GENERAL ELECTIONS: మూడేళ్ళ ముందుగానే జాతీయ ప్రత్నామ్నాయంపై నజర్.. దీదీ వైపే అందరి చూపు

దేశంలో సార్వత్రిక ఎన్నికలు జరిగి రెండేళ్ళయింది. మరో మూడేళ్ళలో మరోసారి సార్వత్రిక ఎన్నికలొస్తాయి. గత ఎన్నికల తర్వాత ఆరేడు నెలలు గడిచాయో లేదో.. దేశంలో

GENERAL ELECTIONS: మూడేళ్ళ ముందుగానే జాతీయ ప్రత్నామ్నాయంపై నజర్.. దీదీ వైపే అందరి చూపు
Mamata Banerjee
Rajesh Sharma

|

Jun 16, 2021 | 3:47 PM

GENERAL ELECTIONS PARTIES EYEING MAMATA BANERJEE: దేశంలో సార్వత్రిక ఎన్నికలు జరిగి రెండేళ్ళయింది. మరో మూడేళ్ళలో మరోసారి సార్వత్రిక ఎన్నికలొస్తాయి. గత ఎన్నికల తర్వాత ఆరేడు నెలలు గడిచాయో లేదో.. దేశంలో కరోనా విజృంభణ మొదలైంది. ఏడాదిన్నరగా దేశంలో కరోనా ప్రభావం కొనసాగుతోంది. ఇదంతా ఓ వైపు వుండగానే.. మరోవైపు జాతీయ స్థాయిలో రాజకీయ సమీకరణల్లో మార్పులు మొదలైన సంకేతాలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా దేశంలో తిరుగులేని నేతగా ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ కొనసాగుతున్నారు. ఆయనపై అవినీతి మచ్చల్లాంటివేమీ లేవు. అలాంటి పరిస్థితిలో ఆయనకు ధీటుగా మరో నేతను మార్చుకుని.. ఆ నేత మొహంతో మోదీకి ప్రత్యామ్నాయంగా వచ్చే ఎన్నికలకు వెళ్ళాల్సిన పరిస్థితి విపక్షాలది. అయితే.. ప్రధాని పదవికి రాహుల్ గాంధీని కాకుండా మరో వ్యక్తిని అంగీకరించలేని కాంగ్రెస్ అధినాయకత్వం.. మరో నేతను నరేంద్రమోదీకి ధీటుగా ప్రచారం చేయలేని సంకట స్థితిలో వుంది. ఈ క్రమంలో బీజేపీయేతర, కాంగ్రెసేతర పార్టీలు ఓ కూటమిగా మారి.. బలమైన నేతను వచ్చే సార్వత్రిక ఎన్నికల నాటికి ప్రతిపాదించే దిశగా పావులు కదుపుతున్న సంకేతాలు కనిపిస్తున్నాయి.

నిజానికి మొన్నటి బెంగాల్ ఎన్నికల దాకా దేశంలో నరేంద్ర మోదీయే తిరుగులేని నాయకుడు. ప్రజాదరణలో అయినా.. ప్రభుత్వాధినేతగా అయినా నరేంద్ర మోదీని ఢీకొట్టే స్థాయి నేత ఏ పార్టీలోను కనిపించలేదు. కానీ బెంగాల్ ఎన్నికల తర్వాత పరిస్థితిలో మార్పు కనిపిస్తోంది. దానికి తోడు కరోనా నియంత్రణలోను, కరోనా విలయాన్ని అరికట్టడంలోను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ విఫలమయ్యారన్న అభిప్రాయం చాలా ప్రాంతాల్లో వినిపిస్తున్నది. బెంగాల్ ఎన్నికల్లో బీజేపీ ఎంత కలియ దిరిగినా.. ఎన్ని వ్యూహాలు పన్నినా కూడా మమతా బెనర్జీని మూడోసారి అధికారంలోకి రాకుండా అడ్డుకోలేకపోవడం వల్ల మోదీ చరిస్మా తగ్గుతున్న సంకేతాలు కనిపిస్తున్నాయి. దానికి తోడు దేశంలో నిరవధికంగా పెరుగుతున్న పెట్రోల్, డీజిల్ ధరలు సామాన్యుల్లో అసహనాన్ని పెంచుతున్నాయి. దీనిని కూడా క్యాష్ చేసుకునేందుకు విపక్ష పార్టీలు సమాయత్తమవుతున్నాయి. అయితే.. అంశాల సంగతెలా వున్నా.. మోదీకి ధీటుగా అదే స్థాయి బలమైన నేతను సార్వత్రిక ఎన్నికల్లో ప్రొజెక్టు చేయలేకపోతే.. బీజేపీ ఓడించడం అంత సులువు కాదని పలు పార్టీల భావిస్తున్నాయి. వీటిలో ఎక్కువగా ప్రాంతీయ పార్టీలే వుండడం విశేషం.

మోదీని ఢీకొట్టే స్థాయికి కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఇప్పట్లో ఎదిగే పరిస్థితి కనిపించడం లేదన్న అభిప్రాయం చాలా ప్రాంతీయ పార్టీల్లో వుంది. కాంగ్రెస్ పార్టీలో సమూల ప్రక్షాళన జరగాలని కోరుకుంటున్న కపిల్ సిబల్ లాంటి కాంగ్రెస్ సీనియర్ల అభిప్రాయాలకు అధినాయకత్వం పెద్దగా స్పందించడం లేదు. అది బీజేపీకి అందివచ్చే అవకాశంగా మారకూడదని పలు ప్రాంతీయ పార్టీలు భావిస్తున్నాయి. అందుకే 2024 సార్వత్రిక ఎన్నికల్లో మోదీని నిలువరించే నేత కోసం పలు ప్రాంతీయ పార్టీలు చూస్తున్నాయి. బెంగాల్ ఎన్నికల్లో ఒంటికాలుతో గెలిచిన మమతా బెనర్జీ… రెండు కాళ్ళతో హస్తినకు వస్తానని అప్పట్లోనే ప్రకటించారు. బెంగాల్‌ మోదీ చరిస్మాను అడ్డుకుని మరీ విజయం సాధించిన దీదీ అయితేనే జాతీయ స్థాయిలో మోదీకి ప్రత్నామ్నాయంగా చూపించ వచ్చని పలు ప్రాంతీయ పార్టీలు తాజాగా భావిస్తున్నట్లు రాజకీయ పరిశీలకులు అంఛనా వేస్తున్నారు. మరోవైపు జాతీయ స్థాయిలో మోదీకి వ్యతిరేకంగా విపక్షాల ఉమ్మడి అభ్యర్థిని ఎంపిక చేసే వ్యూహరచనలో రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ కూడా బిజీగా వున్నట్లు తెలుస్తోంది. ప్రశాంత్ కిశోర్ సూచన మేరకే తృణమూల్ కాంగ్రెస్ పార్టీలో తనకు ప్రత్యామ్నాయంగా తన అల్లుడు అభిషేక్ బెనర్జీని దీదీ సిద్దం చేస్తున్నారు. అందులో భాగంగానే ఆయనకు పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి పదవి కట్టబెట్టారు. విపక్షాల ఉమ్మడి ప్రధాని అభ్యర్థిగా తనను ప్రొజెక్టు చేసే క్రమంలో రాష్ట్ర బాధ్యతలను తన అల్లుడికి అప్పగించేందుకు మమతా సిద్దమవుతున్నారు.

టీఎంసీని జాతీయ పార్టీగా మార్చేందుకు ఇదే సరైన సమయమని మమతాబెనర్జీ భావిస్తున్నారు. ఆ మేరకు ప్రశాంత్ కిశోర్ మార్గదర్శకత్వంలో ముందుకెళుతున్నారు. మరోవైపు శరద్ పవార్, మాయావతి, నవీన్ పట్నాయక్, కేసీఆర్, వైఎస్ జగన్ వంటి ప్రాంతీయపార్టీల నేతలు కూడా దీదీ నాయకత్వాన్ని బలపర్చవచ్చన్న విశ్లేషణలున్నాయి. దానికి తోడు వయస్సు దృష్ట్యా కూడా మమతా బెనర్జీకి వచ్చే సార్వత్రిక ఎన్నికలే కీలకం. దీదీకిపుడు 66 ఏళ్ళు. 2024 నాటికి ఆమెకు 29 ఏళ్ళు వస్తాయి. ఆ తర్వాత ఎన్నికల వరకు ఎదురు చూడడం కంటే.. వచ్చే సార్వత్రిక ఎన్నికల్లోనే హస్తిన పీఠంపై తనకున్న కలను నెరవేర్చుకునేందుకు దీదీ ప్రయత్నించే పరిస్థితి కనిపిస్తోంది.

ఇక దేశంలో ప్రస్తుతం వున్న రాజకీయ పరిస్థితుల దృష్ట్యా మోదీకి ధీటైన నాయకురాలిగా మారేందుకు, ఎదిగేందుకు మమతా బెనర్జీకి ఇదే సరైన సమయం. ఈ విషయం అర్థం చేసుకున్న మమతా బెనర్జీ తాను జాతీయ స్థాయికి వెళ్ళినా బెంగాల్లో టీఎంసీకి ఎదురు లేకుండా చూసుకునే పని అప్పుడే ప్రారంభించారు. అసెంబ్లీ ఎన్నికలకు ముందు టీఎంసీని వీడి బీజేపీతో జతకట్టి.. ఆ పార్టీ బలోపేతం అయ్యిందని చెప్పిన పలువురు నేతలను ఘర్ వాపసీ పేరిట తిరిగి టీఎంసీలోకి చేర్చుకునేందుకు మమతా బెనర్జీ వ్యూహాత్మకంగా ముందుకు వెళుతున్నారు. తద్వారా వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో బెంగాల్‌లో బీజేపీని దెబ్బకొట్టి అత్యధిక స్థానాలను గెలుచుకునేలా వ్యూహరచన చేస్తున్నారు. ఇంట గెలిచి రచ్చ గెలవాలన్నది దీదీ అభిమతంగా కనిపిస్తోంది. తాము తలపెట్టిన ఈ సంకల్పంలో ఒకవేళ ఒకటి, అరా సీట్లు తగ్గినా బీజేపీని నిలువరించేందుకు కాంగ్రెస్ పార్టీ తమతో కలిసి రాక తప్పదని విపక్ష నేతలు అంఛనా వేస్తున్నట్లు కనిపిస్తోంది.

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

Follow us on

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu