AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Gujarat Assembly Election: గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్‌ విడుదల.. పోలింగ్, ఫలితాల తేదీలు ఇలా..

గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల తేదీని కేంద్ర ఎన్నికల సంఘం నేడు అధికారికంగా ప్రకటించింది.గుజరాత్ లో తదుపరి ఎన్నికలు రెండు దశల్లో జరగనున్నాయి. ఇందులో మొదటి దశ ఓటింగ్..

Gujarat Assembly Election: గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్‌ విడుదల.. పోలింగ్, ఫలితాల తేదీలు ఇలా..
Gujarat Assembly Election
Sanjay Kasula
|

Updated on: Nov 03, 2022 | 12:45 PM

Share

దేశంలో పలు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికల హీట్ మొదలైంది. తాజాగా బుధవారం గుజరాత్ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్‌ను ప్రకటించారు కేంద్ర ప్రధాన ఎన్నికల కమిషనర్‌ రాజీవ్‌ కుమార్‌. అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ వివరాలను ఆయన అందించారు. రెండు దశల్లో ఎన్నికలు నిర్వహించవచ్చని వార్తలు వస్తున్నాయి. దేశం మొత్తం గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలపై దృష్టి సారిస్తోంది. గత 25 ఏళ్లుగా బీజేపీ గుజరాత్‌ను పాలిస్తోంది.

అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్‌ వివరాలు:

గుజరాత్ ఎన్నికలు రెండు దశల్లో జరగనున్నాయి. డిసెంబరు 1న తొలి దశలో ఓటింగ్‌, డిసెంబర్‌ 2న రెండో దశలో పోలింగ్‌ జరగనుంది. కాగా డిసెంబర్ 8న ఓట్ల లెక్కింపు జరగనుంది. హిమాచల్ ప్రదేశ్ తర్వాత గుజరాత్ ఎన్నికల తేదీలను కూడా ఎన్నికల సంఘం నేడు ప్రకటించింది.

అసెంబ్లీ స్తానాలు, ఓటర్లు

గుజరాత్ అసెంబ్లీలోని మొత్తం 182 స్థానాలున్నాయి. గుజరాత్‌లో 142 జనరల్, 17 ఎస్సీ, 23 ఎస్టీ నియోజకవర్గాలు ఉన్నాయి. గుజరాత్‌లో 4.9 కోట్ల మంది ఓటర్లు ఓటు వేయనున్నారు.అయితే ఇందులో 2017 అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ 99 సీట్లు గెలుచుకోగా, కాంగ్రెస్‌కు 77 సీట్లు వచ్చాయి. గుజరాత్ 14వ శాసనసభ పదవీకాలం ఫిబ్రవరి 18, 2023తో ముగుస్తుంది. అంతకంటే ముందే ఎన్నికలు నిర్వహించి.. కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాల్సి ఉంది.

ఎంతమంది పురుష, స్త్రీలు, లింగమార్పిడి ఓటర్లు..

గుజరాత్ ఓటర్ల జాబితా ప్రకారం, రాష్ట్రంలో మొత్తం 4,90,89,765 మంది ఓటర్లు నమోదయ్యారు. మొత్తం ఓటర్లలో 2,53,36,610 మంది పురుషులు, 2,37,51,738 మంది మహిళా ఓటర్లు ఉన్నారు. మొత్తం 11,62,528 మంది కొత్త ఓటర్లు నమోదయ్యారు. ఇందులో 1417 మంది ట్రాన్స్‌జెండర్ ఓటర్లు ఉన్నారు.

గుజరాత్‌లో రాజకీయ పరిస్థితి..

గుజరాత్ శాసనసభలో మొత్తం 182 స్థానాలు ఉన్నాయి. మెజారిటీకి 92 సీట్లు కావాలి. గుజరాత్‌లో 2017 ఎన్నికలు రెండు దశల్లో జరిగాయి. మొదటి దశ ఓటింగ్ డిసెంబర్ 9న, రెండో దశ డిసెంబర్ 14న జరిగింది. ఆ ఎన్నికల్లో బీజేపీ మొత్తం 99 సీట్లు గెలుచుకుంది. అదే సమయంలో కాంగ్రెస్ ఖాతాలోకి 77 సీట్లు చేరాయి. ఇతర పార్టీలు, స్వతంత్రులు ఆరు స్థానాల్లో విజయం సాధించారు. గుజరాత్ ప్రభుత్వ పదవీకాలం 18 ఫిబ్రవరి 2023తో ముగుస్తుంది. ఉప ఎన్నికల అనంతరం గుజరాత్ అసెంబ్లీలో ప్రస్తుతం బీజేపీకి 111 మంది, కాంగ్రెస్‌కు 62, భారతీయ గిరిజన పార్టీకి చెందిన 2, ఎన్‌సీపీకి చెందిన ఒకరు, స్వతంత్రులు ఒకరు ఉన్నారు. ఇందులో 13 మంది మహిళలు ఉన్నారు. ఇందులో 10 మంది బీజేపీ సభ్యులు, ముగ్గురు కాంగ్రెస్ సభ్యులు ఉన్నారు.

గత ఎన్నికల లెక్కలు ఏం చెబుతున్నాయి?

2017 ఎన్నికల్లో మొత్తం 68.39 శాతం ఓటింగ్ నమోదైంది. ఆ ఎన్నికల్లో 70.49 శాతం మంది పురుషులు, 66.11 శాతం మంది మహిళలు ఓటు వేశారు. అదే సమయంలో, థర్డ్ జెండర్ ఓటర్లలో 42 శాతం మంది ఓటింగ్‌లో పాల్గొన్నారు. ఈ విధంగా మొత్తం రెండు కోట్ల 94 లక్షల 64 వేల 326 మంది ఓటర్లు ఓటు వేశారు. ఇందులో ఈవీఎంలు, పోస్ట్ బ్యాలెట్లు ఉన్న ఓటర్లు ఉన్నారు. గుజరాత్‌లో 2017 ఎన్నికల్లో మొత్తం 1828 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. వీరిలో 1702 మంది పురుషులు, 126 మంది మహిళా అభ్యర్థులు ఉన్నారు. వీరిలో 169 మంది పురుషులు, 13 మంది మహిళా అభ్యర్థులు విజయం సాధించారు. అదే సమయంలో 1350 మంది పురుషులు, 104 మంది మహిళా అభ్యర్థులు తమ డిపాజిట్లను కాపాడుకోలేకపోయారు.

ఇద్దరి మధ్య కాదు ఇప్పుడు మరో పార్టీ..

అక్కడ ఎప్పుడు ఎన్నికలు జరిగినా ప్రధాని పోటీ బీజేపీ, కాంగ్రెస్ మధ్యే ఉండేది. కానీ ఈసారి ఆప్ ఎంట్రీ ఇచ్చింది. మేం కూడా పోటీల్లో ఉన్నామంటూ ప్రచారంలో దూసుకెళ్తోంది. ఈ నేపథ్యంలో ఈసారి బీజేపీ, కాంగ్రెస్, ఆమాద్మీ మధ్య ముక్కోణపు పోటీ జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి.

మరిన్ని జాతీయ వార్తల కోసం