AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

AirIndia: అహ్మదాబాద్‌ విమాన ప్రమాదంపై కేంద్ర హోంశాఖ సమీక్ష! కీలక నిర్ణయం..

జూన్ 12న అహ్మదాబాద్ విమానాశ్రయం సమీపంలో జరిగిన విమాన ప్రమాదంలో 269 మంది మరణించారు. కేంద్ర హోం శాఖ దీనిపై సమీక్ష నిర్వహించింది. విమాన ప్రమాద కారణాలను, ప్రమాణాలను పరిశీలించి భవిష్యత్తులో ఇలాంటి ప్రమాదాలను నివారించేందుకు చర్యలు తీసుకుంటామని ప్రకటించింది. విమానయాన భద్రతకు రోడ్ మ్యాప్ రూపొందించాలని నిర్ణయించారు.

AirIndia: అహ్మదాబాద్‌ విమాన ప్రమాదంపై కేంద్ర హోంశాఖ సమీక్ష! కీలక నిర్ణయం..
Air India Ai171 Crash
SN Pasha
|

Updated on: Jun 17, 2025 | 1:39 PM

Share

జూన్‌ 12న గుజరాత్‌లోని అహ్మదాబాద్‌ ఎయిర్‌పోర్ట్‌కు అతి సమీపంలో ఘోర విమాన ప్రమాదం జరిగిన విషయం తెలిసిందే. ఈ దుర్ఘటనలో ఏకంగా 269 మంది మరణించారు. అయితే ప్రమాదంపై తాజాగా కేంద్ర హోం శాఖ సమీక్ష నిర్వహించింది. దాదాపు రెండు గంటల పాటు కేంద్ర హోంశాఖ కార్యదర్శి ప్రమాదంపై చర్చించారు. ప్రధానంగా విమాన ప్రమాదానికి దారితీసే కారణాలపై ఫోకస్‌ చేసినట్లు సమాచారం. గత ప్రమాదాల రికార్డులను ఉన్నత స్థాయి కమిటీ పరిశీలించింది. విమానాల ప్రామాణిక ఆపరేటింగ్‌ విధానాలపై కూడా ఈ సందర్భంగా చర్చించారు. భవిష్యత్‌లో విమాన ప్రమాదాలను నివారించడానికి ప్రామాణిక ఆపరేటింగ్‌ విధానాల రూపకల్పన చేయాలని నిర్ణయించారు.

అలాగే విమాన ప్రయాణ భద్రతకు రోడ్‌మ్యాప్‌ రూపొందించాలని కూడా కేంద్ర హోం నిర్ణయం తీసుకుంది. అహ్మదాబాద్‌ విమాన ప్రమాదం, భవిష్యత్‌లో ప్రమాదాల నివారణకు తీసుకోవాల్సిన చర్యలపై నివేదిక రూపొందించి విమానయానశాఖకు సమర్పించనుంది ఉన్నత స్థాయి కమిటీ. అహ్మదాబాద్‌ విమాన ప్రమాదానికి కారణాలను నిర్ధారించడం.. సాంకేతిక వైఫల్యమా? లేక మానవ తప్పిదమా.. లేదంటే ప్రతికూల వాతావరణ పరిస్థితులు, నియంత్రణ నిర్వహణ లోపమో తేల్చనుంది ఈ కమిటీ. కాగా విమాన ప్రమాదం సాంకేతిక దర్యాప్తునకు ఏడాది సమయం ఇచ్చారు. ప్రోటోకాల్‌ ప్రకారం నివేదిక ఇచ్చేందుకు ఏడాది గడువు విధించారు.

కాగా ఈ ప్రమాదంపై ఇప్పటికే ఎయిర్‌క్రాఫ్ట్‌ యాక్సిడెంట్‌ ఇన్వెస్టిగేషన్‌ బ్యూరో దర్యాప్తు జరుపుతోంది. సాంకేతిక దర్యాప్తులో AAIBకి అమెరికా నేషనల్‌ ట్రాన్స్‌పోర్టేషన్‌ సేఫ్టీ బోర్డ్‌ సహకారం అందిస్తోంది. ప్రమాద స్థలం నుంచి సేకరించిన బ్లాక్‌బాక్స్‌ డేటా ద్వారా ప్రమాదానికి కారణాలు AAIB తెలుసుకునే ప్రయత్నం చేయనుంది. ఢిల్లీలో బ్లాక్‌ బాక్స్‌ డేటాను దర్యాప్తు సంస్థలు పరిశీలించనున్నాయి. అయితే.. బోయింగ్‌ డ్రీమ్‌లైనర్‌ 787 సిరీస్‌లో కూలిపోయిన మొదటి విమానం ఇదే కావడంతో ప్రపంచ దేశాలన్నీ అహ్మదాబాద్‌ ప్రమాదంపై దృష్టిపెట్టాయి. ప్రపంచవ్యాప్తంగా బోయింగ్‌ 787 విమానాలు వినియోగంలో ఉన్నందున సాంకేతిక దర్యాప్తు అత్యంత కీలకంగా మారింది. ఫ్లైట్‌ ట్రాకింగ్‌ డేటా ప్రకారం విమానం టేకాఫ్‌ అయిన కొన్ని సెకన్లకే కూలిపోవడానికి కారణాలపై ప్రపంచ దేశాలు ఫోకస్‌ పెట్టాయి.

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి