Indians: స్వదేశానికి బై బై.. విదేశాలకు రయ్ రయ్.. పౌరసత్వాన్ని వదులుకుంటున్న లక్షలాది మంది భారతీయులు..
2021లోనే 1.63 లక్షల మంది భారతీయ పౌరసత్వాన్ని వదులుకున్నారని మంగళవారం భారత ప్రభుత్వం పార్లమెంటుకు తెలిపింది. కేంద్ర హోం మంత్రిత్వ శాఖ సమర్పించిన డేటా ప్రకారం..
Global Indians: భారతీయులు చాలామంది విదేశాల్లో స్థిరపడేందుకు మొగ్గుచూపుతున్నారు. ఇప్పటికే వేల సంఖ్యలో భారీయులు ఉద్యోగ, ఉపాధి కోసం పలు దేశాల్లో స్థిరపడిన విషయం తెలిసిందే. గత మూడేళ్లలో 3.9 లక్షల మందికి పైగా భారతీయులు తమ పౌరసత్వాన్ని వదులుకున్నారని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. 2021లోనే 1.63 లక్షల మంది భారతీయ పౌరసత్వాన్ని వదులుకున్నారని మంగళవారం భారత ప్రభుత్వం పార్లమెంటుకు తెలిపింది. కేంద్ర హోం మంత్రిత్వ శాఖ సమర్పించిన డేటా ప్రకారం.. భారతీయ వలసదారులు స్థిరపడిన 103 దేశాల జాబితాలో US అగ్రస్థానంలో ఉంది. 2021లోనే 78,000 మందికి పైగా భారతీయులు US పౌరసత్వం తీసుకున్నారు.
డేటా ప్రకారం.. ఇటీవలి సంవత్సరాలలో దేశ పౌరసత్వాన్ని వదులుకుంటున్న భారతీయుల సంఖ్య ప్రతి ఏటా పెరుగుతోంది. 2020లో COVID- సంబంధిత లాక్‌డౌన్‌ల కారణంగా మినహాయింపు లభించింది. భారతీయులు ఎక్కడికి వెళ్తున్నారు.. ఎందుకు వెళ్తున్నారు అని అన్వేషించే ముందు, భారతదేశం తన పౌరులకు ద్వంద్వ పౌరసత్వాన్ని కలిగి ఉండే అవకాశాన్ని అందించడం లేదని గమనించడం ముఖ్యం.
ఇతర దేశాల్లో పౌరసత్వం పొందాలనుకునే వారు భారత పౌరసత్వాన్ని వదులుకోవాలి. అటువంటి వ్యక్తులు భారతదేశంలో నివసించడం, పని చేయడం లేదా వ్యాపారాన్ని నిర్వహించడం వంటి వాటికి సంబంధించి నిర్దిష్ట ప్రయోజనాలను అందించే ఓవర్సీస్ సిటిజన్ ఆఫ్ ఇండియా (OCI) కార్డ్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు.
పౌరసత్వ చట్టం.. 1955లోని సెక్షన్ 8 పౌరసత్వ నియమాలు, 2009లోని రూల్ 23 ఒక వ్యక్తి వారి పౌరసత్వాన్ని త్యజించేందుకు ఫ్రేమ్‌వర్క్‌ను నిర్దేశించాయి. ప్రస్తుతం ఈ ప్రక్రియ ఆన్‌లైన్‌లో పూర్తి చేసుకోవచ్చు.
భారతీయులు ఎక్కడికి వెళ్తున్నారు?
పార్లమెంటుకు సమర్పించిన డేటా ప్రకారం.. గత మూడేళ్లలో భారతీయులు తమ పౌరసత్వాన్ని వదులుకున్న గమ్యస్థానాల జాబితాలో USA (అమెరికా), కెనడా, ఆస్ట్రేలియా, UK (బ్రిటన్) అగ్రస్థానంలో ఉన్నాయి.
2019 – 2021 మధ్య మూడేళ్ల కాలంలో 1,70,795 మంది భారతీయులు USలో స్థిరపడేందుకు తమ పౌరసత్వాన్ని వదులుకోగా, 64,071 మంది కెనడాలో పౌరసత్వం తీసుకున్నారు. 58,391 మంది ఆస్ట్రేలియాలో స్థిరపడ్డారు. 35,435 మంది UK పౌరసత్వాన్ని తీసుకున్నారు.
ప్రధానంగా ఈ నాలుగు దేశాల తర్వాత.. భారతీయులు ఇటలీ (12,131), న్యూజిలాండ్ (8,882), సింగపూర్ (7,046), జర్మనీ (6,690), స్వీడన్ (3,754), పాకిస్తాన్ (48)లో కూడా స్థిరపడ్డారు.
భారతీయులు విదేశాలకు ఎందుకు వెళ్తున్నారు?
భారతీయులు తమ పౌరసత్వాన్ని ఎందుకు వదులుకుంటున్నారనే అంశంపై పార్లమెంటులో అడిగిన ప్రశ్నకు సమాధానమిస్తూ, వ్యక్తిగత కారణాల వల్ల ఈ వ్యక్తులు తమ పౌరసత్వాన్ని వదులుకుంటున్నారని భారత హోం వ్యవహారాల సహాయ మంత్రి నిత్యానంద రాయ్ తెలిపారు.
సాధారణంగా చెప్పాలంటే, భారతీయులు విదేశాలకు వెళ్లడానికి, వారి పౌరసత్వాన్ని వదులుకోవడానికి గల కారణాలు వ్యక్తులను బట్టి విభిన్నంగా ఉంటాయి. కానీ స్వీయ-అభివృద్ధి కోసం కొన్ని సాధారణ నమూనాలు ఉన్నాయి. ముఖ్యంగా వ్యక్తిగత అభివృద్ధే భారతదేశాన్ని విడిచిపెట్టడానికి ఇది ఒక ప్రధాన కారణం.
ఇంటర్నేషన్స్ ద్వారా 2021 ఎక్స్‌పాట్ ఇన్‌సైడర్ సర్వే ప్రకారం.. సర్వేలో పాల్గొన్న భారతీయుల్లో 59 శాతం మంది ఉద్యోగ అవకాశాల కోసం విదేశాల్లో స్థిరపడినట్లు వెల్లడించారు.
తమ జీవితాన్ని మెరుగుపరుచుకోవాలని చూస్తున్న భారతీయుల గమ్యస్థానంగా US సాధారణంగా అగ్రభాగన ఉంటుంది. భారతీయ అమెరికన్లు USలో రెండవ అతిపెద్ద వలస సమూహంగా ఉన్నారు. దీంతోపాటు అత్యంత సంపన్నులు, బాగా చదువుకున్న వారిలో కూడా ముందు వరసలో ఉన్నారు.
భారతీయ అమెరికన్ కుటుంబానికి మధ్యస్థ ఆదాయం దాదాపు $123,700 అని డేటా చూపిస్తుంది. ఇది దేశవ్యాప్త సగటు $63,922 కంటే దాదాపు రెట్టింపు. విద్య విషయానికొస్తే, జాతీయ సగటు 34 శాతంతో పోలిస్తే USలోని భారతీయ సమాజంలో 79 శాతం మంది కళాశాల గ్రాడ్యుయేట్లు ఉన్నారు.
భారతీయులు విదేశాలలో స్థిరపడటానికి, వారి పౌరసత్వాలను వదులుకోవడానికి మరొక ప్రధాన కారణం అనేక దేశాలు అందించే ‘గోల్డెన్ వీసా’ ప్రోగ్రామ్ అని తేలింది. సింగపూర్, పోర్చుగల్ వంటి దేశాలు నిర్వహిస్తున్న ఈ కార్యక్రమాలు ధనవంతులైన విదేశీ వ్యక్తులు.. పౌరులుగా మారేందుకు ఈ దేశాలలో గణనీయమైన మొత్తంలో డబ్బును పెట్టుబడి పెట్టడానికి అనుమతిస్తాయి.
ఇటీవలి సంవత్సరాలలో ఇటువంటి కార్యక్రమాలను కోరుకునే భారతీయుల సంఖ్య పెరుగుతోంది. లండన్‌కు చెందిన సలహా సంస్థ హెన్లీ & పార్ట్‌నర్స్ 2020లో పెట్టుబడి వలస ప్రణాళికల కోసం ఎంక్వైరీలు చేస్తున్న భారతీయుల సంఖ్య 62 శాతం పెరిగింది .
ఈ అధిక-నికర-విలువ గల వ్యక్తులు సాధారణంగా వారు పౌరసత్వం పొందాలని చూస్తున్న దేశాల్లో.. మెరుగైన ఆరోగ్య సంరక్షణ యాక్సెస్ నుంచి మరింత అనుకూలమైన వ్యాపార, పెట్టుబడి వాతావరణాల వరకు అనేక కారణాల వల్ల దేశం విడిచి వెళతారు.
ఇక భారత్ పాస్‌పోర్ట్ స్కోర్ విషయం పరిశీలిస్తే.. హెన్లీ గ్లోబల్ ర్యాంకింగ్ ఆఫ్ పాస్‌పోర్ట్‌ల ప్రకారం 60 దేశాలకు మాత్రమే వీసా-ఫ్రీ లేదా వీసా-ఆన్-అరైవల్ యాక్సెస్‌ను మంజూరు చేసే పాస్‌పోర్ట్‌తో భారతదేశం 87వ ర్యాంక్‌లో ఉంది. దీనిని పోల్చి చూస్తే పోర్చుగల్‌లో పౌరసత్వం పొందిన భారతీయుడు ఉంటే.. గోల్డెన్ వీసా ప్రోగ్రామ్‌ను ఉపయోగించడం ద్వారా, 187 దేశాలకు వీసా-ఫ్రీ/వీసా-ఆన్-అరైవల్ యాక్సెస్‌ని అందించే పాస్‌పోర్ట్ ఉంటుంది.
ఈ విస్తృత కారణాల మధ్య, ఆరోగ్య సంరక్షణ యాక్సెస్, మెరుగైన విద్య, ప్రభుత్వాల అణచివేత నుంచి తప్పించుకోవడం లేదా కొన్ని అధిక ప్రొఫైల్ కేసులలో చట్టపరమైన చర్యల నుంచి తప్పించుకోవడానికి కొందరు విదేశాల్లో స్థిరపడటానికి కారణమని పేర్కొంటున్నారు.
మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..