AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

రష్యాకు భారీ ఆర్డర్‌ ఇచ్చిన భారత్‌..! పెట్రోల్‌, డీజిల్‌ ధరల పెంపుపై క్లారిటీ!

మధ్యప్రాచ్యంలో పెరుగుతున్న ఉద్రిక్తతలు, చమురు సరఫరా అంతరాయాల నేపథ్యంలో భారత్ మళ్లీ రష్యన్ ముడి చమురు కొనుగోళ్లను గణనీయంగా పెంచింది. ఇండియన్ ఆయిల్, రిలయన్స్ వంటి ప్రధాన సంస్థలు దాదాపు 30 మిలియన్ బారెల్స్ ఆర్డర్ చేశాయి. అమెరికా మినహాయింపులు, ఇంధన భద్రత లక్ష్యంగా ఈ నిర్ణయం కీలకం.

రష్యాకు భారీ ఆర్డర్‌ ఇచ్చిన భారత్‌..! పెట్రోల్‌, డీజిల్‌ ధరల పెంపుపై క్లారిటీ!
Oil Imports
SN Pasha
|

Updated on: Mar 11, 2026 | 6:00 AM

Share

మధ్యప్రాచ్యంలో పెరుగుతున్న ఉద్రిక్తతల కారణంగా చమురు సరఫరాలో అంతరాయం ఏర్పడటంతో భారతీయ శుద్ధి కర్మాగారాలు మళ్లీ రష్యన్ ముడి చమురు కొనుగోళ్లను పెంచాయి. ఒప్పంద వివరాలు తెలిసిన వర్గాల ప్రకారం అమెరికా మినహాయింపు ఇచ్చిన తర్వాత భారత్ దాదాపు 30 మిలియన్ బారెల్స్ రష్యన్ చమురు ఆర్డర్‌ ఇచ్చింది. దీంతో ఇండియాలో చమురు కొరత లేకుంటే పెట్రోల్‌, డీజిల్‌ ధరల పెంపు ఉండదని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఇటీవల ఇరాన్‌పై యునైటెడ్ స్టేట్స్, ఇజ్రాయెల్ దాడులు ప్రారంభించిన తర్వాత ప్రపంచ చమురు రవాణాకు కీలకమైన హార్ముజ్ జలసంధి ప్రాంతంలో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. ఈ మార్గం ద్వారా ప్రపంచ చమురు సరఫరాలో పెద్ద భాగం వెళ్లుతుంది. దీంతో మధ్యప్రాచ్య దేశాల నుంచి చమురు సరఫరా తగ్గే పరిస్థితి ఏర్పడింది.

ఈ నేపథ్యంలో భారతదేశంలోని ప్రధాన శుద్ధి సంస్థలు అయిన ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్, రిలయన్స్ ఇండస్ట్రీస్ స్పాట్ మార్కెట్‌లో లభ్యమైన రష్యన్ ముడి చమురు సరుకులను పెద్ద ఎత్తున కొనుగోలు చేశాయి. వ్యాపార వర్గాల సమాచారం ప్రకారం ఇండియన్ ఆయిల్ దాదాపు 10 మిలియన్ బారెల్స్ రష్యన్ ముడి చమురును కొనుగోలు చేయగా, రిలయన్స్ కూడా కనీసం అంతే పరిమాణంలో కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. రష్యన్ ముడి చమురులో యురల్స్, ఈఎస్‌పీఓ, వరండే వంటి గ్రేడ్‌లు ఉన్నాయి. ఇవి ప్రస్తుతం లండన్‌లోని బ్రెంట్ బెంచ్‌మార్క్ ధర కంటే బ్యారెల్‌కు 2 నుండి 8 డాలర్ల వరకు ప్రీమియంతో విక్రయించబడుతున్నాయని సమాచారం. మధ్యప్రాచ్య యుద్ధానికి ముందు ఈ చమురు సాధారణంగా బ్రెంట్ ధర కంటే తక్కువకే లభించేది.

మార్చి 5కి ముందు ఓడల్లో లోడ్ చేసిన రష్యన్ ముడి చమురు, పెట్రోలియం ఉత్పత్తులకు సంబంధించిన లావాదేవీలకు అమెరికా మినహాయింపు ఇచ్చింది. దీంతో ముందుగా ఇతర దేశాలకు వెళ్లాల్సిన కొన్ని ట్యాంకర్లు మళ్లీ భారత్ వైపు మళ్లాయి. మెలో, సారా అనే రెండు ట్యాంకర్లు మొదట సింగపూర్ వైపు వెళ్తున్నప్పటికీ, ఇటీవల తమ గమ్యాన్ని భారత్‌గా మార్చుకున్నాయి. సాధారణంగా రష్యా నుంచి భారత్ ఎక్కువగా చమురు దిగుమతి చేసుకునేది కాదు. అయితే 2022లో ఉక్రెయిన్‌పై రష్యా దాడి తర్వాత తక్కువ ధరకు లభించడంతో కొనుగోళ్లు పెరిగాయి. డేటా సంస్థ కెప్లర్ ప్రకారం 2024 మధ్యలో రష్యన్ చమురు దిగుమతులు రోజుకు 2 మిలియన్ బారెల్స్ కు పైగా చేరుకున్నాయి. అయితే ఫిబ్రవరిలో ఇది సగటున రోజుకు 1.06 మిలియన్ బారెల్స్ కు తగ్గింది. ప్రస్తుత పరిస్థితుల్లో మధ్యప్రాచ్య సంక్షోభం కొనసాగితే భారత్ రష్యన్ చమురు కొనుగోళ్లను మరింత పెంచే అవకాశం ఉందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

మరిన్ని బిజినెస్‌ వార్తల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి

Follow Us