PM Modi: గుజరాత్‌లో మోదీ మేనియా.. ట్రయాంగిల్‌ ఫైట్‌లో వికసించిన కమలం.. బీజేపీ హవాను ఆపలేకపోయిన కాంగ్రెస్‌-ఆప్‌..

ఒకటి కాదు..రెండు కాదు..ఏకంగా ఏడుసార్లు..డబుల్‌ హ్యాట్రిక్..! అయినా మేనియా తగ్గలేదు. గత రికార్డులన్నీ తిరగరాస్తూ మరోసారి బంపర్‌ మెజార్టీ సాధించింది కమలదళం. 27 యేళ్లుగా అధికారాన్ని కొనసాగిస్తున్న బీజేపీకి మోదీనే బ్రాండ్‌ అంబాసిడర్‌గా మారారు. మోదీ వ్యతిరేక శక్తులన్నీ ఏకమైనా మోదీ మేనియా ముందు తేలిపోయారు.

PM Modi: గుజరాత్‌లో మోదీ మేనియా.. ట్రయాంగిల్‌ ఫైట్‌లో వికసించిన కమలం.. బీజేపీ హవాను ఆపలేకపోయిన కాంగ్రెస్‌-ఆప్‌..
PM Modi
Follow us
Sanjay Kasula

|

Updated on: Dec 08, 2022 | 2:17 PM

ఓట్లు, సీట్లు పెరగడంతోపాటు బీజేపీ జోరు అమాంతం పెరిగిపోయింది. ఇంతకీ గుజరాత్‌లో కాషాయంపార్టీ తిరుగులేని మెజార్టీ వెనుక అస్సలు కారణమేంటి? మోదీ-షా ద్వయం విజయ రహస్యం ఏంటి? గుజరాత్‌లో డబుల్‌ హ్యాట్రిక్‌ కొట్టి ఊపుమీదున్న బీజేపీ.. వరుసగా ఏడోసారి బంపర్‌ మెజార్టీతో విజయం సాధించింది. ఈ సారి ట్రయాంగిల్‌ ఫైట్‌ ఉన్నా, మోదీ వ్యతిరేక శక్తులన్నీ ఏకమైనా , కులాల కుంపట్లు, ప్రాంతాల వారీగా పాలిటిక్స్ నడిపినా ప్రజలు గుజరాత్ వికాస్ నినాదానికే పట్టంకట్టారు. అభివృద్ధికి అవినీతికి జరుగుతున్న యుద్ధంగా ఈ ఎన్నికలను ప్రకటించిన మోదీ తన ప్రచారంతో విశేషంగా ఆకట్టుకున్నారు. మోదీ, అమిత్‌షా ద్వయం వ్యూహాలు, రామాలయం, గుజరాత్‌ అభివృద్ధి వంటి ప్రచార అస్త్రాలు బీజేపీ విజయంలో కీలక పాత్ర పోషించాయి.

బీజేపీ విజయం వెనుక పక్కా వ్యూహం..

గుజరాత్‌లో ఈ సారి ట్రయాంగిల్‌ ఫైట్‌ జరిగింది. బీజేపీ,కాంగ్రెస్‌,ఆప్‌ మధ్య హోరాహోరి పోటీ నెలకొందని రాజకీయ విశ్లేషకులు భావించారు. ఢిల్లీ, పంజాబ్‌ను ఊడ్చేసి ఊపుమీదున్న ఆప్‌, ఈ సారి గుజరాత్‌ బరిలో దిగి గట్టి పోటీ ఇవ్వనుందనే ఊహాగానాలు వినిపించాయి. ఐతే మోదీ-షా ద్వయం మొదటి నుంచే అసెంబ్లీ ఎన్నికలపై దృష్టి సారించింది. ఏయే నియోజకవర్గాల్లో సమస్యలున్నాయో..వాటిని పరిష్కరిస్తూ ముందుకెళ్లారు. సిట్టింగ్ ఎమ్మెల్యేలపై వ్యతిరేక ఉన్నచోట గట్టి నిర్ణయం తీసుకున్నారు.

కలిసొచ్చిన ప్రధాని మోదీ రోడ్ షో..

ఏకంగా 38 మందికి పైగా సిట్టింగ్‌ ఎమ్మెల్యేలను మార్చారంటే, బీజేపీ సాహసమైన నిర్ణయమే తీసుకుంది. ఎక్కడా వ్యతిరేకత రాకుండా జాగ్రత్త పడింది. పటేల్లా మద్దతు కూడగట్టడంలో పైచేయి సాధించారు. ముందుగానే బీజేపీ ముఖ్యమంత్రి అభ్యర్థిగా భూపేంద్ర పటేల్‌ను ప్రకటించారు. ఇక మోదీ- అమిత్‌షాల ప్రచారం ఈసారి ఎన్నికల్లో భాగా కలిసొచ్చింది. అన్నీ తామై ఏ ఒక్క అవకాశాన్ని వదులుకోకుండా ప్రచారం చేశారు. ప్రధాని మోదీ రోడ్‌షో బీజేపీకి బాగా కలిసొచ్చిందని రాజకీయ విశ్లేషకులు అంచనా.

అక్కడివారికి పార్టీనే ముఖ్యం.. మోదీనే నాయకుడు..

