బాలసుబ్రహ్మణ్యానికి భారతరత్న పురస్కారం ఇవ్వాల్సిందే!

అద్వైత సిద్ధికి అమరత్వ లబ్ధికి గానమే సోపానమంటూ అమరలోకానికి తరలివెళ్లిన ఎస్‌.పి.బాలసుబ్రహ్మణ్యం నిజంగానే భారతరత్నమే! ఆ పురస్కారానికి ఆయన నూటికి నూరుపాళ్లు అర్హులు..

బాలసుబ్రహ్మణ్యానికి  భారతరత్న పురస్కారం ఇవ్వాల్సిందే!
Follow us
Balu

|

Updated on: Sep 30, 2020 | 9:36 AM

అద్వైత సిద్ధికి అమరత్వ లబ్ధికి గానమే సోపానమంటూ అమరలోకానికి తరలివెళ్లిన ఎస్‌.పి.బాలసుబ్రహ్మణ్యం నిజంగానే భారతరత్నమే! ఆ పురస్కారానికి ఆయన నూటికి నూరుపాళ్లు అర్హులు.. గానాన్ని తన ప్రాణంగా మలుచుకున్న ఆ స్వరగాంధర్వుడికి భారతరత్న ఇవ్వాలన్న డిమాండ్‌ పెరుగుతోంది.. ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వై.ఎస్‌.జగన్మోహన్‌రెడ్డి మొదట ఈ ప్రతిపాదన తెచ్చారు.. ఈ మేరకు ప్రభుత్వం తరఫున ప్రధానమంత్రి నరేంద్రమోదీకి లేఖ కూడా రాశారు.. జగన్మోహన్‌రెడ్డి నిర్ణయాన్ని అన్ని వర్గాల ప్రజలు ఆమోదం తెలిపారు.. హర్షం వ్యక్తం చేశారు..బాలుకు భారతరత్న ఇవ్వాల్సిందేనని, ఇచ్చి తీరాల్సిందేనని అంటున్నారు.. సినీ సంగీత దర్శకులు, నేపథ్య గాయనీగాయకులైతే ముఖ్యమంత్రి నిర్ణయం భేషంటున్నారు.. సంగీత దర్శకుడు అనూప్‌ రూబెన్స్‌ అయితే బాలును భారతరత్నతో సత్కరించుకోవల్సిన ఆవశ్యకత ఎందైనా ఉందంటున్నారు.. అసలు ఆయనకు ఈ అవార్డు ఎప్పుడో రావల్సిందని, చాలా ఆలస్యం అయ్యిందని అన్నారు.. ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ప్రతిపాదన నిజంగా అభినందనీయమని తెలిపారు. గాయని సునీత కూడా బాలసుబ్రహ్మణ్యానికి అత్యుత్తమ పౌర పురస్కారమైన భారతరత్న ఇచ్చి తీరాల్సిందననంటున్నారు. బాలు సకలకళావల్లభుడని, అంతే కాకుండా గొప్ప మనసున్న వ్యక్తి అని చెప్పారామె! ఏపీ ప్రభుత్వ ప్రతిపాదన సముచితమైనదని శ్లాఘించారు. బాలసుబ్రహ్మణ్యం భారతరత్నమేనని, అత్యుత్తమ పురస్కారానికి ఆయన అన్ని విధాల అర్హులేనని గీత రచయిత భాస్కరభట్ల అన్నారు.. భారతరత్నతో ఆయన్ని సత్కరించుకోవాలని ఏపీ ప్రభుత్వం కోరడం నిజంగా అభినందనీయమన్నారు. ఎస్పీబీకి భారతరత్న ఇవ్వాలన్న ప్రతిపాదన సంతోషాన్ని కలిగించిందని అన్నారు గాయని కౌసల్య.. గాయకులు సమీర భరద్వాజ, రాహుల్‌ సిప్లిగంజ్‌లు కూడా బాలుకు భారతరత్న పురస్కారం ఇవ్వడం సముచితమన్నారు.