Petrol Rate: పెట్రోల్, డీజిల్ ధరల తగ్గింపులో కేంద్రం బాటలో రాష్ట్రాలు.. వ్యాట్ తగ్గిస్తే ప్రజలకు మరింత ఊరట!

పన్నులు తగ్గించాలని ప్రజల డిమాండ్‌కు కేంద్ర ప్రభుత్వం తలొగ్గింది. ఇంతకాలం పెరుగుతూ వచ్చిన పెట్రోలియం ఉత్పత్తుల ధరలు భారీగా దిగివచ్చాయి. పెట్రో ధరల నుంచి దేశ ప్రజలకు కాస్త ఊరట లభించింది.

Petrol Rate: పెట్రోల్, డీజిల్ ధరల తగ్గింపులో కేంద్రం బాటలో రాష్ట్రాలు.. వ్యాట్ తగ్గిస్తే ప్రజలకు మరింత ఊరట!
Petrol Rate
Follow us
Balaraju Goud

|

Updated on: Nov 04, 2021 | 7:28 AM

Fuel Rates in India: పన్నులు తగ్గించాలని ప్రజల డిమాండ్‌కు కేంద్ర ప్రభుత్వం తలొగ్గింది. ఇంతకాలం పెరుగుతూ వచ్చిన పెట్రోలియం ఉత్పత్తుల ధరలు భారీగా దిగివచ్చాయి. పెట్రో ధరల నుంచి దేశ ప్రజలకు కాస్త ఊరట లభించింది. ఈ దీపావళి నిజంగానే సామాన్యుడికి కాంతులు తీసుకువచ్చినట్లైంది. కేంద్ర ప్రభుత్వం పండుగ కానుకగా పెట్రోల్‌, డీజిల్‌ పై ధరలను తగ్గించింది. పెట్రోల్‌, డీజిల్‌పై ఎక్సైజ్‌ డ్యూటీ తగ్గించడంతో లీటర్‌ పెట్రోల్‌పై 5 రూపాయలు, లీటరు డీజిల్‌పై 10 రూపాయల ధరలు తగ్గనున్నాయి. రాష్ట్రాలు వ్యాట్‌ కూడా తగ్గించాలని, దీని వల్ల పెట్రో ధరలు మరింత తగ్గే అవకాశం ఉంటుందని కేంద్రం సూచించింది.

గత కొన్ని రోజులుగా వరుసగా పెట్రో ధరలు పెరగడంతో ప్రతిపక్షాలు ఆందోళన వ్యక్తం చేశాయి. పెట్రోల్‌, డీజిల్‌ ధరల పెరుగుదల వల్ల సామాన్యులపై తీవ్ర భారం పడుతోందని ఆందోళన వ్యక్తం చేశాయి. అటు వాహనదారులు కూడా నిరసన వ్యక్తం చేశారు. వెంటనే పెట్రో ధరలను తగ్గించాలని డిమాండ్‌ చేశారు. రోజుకు 30 పైసలకు పైగా ధర పెరగడంతో ప్రస్తుతం హైదరాబాద్‌లో పెట్రోల్‌ ధర 114, డీజిల్‌ ధర 107 రూపాయలకు చేరింది. ప్రతిరోజు పెట్రో ధరలు పెరుగుతూ ఉండటంతో సామాన్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాగైతే బతికేదెలా అంటూ ప్రశ్నించారు. అటు సరకులు, వస్తువులు సరఫరా చేసే వాహనదారుల పరిస్థితి కూడా దారుణంగా తయారు కావడంతో కేంద్రం ఎక్సైజ్‌ సుంకాన్ని తగ్గించక తప్పని పరిస్థితి వచ్చింది.

ఇటీవల వివిధ రాష్ట్రాల్లో జరిగిన ఉప ఎన్నికల్లో బీజేపీకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. దీంతో పెట్రో ధరల పెరుగుదల కూడా ఓటమికి కారణమని బీజేపీ అధిష్టానం భావించింది. దీంతో కేంద్ర ప్రభుత్వం ఎక్సైజ్‌ డ్యూటీని భారీగా తగ్గించింది. ఎక్సైజ్‌ డ్యూటీని తగ్గించడంతో పెట్రోల్‌పై 5, డీజిల్‌పై పది రూపాయల ధర తగ్గనుంది. తగ్గిన ధరలు రేపటి నుంచి అమల్లోకి వస్తాయి. అయితే రాష్ట్రాలు కూడా వ్యాట్‌ తగ్గించాలని, దీనివల్ల పెట్రో ధరలు మరింత తగ్గుతాయని కేంద్రం సూచించింది. అయితే, లాక్‌డౌన్‌ సమయంలో కూడా ఆర్థిక వ్యవస్థ చురుగ్గా కదలడానికి కారణమైన భారతీయ రైతులకు.. రానున్న రబీసీజన్‌ నేపథ్యంలో తీసుకున్న ఈ నిర్ణయం ఉత్సాహాన్నిస్తుందని ఆ ప్రకటనలో పేర్కొంది. కేంద్రం తాజా నిర్ణయంతో పెట్రోల్‌పై ఎక్సైజ్‌ డ్యూటీ రూ.27.90కి, డీజిల్‌పై రూ.21.80కి తగ్గింది. ఈ నిర్ణయంతో.. ఇంధనాల మీద ఎక్సైజ్‌ ఆదాయం నెలకు సగటున రూ.8700 కోట్ల చొప్పున ఏడాదికి దాదాపు రూ.లక్ష కోట్ల దాకా తగ్గుతుందని అంచనా. నవంబరు నుంచి వచ్చే మార్చి 31 దాకా లెక్కిస్తే.. ఈ ఆర్థిక సంవత్సరంలో రూ.43,500 కోట్ల మేర ఆదాయం తగ్గుతుందని అంచనా. తగ్గిన రేట్ల ప్రకారం హైదరాబాద్‌లో లీటర్‌ పెట్రోలు ధర రూ.109.47కుతగ్గింది. ఇక.. ఇప్పటికే సెంచరీ దాటేసిన డీజిల్‌ మళ్లీ రూ.100 దిగువకు వచ్చింది. లీటర్‌ డీజిల్‌ రూ.107.37 నుంచి రూ.97.37కు చేరింది.ఈ మేరకు రాష్ట్ర వ్యాట్‌ కూడా తగ్గుతుంది కాబట్టి బంకుల్లో ధర ఇంకా తక్కువగా ఉండనుంది.

పెట్రోలు, డీజిల్ పైన ఎక్సైజ్ సుంకాన్ని తగ్గిస్తూ నిర్ణయం తీసుకున్నందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి బీజేపీ తెలంగాణ శాఖ తరపున ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ ధన్యవాదాలు తెలిపారు.ఈ నిర్ణయం ద్వారా కేంద్రానికి రూ.లక్ష కోట్ల వరకు ఆదాయం తగ్గుతోంది. అయినప్పటికీ ప్రజలపై పడిన భారాన్ని తగ్గించాలనే ఉద్దేశంతో కేంద్రం ఈ సాహసోపేత నిర్ణయం తీసుకోవడం అభినందనీయమన్నారు. కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని స్పూర్తిగా తీసుకుని తెలంగాణ ప్రభుత్వం కూడా పెట్రోలుపైన 10 శాతం, డీజిల్ పై 10 శాతం వ్యాట్ తగ్గించాలని బీజేపీ తెలంగాణ శాఖ డిమాండ్ చేస్తోంది. కరోనా కష్టకాలంలో దేశ ఆర్దిక పరిస్థితిని చక్కపెట్టడంలో మోడీ ప్రభుత్వం విజయం సాధించిన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు బండి సంజయ్ తెలిపారు.

ఇదిలావుంటే, గత ఏడాది కొవిడ్‌ సమయంలో అంతర్జాతీయ మార్కెట్‌లో ముడిచమురు ధర బ్యారెల్‌ 20 డాలర్ల దిగువకు పడిపోయినప్పుడు, ఆ ప్రయోజనాన్ని ప్రజలకు అందకుండా చేసి.. రెండుసార్లు ఎక్సైజ్‌ సుంకాన్ని కేంద్రం భారీగా పెంచేసిన సంగతి తెలిసిందే. గత ఏడాది పెట్రోలుపై లీటరుకు రూ.13, డీజిల్‌పై లీటరుకు రూ.16 మేర ఎక్సైజ్‌ డ్యూటీని పెంచిన కేంద్రం.. ఆ తర్వాత చమురు ధరలు పెరిగినప్పుడల్లా ఇక్కడా ధరలు పెంచుతూ వస్తోందే తప్ప ఎక్సైజ్‌ సుంకాన్ని తగ్గించలేదని ప్రతిపక్ష పార్టీలు ఆరోపించాయి. పైగా రాష్ట్రాలే పన్నులు తగ్గించాలని బీజేపీ నేతలు ఎదురుదాడికి దిగారు. పెట్రో ధరల పెరుగుదల ప్రభావం సరుకు రవాణాపై పడి నిత్యావసరాల ధరలు పెరగడం.. తాజా ఉపఎన్నికల్లో ప్రజాగ్రహం ఓట్ల రూపంలో పెల్లుబుకడంతో కేంద్రం దిద్దుబాటు చర్యలకు దిగింది. అందులో భాగంగానే ఎక్సైజ్‌ సుంకాన్ని తగ్గించిందని నిపుణులు విశ్లేషిస్తున్నారు.

మరోవైపు, పెట్రోల్‌, డీజిల్‌పై కేంద్రం ఎక్సైజ్‌ డ్యూటీని తగ్గించిన నేపథ్యంలో.. బీజేపీ పాలిత రాష్ట్రాలూ వ్యూహాత్మకంగా పన్ను తగ్గింపు ప్రకటిస్తున్నాయి. తమ రాష్ట్రంలో పెట్రోల్‌, డీజిల్‌పై రూ.7 మేర విలువ ఆధారిత పన్నును తగ్గిస్తున్నట్టు అసోం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ, త్రిపుర ముఖ్యమంత్రి బిప్లబ్‌ కుమార్‌ దేబ్‌, కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజ్‌ బొమ్మై, గోవా ముఖ్యమంత్రి ప్రమోద్‌ సావంత్‌ ప్రకటించారు. ‘‘కేంద్ర, రాష్ట్రాల పన్ను తగ్గింపుతో ఇవాళ్టి నుంచీ (గురువారం) పెట్రోల్‌ ధర రూ.12 మేర, డీజిల్‌ ధర రూ.17 మేర తగ్గబోతోంది’’ అని బిప్లబ్‌ కుమార్‌ దేబ్‌ పేర్కొన్నారు.

అటు బీహార్‌లోని జేడీయూ-బీజేపీ సర్కారు కూడా పెట్రోలుపై లీటరుకు రూ.1.30 మేర, డీజిల్‌పై రూ.190 మేర వ్యాట్‌ను తగ్గిస్తున్నట్టు ప్రకటించింది. అటు ఉత్తరాఖండ్‌లో పెట్రోల్‌పై వ్యాట్‌ను లీటరుకు రూ.2 మేర తగ్గించనున్నట్టు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి పుష్కర్‌ సింగ్‌ ధామి ప్రకటించారు. డీజిల్‌ సంగతి మాత్రం ఆయన చెప్పలేదు. ఇక.. తాము కూడా త్వరలోనే పెట్రోల్‌, డీజిల్‌పై వ్యాట్‌ను తగ్గిస్తామని హిమాచల్‌ ప్రదేశ్‌ ముఖ్యమంత్రి జైరామ్‌ ఠాకూర్‌ ఒక ప్రకటనలో తెలిపారు. తెలుగు రాష్ట్రాలతో పాటు, ఇతర రాష్ట్రాలు కూడా.. ఇదే కోవలో వ్యాట్‌, ఇతర సుంకాల భారాన్ని తగ్గిస్తే ప్రజలకు మరింత ఉపశమనం లభిస్తుంది. కాగా, కేంద్రం తీసుకున్న నిర్ణయాన్ని గౌరవించి రాష్ట్రాలు కూడా విలువ ఆధారిత పన్నులను తగ్గించాలని కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరి కోరారు.

పెట్రోల్‌, డీజిల్‌పై ఎక్సైజ్‌ డ్యూటీని తగ్గిస్తూ కేంద్రం తీసుకున్న నిర్ణయాన్ని బీజేపీ నేతలు ప్రశంసించగా.. విపక్షాల నేతలు ఎదురుదాడికి దిగుతున్నారు. ఇది ప్రజలకు ప్రధాని మోదీ ఇచ్చిన దీపావళి కానుక అని బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా కొనియాడారు. ఈ నిర్ణయంతో ఇంధనాల వినియోగం పెరిగి ద్రవ్యోల్బణం తగ్గుతుందని ఆయన పేర్కొన్నారు.

ఇక.. కాంగ్రెస్‌ పార్టీ కేంద్రం నిర్ణయంపై వ్యంగ్యబాణాలు విసిరింది. ‘‘పన్ను పరాన్నబుక్కులాంటి మోడీ సర్కారుకు నిజాల అద్దాన్ని చూపిన ప్రజలకు హ్యాట్సాఫ్‌. ఇక్కడొక విషయం గుర్తు పెట్టుకోవాలి. 2014 మే నెలలో ముడిచమురు బ్యారెల్‌ ధర 105.71 డాలర్లు. అప్పుడు పెట్రోల్‌ ధర రూ.71.41, డీజిల్‌ ధర లీటర్‌ రూ.55.49. ఇప్పుడు ముడిచమురు ధర బ్యారెల్‌కు 82 డాలర్లే’’ అని కాంగ్రెస్‌ అధికార ప్రతినిధి రణ్‌దీప్‌ సూర్జేవాలా వ్యాఖ్యానించారు. కాంగ్రెస్‌ ప్రభుత్వంలో పెట్రోల్‌పై ఎక్సైజ్‌ డ్యూటీ రూ.9.48, డీజిల్‌పై రూ.3.56 ఉండేదని గుర్తుచేశారు. ‘‘మోదీనామిక్స్‌ జుమ్లాలను చూడండి. 2021లో పెట్రోల్‌, డీజిల్‌ ధరలను లీటరుకు రూ.28, రూ.26 మేర పెంచారు. ఉపఎన్నికల్లో ఓడిపోవడంతో ఎక్సైజ్‌ డ్యూటీని రూ.5, రూ.10 మేర తగ్గించి.. దీపావళి కానుక అంటూ టాంటాం చేస్తున్నారు’’ అని రణ్‌దీప్‌ సూర్జేవాలా ఎద్దేవా చేశారు. ఇక.. ఎక్సైజ్‌డ్యూటీ తగ్గింపుపై కేరళ ఆర్థిక మంత్రి కేఎన్‌ బాలగోపాల్‌ పెదవి విరిచారు. పరువు కాపాడుకోవడానికి కేంద్రం తీసుకున్న తాత్కాలిక చర్యగా దీన్ని ఆయన అభివర్ణించారు.

Read Also… Anupampkher: బిక్షాటన చేస్తూ అనర్గళంగా ఇంగ్లిష్‌లో మాట్లాడి అనుపమ్ ఖేర్‌ను ఇంప్రెస్ చేసిన బాలిక.. చదివిస్తానంటున్న నటుడు