బెంగళూరులో మండుటెండల్లో వరదలు వణికించాయి. ఆకస్మిక వర్షాలు నగరాన్ని ముంచెత్తాయి. భారీ వర్షాలకు నగరమంతా జలమయమయ్యింది. పలుచోట్లు వరదనీటిలో కొట్టుకుపోతున్న జనాన్ని కాపాడడానికి భారీ సహాయక చర్యలు చేపట్టారు. కేఆర్ సర్కిల్‌లో వరదనీటిలో కొట్టుకుపోతున్న జనాన్ని సహాయక సిబ్బంది కాపాడారు. అండర్‌పాస్‌లో వరదనీరు చేరింది. సబ్‌వేలు నీట మునిగాయి. కార్లు వరదనీటిలో కొట్టుకుపోయాయి. ఎలక్ట్రానిక్ సిటీ, మేజెస్టిక్ ప్రాంతాల్లో కుండపోత వర్షం కురిసింది. భారీ వర్షాలు, ఈదురు గాలులతో పలు ప్రాంతాల్లో చెట్లు కుప్పకూలాయి. కార్లు ధ్వసంమయ్యాయి.
కేఆర్ సర్కిల్ ప్రాంతంలో సబ్‌వేలో కారు చిక్కుకుంది. కారులో ఉన్న ఆరుగురిని అతికష్టం మీద రక్షించారు. భారీ నిచ్చెన సాయంతో బయటకు తీసుకొచ్చారు. కారు నుంచి బయటకు తీసుకొచ్చిన వారిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉండడంతో ఆస్పత్రికి తరలించారు. కారులో ఉన్న వారిని ఏపీ కృష్ణా జిల్లా తేలప్రోలుకు చెందిన వారిగా గుర్తించారు. వీరంతా హైదరాబాద్ నుంచి బెంగళూరుకు విహారయాత్రకు వెళ్లారు. నలుగురు క్షేమంగా బయటపడగా.. మరో ఇద్దరు గల్లంతయ్యారు. గల్లంతైన వారికోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి.
రాజధాని బెంగళూరులో ఆదివారం మధ్యాహ్నం వర్షం మొదలైంది. భారీ వర్షంతో చాలా ప్రాంతాలు నీటమునిగాయి. రోడ్లన్ని జలమయమయ్యాయి. కాగా.. బెంగళూరులో ఆకస్మిక వరదలపై సీఎం సిద్ధరామయ్య అధికారులతో సమీక్ష నిర్వహిస్తున్నారు.
Heavy Rain In Rajajinagar, Mahalaskhmi Layout, Laggere. #bengaluru #bengalururain #rain pic.twitter.com/4oEZCUIkHf
— Naveen Navi (@IamNavinaveen) May 21, 2023
మరో నాలుగు రోజులు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఆదివారం రాత్రి కూడా విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని, రానున్న నాలుగు రోజుల పాటు బెంగళూరులోనే కాకుండా రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది.
మరిన్ని జాతీయ వార్తల కోసం..