొంచి ఉందన్న వాతావరణ శాఖ హెచ్చరికలతో పలు రైలు సర్వీసులను నిలిపివేశారు. నగరంలోని పలు ఆస్పత్రుల్లోకి నీరు చేరింది. అత్యవసర సర్వీసులు మినహా అన్ని ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయాలు మూసివేయాలని బృహన్‌ ముంబై కార్పొరేషన్‌ ఆదేశించింది. అత్యవసరమైతే తప్ప ఎవరూ బయటకు రావొద్దని సూచించింది.

శాంతాక్రజ్‌, సియాన్, గోరేగావ్ సహా పలు ప్రాంతాల్లో భారీగా వరద నీరు చేరింది. 24 గంటల పాటు ముంబయి సబర్బన్‌ ప్రాంతంలో అత్యధికంగా 30 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైనట్టు ముంబై వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. సహాయక చర్యల కోసం ఎన్డీఆర్ఎఫ్ బృందాలు రంగంలోకి దిగాయి. వాతావరణం పూర్తిగా చల్లబడడంతో కరోనా జడలు విప్పే ప్రమాదముందని ఆందోళన చెందుతున్నారు.

ఫ్లైఓవర్‌ వంతెనలపై నుంచి వరదనీరు నదిలా కిందకి ప్రవహిస్తోంది. కొన్నిచోట్ల పార్కింగ్‌లో నిలిపిన కార్లు, బైక్‌లు కొట్టుకుపోయాయి. మరో 24 గంటలపాటు భారీవర్షాలు ఉంటాయని వాతావరణశాఖ ప్రకటించడంతో బృహన్‌ ముంబై కార్పొరేషన్‌ అధికారులు, సిబ్బంది అప్రమత్తమయ్యారు.

భారీ వర్షాల నేపథ్యంలో బాంబే హైకోర్టులో కార్యకలాపాలు సైతం నిలిచిపోయాయి. సినీ నటి రియా చక్రవర్తి, ఆమె సోదరుడు షోవిక్‌ చక్రవర్తి బెయిల్‌ పిటిషన్లపై విచారణ జరగాల్సి ఉన్నప్పటికీ వాయిదా పడ్డాయి. అలాగే ముంబైలోని తన కార్యాలయం కూల్చివేతపై బాలీవుడ్‌ నటి కంగనా రనౌత్‌ వేసిన పిటిషన్‌పైనా విచారణ ఈ రోజే వుంది.