
రేషన్ పంపిణీలో పారదర్శకత తెచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం కొత్త ఆలోచన చేసింది. అక్రమాలకు అడ్డుకట్ట వేసి లబ్దిదారులకు ప్రయోజనం చేకూర్చేందుకు రేషన్ పంపిణీలో కొత్త విధానాలను అవలంభిస్తోంది. ఇప్పటికే దేశవ్యాప్తంగా ఎక్కడైనా రేషన్ తీసుకునే సౌకర్యాన్ని తీసుకురాగా.. తాజాగా మరో కీలక నిర్ణయం తీసుకుంది. తాజాగా సెంట్రల్ బ్యాంక్ డిజిటల్ కరెన్సీ పద్దతిని తీసుకొచ్చింది. గుజరాత్‌లోని గాంధీ నగర్‌లో పైలట్ ప్రాజెక్టుగా దీనిని కేంద్రం ప్రారంభించింది. ఈ మేరకు హోంమంత్రి అమిత్ షా ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. అలాగే 24 గంటలు ఏటీఎం యంత్రాల ద్వారా రేషన్ తీసుకునే అన్నపూర్తి గ్రెన్ ఏటీఎంను కూడా ప్రభుత్వం అందుబాటులోకి తెస్తుంది. అసలు ఇవి ఎలా పనిచేస్తాయి.. వీటి వల్ల లబ్దిదారులకు జరిగే ప్రయోజనం ఏంటి? అనే విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం.
ఈ-రూపీ వ్యవస్థ ద్వారా రేషన్ షాపుల్లో లబ్దిదారులు పేమెంట్ చేసి సరుకులు తీసుకోవచ్చు. ఇందుకోసం లబ్దిదారులకు డిజిటల్ వ్యాలెట్లు అందిస్తారు. ఈ వ్యాలెట్లలో ఆర్బీఐ ద్వారా ఈ-రూపీ జమ అవుతుంది. రేషన్ షాపుల్లో వీటి ద్వారా పేమెంట్ చేయవచ్చు. సరుకు, పరిమాణంను బట్టి వీటిని ఖర్చు చేసుకోవచ్చు. క్యూఆర్ కోడ్, ఆధార్ ఓటీపీ వ్యవస్థ ద్వారా ఈ డిజిటల్ లావాదేవీలు చేయాల్సి ఉంటుంది. ఈ విధానంలో పేమెంట్ చేస్తే నేరుగా డీలర్ అకౌంట్లో నగదు జమ అవుతుంది. దని వల్ల మధ్యవర్తుల ప్రమేయం తగ్గడంతో పాటు ఎవరికి ఎంత రేషన్ అందింది అనే వివరాలు రియల్ టైంలో ప్రభుత్వానికి తెలుస్తాయి. అలాగే తూకంలో మోసాలకు కూడా దీని వల్ల చెక్ పడుతుందని ప్రభుత్వం భావిస్తోంది.
ఇక ఏటీఎం మెషీన్ల మాదిరిగా ఉండే యంత్రాల ద్వారా లబ్దిదారులు ఎప్పుడైనా రేషన్ తీసుకోవచ్చు. అన్నపూర్తి పేరుతో ఈ మెషీన్లను కేంద్రం తీసుకొస్తుంది. ఇవి 24 గంటలు అందుబాటులో ఉంటాయి. 35 సెకన్లలోనే 25 కిలోల ధాన్యాన్ని వీటి ద్వారా తీసుకోవచ్చు. ఈ ఏటీఎంలు ఉపయోగించుకోవాలంటే డిజిటల్ కార్డు అనేది అవసరం. ఈ కార్డును ఏటీఎం మెషీన్ దగ్గర స్కాన్ చేయాలి. ఆ తర్వాత ఐరిస్, వేలిముద్ర వంటివి అందించాల్సి ఉంటుంది. ఆ తర్వాత బియ్యం తీసుకోవచ్చు. మార్చి 2026 నుంచి ఈ మెషిన్ల ద్వారా గోధుములు, కందిపప్పు, శనగలు, చక్కెర, ఉప్పును కూడ పంపిణీ చేసేందుకు ప్రభుత్వం సిద్దమవుతంది. ప్రస్తుతం కొన్ని రాష్ట్రాల్లో పైలట్ ప్రాజెక్ట్‌గా వీటిని అమలు చేస్తోండగా.. రానున్న రోజుల్లో దేశవ్యాప్తంగా విస్తరించనున్నారు. దీంతో రేషన్ సరఫరాలో వేగం పెరగనుంది.