బీహార్‌లో ఉపేంద్ర కుష్వాహ నేతృత్వంలో మరో కూటమి
బీహార్‌లో మరో కూటమి అవతరించింది.. అంటే థర్డ్ ఫ్రంట్ అన్నమాట! దీనికి నేతృత్వం వహిస్తున్నది రాష్ట్రీయ లోక్ సమతాపార్టీ అధినేత ఉపేంద్ర కుష్వాహ.. ఎన్‌డీఎ, ఆర్‌జేడీ నాయత్వంలోని కూటములకు సమాంతరంగా మరో కూటమిని ఏర్పాటు...
బీహార్‌లో మరో కూటమి అవతరించింది.. అంటే థర్డ్ ఫ్రంట్ అన్నమాట! దీనికి నేతృత్వం వహిస్తున్నది రాష్ట్రీయ లోక్ సమతాపార్టీ అధినేత ఉపేంద్ర కుష్వాహ.. ఎన్‌డీఎ, ఆర్‌జేడీ నాయత్వంలోని కూటములకు సమాంతరంగా మరో కూటమిని ఏర్పాటు చేస్తున్నామని కేంద్ర మాజీ మంత్రి అయిన ఉపేంద్ర ప్రకటించారు.. మొత్తం 243 అసెంబ్లీ స్థానాల నుంచి పోటీ చేస్తామని చెప్పారు. ప్రస్తుతానికి ఈ ఫ్రంట్‌లో మాయావతి నాయకత్వంలోని బహుజన్ సమాజ్‌పార్టీ భాగస్వామిగా ఉంటుందని కుష్వాహ చెప్పారు. గత పదిహేను ఏళ్లుగా బీహార్‌ను పాలించిన నితీశ్‌కుమార్ కానీ, అంతకు ముందు ఓ పదిహేనేళ్లు అధికారంలో ఉన్న లాలూ ప్రసాద్, రబ్రీదేవీలు కానీ రాష్ట్రానికి ఒరగబెట్టిందేమీ లేదని విమర్శించారు ఉపేంద్ర కుష్వాహ.. వీరి పాలన ఒకే నాణేనికి ఉన్న బొమ్మా బొరుసులాంటివని అభివర్ణించారు. మొదట్లో ఈయన జేడీయూలోనే ఉండేవారు.. 2007లో కుష్వాహ నుంచి పార్టీ నుంచి సస్పెండ్ చేశారు నితీశ్‌కుమార్.. ఆ తర్వాత రెండేళ్లకు ఈయన సొంతంగా రాష్ట్రీయ సమతా పార్టీని స్థాపించారు. కుష్వాహ -కోయిరి సామాజికవర్గం అండదండలు ఈయనకు ఎక్కువగా ఉన్నాయి.. తదనంతరం ఆ పార్టీని జనతాదళ్ యునైటెడ్‌లో విలీనం చేశారు.. మళ్లీ ఏడేళ్ల తర్వాత ఇదే సీన్ రిపీట్ అయ్యింది.. నితీశ్‌పై అలిగి పార్టీ నుంచి బయటకు వచ్చారు.. ఈసారి రాష్ట్రీయ లోక్ సమతాపార్టీని స్థాపించారు ఉపేంద్ర కుష్వాహ.. ఇప్పుడు ఈ థర్డ్ ఫ్రంట్ బీహార్ ఎన్నికలలో ఎలాంటి ప్రభావం చూపుతుందో తెలియదు కానీ.. ప్రజల ఆశీస్సులతో ఉపేంద్ర కుష్వాహ సీఎం అవుతారని అంటున్నారు బీఎస్పీ అధినేత మాయావతి. బీహార్‌లో బీజేపీ-జేడీయూ-ఎల్‌జేపీ కలిసి పోటీ చేస్తుండగా.. కాంగ్రెస్-ఆర్జేడీ కూటమి బరిలోకి దిగుతోంది.