బీజేపీకి గుజరాత్‌ కంచుకోట అయినప్పటికీ.. సౌరాష్ట్ర, కచ్‌ ప్రాంతాల్లో ఆ పార్టీకి బలం తక్కువే. పటేళ్లు, రైతుల ప్రాభవం ఎక్కువగా ఉండే ఈ ప్రాంతంలో బీజేపీ ఈసారి పుంజుకుంది. అటు పారిశ్రామిక వేత్తలు, వ్యాపారులు ఎక్కువగా ఉండే సౌత్‌ గుజరాత్‌, సెంట్రల్‌ గుజరాత్‌లో కమలం పార్టీ మెజార్టీ స్థానాలు సాధించింది. మరోవైపు గుజరాత్ వాసులు కూడా మోదీని చూసే ఇక్కడ బీజేపీని ఆదరిస్తారనే ప్రచారం ఉంది. ఇక్కడ సీఎం అభ్యర్థి వాళ్లకు ప్రధానం కాదు. అక్కడ పార్టీనే ముఖ్యం.. మోదీనే నాయకుడు. అందుకే మోదీనే ముందుండి బీజేపీకి నడిపించే ప్రయత్నం చేస్తున్నారు. తనను ఇంతటి వాణ్ణి చేసింది మీరేనని.. మీ ఆదరణ వల్లే సీఎం నుంచి పీఎంగా ఎదిగానని సెంటిమెంట్ రాజేసే ప్రయత్నం చేశారు మోదీ.

బూత్‌స్థాయి నుంచి బలోపేతం చేసిన ప్రధాని మోదీ

1995 నుంచి గుజరాత్ కోటలో పాగావేస్తున్న బీజేపీ తన అప్రతిహత జైత్రయాత్రను కొనసాగిస్తూ ఏడోసారి విజయాన్నందుకోవడం విశేషం. మొత్తం 182 అసెంబ్లీ సీట్లు ఉన్న గుజరాత్‌లో 1995లో బీజేపీ 121 స్థానాలు కైవసం చేసుకుంది. గుజరాత్‌ సీఎంగా పగ్గాలు చేపట్టిన అప్పటి సీఎం నరేంద్రమోదీ అభివృద్దిపై దృష్టి సారించారు. ఓ వైపు అన్ని ప్రాంతాల్లోని సమస్యలను పరిష్కరిస్తూ, మరోసారి పార్టీలోని కుమ్ములాటలను పటాపంచాలు చేసి బీజేపీని బూత్‌స్థాయి నుంచి బలోపేతం చేశారు మోదీ. కేవలం ఐదేళ్లలో మోదీ అంటే గుజరాత్‌, గుజరాత్‌ అంటే మోదీ అనేలా చేశారు.

పాత రికార్డులను బ్రేక్ చేసి.. 

1998లో 117 గెలిచి మరోసారి అధికారాన్ని చేపట్టింది బీజేపీ. 2002లో ఏకంగా 127 స్థానాల్లో గెలిచి హ్యాట్రిక్‌ సాధించింది. 2007లో నాలుగోసారి 117 స్థానాల్లో గెలిచింది బీజేపీ. 2012లోనూ 115 స్థానాల్లో జెండా ఎగురవేసింది బీజేపీ. ఆ తర్వాత మోదీ ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసి, ఢిల్లీకి మకాం మార్చారు. దేశంలో బీజేపీ అఖండ విజయం సాధించి, ప్రధానిగా బాధ్యతలు చేపట్టారు మోదీ. ఇక గుజరాత్‌లో బీజేపీ పనైపోయిందని అంతా భావించారు. కాంగ్రెస్‌ విజృంభించే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు అంచాన వేశారు. అయితే ఆ తర్వాత జరిగిన 2017లో 99 స్థానాల్లో విజయం సాధించింది. ఇక ప్రస్తుత ఎన్నికల్లో ఎవ్వరూ ఊహించని రీతిలో ఏకంగా అన్ని రికార్డులు బ్రేక్‌ చేస్తూ బీజేపీ దూసుకెళ్లింది. గుజరాత్‌లో 27 ఏళ్లుగా అధికారంలో ఉన్న బీజేపీ.. తాజాగా పశ్చిమబెంగాల్‌లో సీపీఎం రికార్డును సమం చేసింది.

మోదీ-అమిత్‌ షా ద్వయం ముందు..

గుజరాత్‌లో మోదీ-అమిత్‌ షా ద్వయం ముందు కాంగ్రెస్‌, ఆప్‌ తేలిపోయాయి. ఈ విజయం బీజేపీ నేతల్లో రెట్టించిన ఉత్సాహాన్నిచ్చింది. గుజరాత్‌ ఫలితాలు 2024 ఎన్నికలకు ట్రైలర్‌ మాత్రమేనన్నారు బీజేపీ ఎంపీ జీవీఎల్‌. ఈసారి 404 సీట్లే లక్ష్యంగా పని చేస్తామన్నారు. ఈ ఫలితాలతో తెలంగాణలో కేసీఆర్‌కు నిద్ర కూడా పట్టదని కామెంట్‌ చేశారు జీవీఎల్‌.

ట్రయాంగిల్ ఫైట్ నడిచినా మోదీ హవాను..

మొత్తానికి గుజరాత్‌లో ఈ టర్న్‌ ట్రయాంగిల్‌ ఫైట్‌ నడిచినా.. బీజేపీ హవాను ఆపలేకపోయింది. కాంగ్రెస్ ఓటమికి, బీజేపీ గెలుపుకు ఆప్ ఈసారి ప్రధాన కారణం కాబోతోందని విశ్లేషకులు భావించినట్లే గుజరాత్‌లో ఎన్నికల ఫలితాలు కనిపించాయి.

మరిన్ని జాతీయ వార్తల కోసం