India Corona: పరిస్థితులు చేయి దాటితే ఫోర్త్ వేవ్ డేంజర్ బెల్స్ మోగినట్లే.. కానీ
దేశంలో కరోనా కేసుల(Corona Cases in India) పెరుగుదల మళ్లీ మొదలైంది. నిన్న మొన్నటి వరకు నిలకడగా నమోదవుతున్న కేసులు ప్రస్తుతం నాలుగువేలు దాటాయి. పరిస్థితిని నియంత్రించకపోతే రోజూవారి కేసుల సంఖ్యలో...
దేశంలో కరోనా కేసుల(Corona Cases in India) పెరుగుదల మళ్లీ మొదలైంది. నిన్న మొన్నటి వరకు నిలకడగా నమోదవుతున్న కేసులు ప్రస్తుతం నాలుగువేలు దాటాయి. పరిస్థితిని నియంత్రించకపోతే రోజూవారి కేసుల సంఖ్యలో భారీ పెరుగుదల నమోదయ్యే ప్రమాదం ఉందని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. కొత్త కేసులతో పాటు యాక్టీవ్ కేసుల సంఖ్య కూడా ప్రమాదకరస్థాయిలో ఉండటం కలవరపెడుతోంది. అయితే ఈ పరిస్థితులు ఫోర్త్ వేవ్ కు(Fourth Wave) కారణమా అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. అయితే కరోనా నిబంధనలు పాటించడం ద్వారా వైరస్ వ్యాప్తిని అరికట్టవచ్చని నిపుణులు చెబుతున్నారు. ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా మాస్కు ధరించాలని సూచిస్తున్నారు. అంతే కాకుండా కరోనా వైరస్ జీవించి ఉన్నంతకాలం కొత్త వేరియంట్లు పుట్టుకొస్తూనే ఉంటాయని, తగిన జాగ్రత్తలు పాటిస్తే అది మనల్ని ఏమీ చేయలేదని వైద్యాధికారులు విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు. టీకాలు పొందినవారికి, గతంలో వైరస్ బారిన పడినవారికి ఒమిక్రాన్ లేదా దాని ఉపవేరియంట్లు సోకవచ్చని అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
వైరస్ సోకిన వారు చాలామందిలో లక్షణాలు లేకుండా కానీ, తేలికపాటి లక్షణాలు కలిగి ఉంటారు. పరిస్థితి చేయిదాటితే మాత్రం నాలుగో వేవ్ వచ్చిందని భావించాలని చెబుతున్నారు. ప్రస్తుతం నమోదవుతున్న కేసుల జీనోమ్ సీక్వెన్సింగ్ చేయకపోతే కొత్త వేరియంట్లను గుర్తించే అవకాశం తక్కువగా ఉంటుందన్నారు. దేశంలో అత్యవసర పరిస్థితులు లేనంతకాలం ఫోర్త్ వేవ్ గురించి ఆలోచించాల్సిన పని లేదని స్పష్టం చేశారు.
సోమవారం వైద్య పరీక్షలు నిర్వహించగా 4,518 మందికి కరోనా వైరస్ ఉన్నట్లు తేలింది. ముందురోజు 4.13 లక్షల మందిని పరీక్షిస్తే 4,270 కేసులొచ్చాయి. ఈ క్రమంలో పరీక్షల సంఖ్య తగ్గినా నాలుగువేలకు పైగానే కేసులు రావడం గమనార్హం. దేశవ్యాప్తంగా ఇప్పటివరకూ 4.31 కోట్ల మందికి పైగా కరోనా బారిన పడ్డారు. ప్రస్తుతం యాక్టీవ్ కేసుల సంఖ్య కూడా ఎక్కువగానే ఉంది. వాటి సంఖ్య 25,782కు ఎగబాకింది. ఆ రేటు 0.06 శాతానికి చేరింది. 24 గంటల వ్యవధిలో 2,779 మంది కోలుకోగా 9 మంది మృతి చెందారు.
మరిన్ని జాతీయం వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి