Arvind Kejriwal vs Pramod Sawant: గోవా అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ అధికార బీజేపీ, ప్రతిపక్ష నేతల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. అక్కడ బీజేపీకి గట్టి పోటీ ఇచ్చేందుకు కాంగ్రెస్ పార్టీతో పాటు తృణాముల్ కాంగ్రెస్(TMC), ఆమ్ ఆద్మీ పార్టీ(AAP) కూడా సన్నద్ధమవుతున్నాయి. దీంతో వచ్చే ఏడాది అక్కడ జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో చతుర్ముఖ పోటీ ఖాయంగా తెలుస్తోంది. అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన వ్యూహ, ప్రతివ్యూహాల్లో ఆ పార్టీల అగ్రనేతలు తలమునకలయ్యారు. గోవాలో పర్యటించిన ఆప్ చీఫ్, ఢిల్లీ సీఎం అర్వింద్ కేజ్రీవాల్.. అక్కడ తాము అధికారంలోకి వస్తే ఉచిత తీర్థయాత్రలు కల్పిస్తామని సోమవారంనాడు ప్రకటించడం తెలిసిందే. అయోధ్యలో రామాలయ దర్శనం, రాజస్థాన్‌లోని ఆజ్మీర్ షరీఫ్, తమిళనాడులోని వేలాంకన్నికి తీర్థయాత్రకు వెళ్లాలనుకునే గోవా ప్రజలకు ఉచిత తీర్థయాత్ర పథకాన్ని అమలు చేయనున్నట్లు ఆయన తెలిపారు. ఈ పథకం ద్వారా తీర్థయాత్రలకు వెళ్లాలనుకునే గోవాలోని పేద హింధువులు, ముస్లీంలు, క్రైస్తవులకు లబ్ధి చేకూరుతుందని వివరించారు.
దీనిపై స్పందించిన గోవా సీఎం ప్రమోద్ సావంత్.. అర్వింద్ కేజ్రీవాల్ కాపీ మాస్టర్‌గా ఎద్దేవా చేశారు. తమ ప్రభుత్వ పథకాలను కేజ్రీవాల్ కాపీకొడుతున్నారని ఆయన ఆరోపించారు. తీర్థయాత్రలకు ప్రభుత్వ సాయం అందించే పథకాన్ని తమ ప్రభుత్వం ఇప్పటికే తీసుకురాగా.. ఇది తమ పార్టీదిగా కేజ్రీవాల్ ప్రకటించుకోవడం విడ్డూరమన్నారు.
తీర్థయాత్రలకు ఆర్థిక సాయం పథకాన్ని బడ్జెట్‌లో ప్రకటించామని.. నోటిఫై కూడా చేసినట్లు సావంత్ గుర్తుచేశారు. దీనికి సంబంధించిన రిజిస్ట్రేషన్లు కూడా ప్రారంభించినట్లు తెలిపారు. అయితే కేజ్రీవాల్ ఈ పథకాన్ని కాపీ కొట్టి తమ పార్టీదిగా ప్రకటించుకున్నారని అన్నారు. ఇలా ఇతరుల పథకాలని కాపీ కొట్టే అలవాటు కేజ్రీవాల్‌కు ఎక్కువే ఉందని.. అందుకే ఆయన కాపీ మాస్టర్ అంటూ ఎద్దేవా చేశారు.
గోవా అసెంబ్లీ ఎన్నికలపై ఫుల్ ఫోకస్ పెట్టిన అర్వింద్ కేజ్రీవాల్.. గత నాలుగు మాసాల్లో మూడుసార్లు అక్కడ పర్యటించారు. జులైలో అక్కడ పర్యటించిన కేజ్రీవాల్..తాము అధికారంలోకి వస్తే 300 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ ఇవ్వనున్నట్లు ప్రకటించారు. అలాగే ప్రైవేటు రంగంలో సహా అన్ని ఉద్యోగాల్లో 80 శాతం గోవా స్థానికులకు దక్కేలా చూస్తామని ప్రకటించారు. అలాగే టూరిజం, మైనింగ్ రంగాలు గాడిలో పడే వరకు ఈ రంగంతో జీవనోపాధి పొందుతున్న కుటుంబాలకు ప్రతి నెలా రూ.5000ల రెమ్యునరేషన్ అందజేయనున్నట్లు ఆయన ప్రకటించారు. ఇదిలా ఉండగా గోవాకు చెందిన పలువురు ప్రముఖ నేతలు ఆమ్ ఆద్మీ పార్టీలో చేరనున్నట్లు తెలుస్తోంది. ఆ మేరకు పలు పార్టీల నేతలతో ఆప్ నేతలు చర్చలు జరుపుతున్నట్లు సమాచారం.
ఉత్తరప్రదేశ్, పంజాబ్, ఉత్తరాఖండ్, మణిపూర్‌తో పాటు గోవా అసెంబ్లీకి వచ్చే ఏడాది ఎన్నికలు జరగనున్నాయి.
Also Read..
Yadadri Temple: డ్రోన్ కెమెరాల్లో యాదాద్రి ఆలయం.. కట్టిపడేస్తున్న సుందర దృశ్యాలు..
Trisha: అరుదైన రికార్డు సృష్టించిన త్రిష.. ట్విట్టర్లలో శుభాకాంక్షల వెల్లువ.. అసలు మ్యాటరేంటంటే..