
Parliament March: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇటీవల కొత్త వ్యవసాయ చట్టాలను రద్దు చేస్తున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో పార్లమెంటుకు ట్రాక్టర్ల మార్చ్ చేయాలన్న నిర్ణయాన్ని రైతు సంఘాలు తాత్కాలికంగా ఉపసంహరించుకుంటున్నట్లు శనివారం ప్రకటించాయి. ఈ నెల 29 నుంచి ప్రారంభమయ్యే పార్లమెంటు శీతాకాల సమావేశాల తొలి రోజునే వ్యవసాయ చట్టాల రద్దు బిల్లును కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టనుంది. ఈ క్రమంలో ట్రాక్టర్ మార్చ్‌ను నిలిపేయాలని నిర్ణయించినట్లు సంయుక్త కిసాన్ మోర్చా ప్రకటించింది. అయితే కనీస మద్దతు ధర (ఎంఎస్‌పీ), నిరసనల సందర్భంగా మృతిచెందిన రైతులకు పరిహారం, లఖింపూర్ ఖేరీ హింసాకాండ దర్యాప్తు, రైతులపై పెట్టిన కేసులను ఉపసంహరించుకోవడం, విద్యుత్ బిల్లులు వంటివాటిపై ప్రభుత్వం తమతో చర్చించే వరకు ఆందోళన కొనసాగుతుందని కిసాన్ మోర్చా స్పష్టంచేసింది. తమ డిమాండ్లపై డిసెంబరు 4 వరకు వేచిచూస్తామని ఆ తర్వాత తమ తదుపరి కార్యాచరణను ప్రకటిస్తామని రైతు నాయకుడు డాక్టర్ దర్శన్ పాల్ స్పష్టంచేశారు.
కాగా.. వ్యవసాయ చట్టాలను రద్దు చేస్తున్నట్లు ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఈ నెల 19న ప్రకటించారు. అయితే.. వాటితోపాటు మరికొన్ని డిమాండ్లపై పార్లమెంటుకు ట్రాక్టర్ మార్చ్‌ను యథావిధిగా నిర్వహిస్తామని రైతు సంఘాలు తెల్చిచెప్పాయి. ఈ క్రమంలో తాజాగా ఈ నిర్ణయాన్ని వెనక్కుతీసుకుంటున్నట్లు రైతు సంఘాల ప్రతినిధులు పేర్కొన్నారు. అయితే.. వ్యవసాయ చట్టాలను రద్దు చేస్తున్నట్లు ప్రధాని మోదీ ప్రకటించి రైతుల డిమాండ్లను నెరవేర్చారని.. కావున అన్నదాతలందరూ ఇళ్లకు వెళ్లాలని కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ విజ్ఞప్తి చేశారు. రైతులపై కేసులు రాష్ట్ర ప్రభుత్వాల పరిధిలో నమోదయ్యాయని.. మరణించిన రైతులకు నష్టపరిహారం గురించి కూడా రాష్ట్ర ప్రభుత్వాలే నిర్ణయం తీసుకుంటాయని నరేంద్రసింగ్ తోమర్ తెలిపారు.
Also Read: