AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

నాకు దక్కకపోతే ఇంకెవరికీ దక్కొద్దు.. దేవేంద్రుని ప్లాన్ అదేనా?

వారం, పది రోజుల క్రితం మహారాష్ట్రలో జరిగిన రాజకీయ పరిణామాలకు, అప్పుడెప్పుడో రాజమౌళి దర్శకత్వంలో మెగా పవర్‌స్టార్ రామ్‌చరణ్ బ్లాక్ బస్టర్ మూవీ మగధీర సినిమాలోని విలన్ డైలాగ్‌కు లింకుందా? తాజాగా వెల్లడవుతున్న అంశాలను చూస్తుంటే వుందనే అనిపిస్తోంది. పది రోజుల క్రితం ప్రభుత్వం ఏర్పాటు చేయలేనని చేతులెత్తేసిన మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, బిజెపి నేత దేవేంద్ర ఫడ్నవీస్ ఉన్నట్లుండి అజిత్ పవార్ ఇచ్చిన ఫేక్ అండతో ఎలా అడుగు ముందుకేశాడు? అదీ వీకెండ్‌లో వస్తున్న సెలవు […]

నాకు దక్కకపోతే ఇంకెవరికీ దక్కొద్దు.. దేవేంద్రుని ప్లాన్ అదేనా?
Rajesh Sharma
| Edited By: |

Updated on: Dec 02, 2019 | 4:26 PM

Share

వారం, పది రోజుల క్రితం మహారాష్ట్రలో జరిగిన రాజకీయ పరిణామాలకు, అప్పుడెప్పుడో రాజమౌళి దర్శకత్వంలో మెగా పవర్‌స్టార్ రామ్‌చరణ్ బ్లాక్ బస్టర్ మూవీ మగధీర సినిమాలోని విలన్ డైలాగ్‌కు లింకుందా? తాజాగా వెల్లడవుతున్న అంశాలను చూస్తుంటే వుందనే అనిపిస్తోంది. పది రోజుల క్రితం ప్రభుత్వం ఏర్పాటు చేయలేనని చేతులెత్తేసిన మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, బిజెపి నేత దేవేంద్ర ఫడ్నవీస్ ఉన్నట్లుండి అజిత్ పవార్ ఇచ్చిన ఫేక్ అండతో ఎలా అడుగు ముందుకేశాడు? అదీ వీకెండ్‌లో వస్తున్న సెలవు దినాలకు ముందు దేవేంద్ర ఫడ్నవీస్ ఎందుకు దూకుడు ప్రదర్శించాడు? ఈ ప్రశ్నలకు ఇప్పుడిపుడే జవాబు దొరుకుతోంది.

నిజానికి మహారాష్ట్రలో తిరిగి అధికారంలోకి రావడం ఖాయమని బిజెపి నేతలు 100 శాతం నమ్మారు. సొంత బలానికి శివసేన అండ తోడైతే కాంగ్రెస్, ఎన్సీపీలు తమ విజయాన్ని నిలువరించలేవని కలలుగన్నారు. అనుకున్నట్టుగానే నేషనల్ మీడియా ఎగ్జిట్ పోల్ సర్వేల్లో బిజెపి-శివసేన కూటమికి 200 సీట్లు దాటుతాయని ఫలితాలను వెలువరించింది. కానీ ఓ పక్క ఫలితాలు వెలువడుతుండగానే శివసేనలో దాగున్న రెండో సింహం నిద్ర లేచింది. సీఎం సీటుపై సంజయ్ రౌత్‌తో మాట్లాడించడం ద్వారా పేచీ షురూ చేసింది.

కానీ, బిజెపి మాత్రం.. శివసేనకు తమతో కల్వడం తప్ప మరో మార్గం లేదని ఊహల్లో వుండిపోయింది. బిజెపిని కాదని కాంగ్రెస్ పార్టీతో ఉద్ధవ్ థాక్రే జత కడతాడని కమలనాథులు అంఛనా వేయలేకపోయారు. కానీ శరద్ పవార్‌ రూపంలో ఓ అభినవ చాణక్యుడు తమ సీటును లాగేస్తాడని అంఛనా వేయలేకపోయారు. తీరా పరిస్థితి అవగతమయ్యాక చేసేదేమీ లేక చేతులెత్తేశారు దేవంద్ర ఫడ్నవీస్. కానీ అనూహ్యంగా అజిత్ పవార్‌తో శరద్ పవార్ గేమ్ ఆడించడంతో దేవంద్ర ఫడ్నవీస్ దాన్ని అనుకూలంగా మల్చుకునే ప్రయత్నం చేశాడు. కానీ, పదవీ ప్రమాణం చేసిన కొన్ని గంటల్లోనే తాము శరద్ పవార్ ఆడిన జగన్నాటకంలో పావులమయ్యామని గుర్తించాడు ఫడ్నవీస్. అందుకే.. మగధీర సినిమాలో విలన్ డైలాగ్‌ స్ఫురించే పని చేసేశాడు.. సీఎంగా వున్న కొన్ని గంటల్లోనే.

నాకు దక్కనిది…

మొన్నటి ఎన్నికలకు ముందు మహారాష్ట్రకు మరీ ముఖ్యంగా ముంబయి నగరానికి కేంద్ర ప్రభుత్వం భారీగానే నిధులు కేటాయించింది. దేశ ప్రజలంతా ఆశ్చర్యపోయేలా ఒక్క ముంబయి నగరానికే 20వేల కోట్ల రూపాయలను కేటాయించింది మోదీ ప్రభుత్వం. దాంతో పాటు పలు ఇతర పథకాల కింద మరో 20 వేల కోట్ల రూపాయలను మహారాష్ట్ర రాష్ట్రానికి కేటాయించారు. తాను అధికారంలోకి వస్తే వినియోగించి, దాని క్రెడిట్ తనకు, తన బాస్ నరేంద్ర మోదీకి తీసుకురావలని ఫడ్నవీస్ అనుకున్నాడు. కానీ, పరిస్థితి తల్లకిందులై… ఉద్ధవ్ థాక్రే ముఖ్యమంత్రి పీఠం అధిరోహించాడు. అందుకే తన చేతులతో వినియోగించాల్సిన నిధులు రాష్ట్రానికి అందకుండా నిర్ణయం తీసుకునీ మరీ రాజీనామా చేసి సీఎంఓ నుంచి బయటికి వచ్చాడు దేవేంద్ర ఫడ్నవీస్.

ఈ విషయం మామూలుగా లీక్ అయి, గాసిప్ రూపంలో వస్తే ఎవరూ పెద్దగా పట్టించుకునే వారు కాదు.. కానీ ఏకంగా మాజీ కేంద్ర మంత్రి, కర్నాటక బిజెపి నేత అనంత్ కుమార్ హెగ్డే స్వయంగా వెల్లడించడంతో అంతా ఉలిక్కి పడ్డారు. ఎన్నికలకు ముందు కుదిరిన మిత్రధర్మానికి గండి కొట్టిన శివసేనకు ఫడ్నవీస్ పెద్ద దెబ్బే కొట్టాడన్న చర్చ ఇప్పుడు ముంబయిలో జరుగుతోంది. అయితే, రాష్ట్రానికి రావాల్సిన నిధులు రాకుండా చేశాడన్న అపప్రధ తనకు రాకూడదన్న వ్యూహంతో అనంతకుమార్ హెగ్డే చేసిన వ్యాఖ్యలను ఫడ్నవీస్ ఖండించారు. అది వేరే విషయం.