Pingali Venkayya Birth Anniversary: జాతికే కేతనం ఇచ్చిన పింగళి జయంతి నేడు.. జాతీయ పతాక రూపకర్త గురించి ఆసక్తికర విషయాలు

స్వాతంత్య్రం పోరాట సమయంలో కాంగ్రెస్‌ సమావేశాల్లో బ్రిటీష్‌ జెండాను ఎగరవేస్తుండటం వెంకయ్య జీర్ణించుకోలేకపోయారు. 1906లో కలకత్తాలో జరిగిన అఖిల భారత కాంగ్రెస్‌ పార్టీ సమావేశంలో వెంకయ్యలో దేశం కోసం జెండా తయారు చేయాలనే తపనను రగిలించింది.

Pingali Venkayya Birth Anniversary: జాతికే కేతనం ఇచ్చిన పింగళి జయంతి నేడు.. జాతీయ పతాక రూపకర్త గురించి ఆసక్తికర విషయాలు
Pingali Venkayya
Follow us
Surya Kala

|

Updated on: Aug 02, 2022 | 6:14 PM

Pingali Venkayya Birth Anniversary:  భారతీయుల కోసం ప్రత్యేకంగా ఒక జెండా ఉండాలని భావించి దానికి రూపకల్పన చేసిన వ్యక్తి మన తెలుగువాడు పింగళి వెంకయ్య. ఆయన రూపొందించిన పతాకానికి కొన్ని మార్పులు, చేర్పులతో ప్రస్తుతం చూస్తున్న జాతీయ జెండా రెపరెపలాడుతోంది. భారతదేశ స్వాతంత్య్ర సంగ్రామంలో పింగళి వెంకయ్య చేసిన కృషిని ప్రధాని నరేంద్ర మోదీ మన్‌ కీ బాత్‌లో ప్రశంసించారు కూడా.

కృష్ణా జిల్లా మచిలీపట్నం సమీపంలోని భట్లపెనుమర్రు గ్రామంలో 146 ఏళ్ల క్రితం ఇదే రోజున జన్మించారు బహుముఖ ప్రజ్ఞాశాలి పింగళి వెంకయ్య. దేశానికి స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్లు అవుతున్న ఈ శుభసందర్భంలో అనేక మంది ప్రముఖులు పింగళి వెంకయ్య పుట్టిన భట్లపెనుమర్రు గ్రామాన్ని సందర్శిస్తున్నారు. ఇటీవల జరిగిన ఒక కార్యక్రమంలో కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి – వెంకయ్య మనవరాలు సుశీలను సన్మానించి ఆ పోరాట యోధుడిని స్మరించుకున్నారు. సైనిక దళాలను చూసి ఆకర్షితుడైన వెంకయ్య 19వ ఏటనే బ్రిటీష్‌ ఇండియా సైన్యంలో చేరారు. దక్షిణాఫ్రికాలో జరిగిన బోర్‌ యుద్ధంలో పాల్గొన్నారు. బ్రిటీష్‌ సైన్యం అక్కడ యూనియన్‌ జాక్‌ ఎగరేస్తున్న తీరు ఆయనలో జాతీయవాద స్ఫూర్తి రగిలింది. అక్కడే ఆయన గాంధీజీని కలిశారు.

స్వాతంత్య్రం పోరాట సమయంలో కాంగ్రెస్‌ సమావేశాల్లో బ్రిటీష్‌ జెండాను ఎగరవేస్తుండటం వెంకయ్య జీర్ణించుకోలేకపోయారు. 1906లో కలకత్తాలో జరిగిన అఖిల భారత కాంగ్రెస్‌ పార్టీ సమావేశంలో వెంకయ్యలో దేశం కోసం జెండా తయారు చేయాలనే తపనను రగిలించింది. జాతీయ పతాకానికి సంబంధించి అనేక మోడల్స్ డిజైన్ చేశారు వెంకయ్య. 1921 మార్చి 31న బెజవాడలో జరిగిన ఇండియన్‌ నేషనల్‌ కాంగ్రెస్‌ సమావేశంలో వెంకయ్య డిజైన్‌ చేసిన పతాకానికి మహాత్మా గాంధీ ఆమోదం తెలిపారు. గాంధీకి వెంకయ్య సమర్పించిన మోడల్‌లో రెండు రంగులు అంటే ఆకుపచ్చ, ఎరుపుతో పాటు మధ్యలో చర్కా ఉన్నాయి. ఎరుపు, ఆకుపచ్చ రంగులు హిందు, ముస్లింలకు ప్రతీకలు. మిగిలిన సామాజిక వర్గాలకు కూడా ప్రాతినిధ్యం కల్పించాలని గాంధీజీ సూచించడంతో ఆ పతాకానికి వెంకయ్య తెలుపు రంగును పై భాగంలో చేర్చారు. దీంతో అది త్రివర్ణ పతాకంగా మారింది. జెండా తయారీ కోసం వెంకయ్య ఎంతో కష్టపడ్డారు. భారతదేశానికి ఒక జాతీయ జెండా అనే పుస్తకాన్ని ఆయన 1906లోనే ప్రచురించారు.

ఇవి కూడా చదవండి

వెంకయ్య రూపొందించిన జెండాను 1921 నుంచి అన్ని కాంగ్రెస్‌ సమావేశాల్లో మామూలుగానే ఎగరవేసేవారు. కాని 1931లో జరిగిన సెషన్‌లో దీనిని కాంగ్రెస్‌ పార్టీ జాతీయ జెండాగా స్వీకరించింది. గాంధీ చేపట్టిన అహింసా ఉద్యమానికి త్రివర్ణ పతాకం స్ఫూర్తిగా నిలిచింది. నాటి సదస్సుల్లో ఎరుపు రంగు స్థానంలో కాషాయాన్ని చేర్చారు. అంతే కాదు పతాక పైభాగంలో కాషాయం, మధ్యలో తెలుపు, దిగువన ఆకుపచ్చ రంగు ఉండేలా మార్చారు. నాడు స్వీకరించిన పతాకం మధ్య భాగంలో చర్కాకు స్థానం కల్పించారు. 1947 జూలై 22 న జరిగిన రాజ్యాంగ సభ ఈ త్రివర్ణ పతాకాన్ని జాతీయ జెండాగా స్వీకరించింది. అయితే గాంధీ చర్కా స్థానంలో అశోక చక్రాన్ని చేర్చింది. జాతీయ జెండాను వెంకయ్య రూపొందించిన జెండాకు ఆమోదం తెలిపిన నాటి ప్యానెల్‌లో హైదరాబాద్‌కు చెందిన స్వాతంత్ర్య సమరయోధురాలు సురయ్య త్యాబ్జీ సభ్యురాలుగా ఉన్నారు.

స్వాతంత్ర్య సంగ్రామంలో అలుపెరగని కృషి చేసిన పింగళి వెంకయ్య అనేక రంగాల్లో నిష్ణాతుడు. జపాన్‌ భాషలో ఆయన అనర్గళ వాగ్ధాటిని చూసిన జనం ఆయనను జపాన్‌ వెంకయ్య అని పిలుచుకునేవారు. 1907 నుంచి 1910 వరకు వెంకయ్య మునగాల పరగణాలో వ్యవసాయ అధికారిగా పనిచేసారు. కొత్త రకం పత్తి వంగడాల అభివృద్ధిలో ఆయన విశేష కృషి చేశారు. మునగాల పరిధిలోకి రైతులు ఆయనను అప్యాయంగా పత్తి వెంకయ్య అని పిలిచేవారు. వజ్రాలపై ఆయన అనేక పరిశోధనలు చేశారు. వజ్రాలు- తల్లిరాయి అనే పుస్తకాన్ని ఆయన ప్రచురించారు. ఆంధ్రా ప్రాంతంలో వజ్రాలపై చేసిన పరిశోధనకు గాను ఆయనకు వజ్రాల వెంకయ్య అనే పేరు కూడా వచ్చింది.

1911 నుంచి 1920 వరకు మచిలీపట్నం నేషనల్‌ కాలేజీలో టీచర్‌గా కూడా ఆయన పనిచేశారు. విద్యార్థులకు జీవననైపుణ్య పాఠాలు ఆయన బోధించారు. పిల్లలకు పట్టు సాగు, ఈత, గుర్రపు స్వారీ, వ్యవసాయం వంటివి నేర్పించారు. ఆయనను విద్యార్థులు ఎంతో ప్రేమతో వెంకయ్య మాస్టరూ అనే పిలుచుకునేవారు. ఇవన్నింటికీ మించి ఆయన జెండా వెంకయ్యగా దేశవ్యాప్తంగా పేరుగాంచిన విషయం అందరికీ తెలిసిందే. దేశానికి ఎన్నో విధాలుగా సేవలందించిన వెంకయ్య చివరి దశ జీవితం అత్యంత దుర్భరంగా సాగింది. కడుపేదరికంతో ఆయన జూలై 4, 1963న కన్నుమూయడం దురదృష్టకరం.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..