Dharmendra Pradhan: భారత్‌లో జరిగిన G20 సమ్మిట్ చరిత్రలో నిలిచిపోతుంది: ధర్మేంద్ర ప్రధాన్
ఢిల్లీలో ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన జీ-20 సమావేశాలు ముగిశాయి. జీ-20 అధ్యక్ష బాధ్యతలను బ్రెజిల్ ప్రెసిడెంట్ లూలా డిసిల్వాకు అప్పగించారు ప్రధాని మోదీ. వచ్చే ఏడాది జీ-20 సమావేశాలు బ్రెజిల్‌లో జరుగుతాయి. నవంబర్ వరకు జీ-20 అధ్యక్ష బాధ్యతలను ప్రధాని మోదీ నిర్వహిస్తారు. భారత్ సారథ్యంలో సాగిన G20 సదస్సు సూపర్ సక్సెస్ అయిందని కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ పేర్కొన్నారు. భారత్ మాటకు ఏకగ్రీవ ఆమోదం లభించిందన్నారు.

ఆఫ్రికన్ యూనియన్‌ను జి-20లో శాశ్వత సభ్యదేశంగా మార్చిన ఘనత భారత్‌కు, ప్రధాని మోదీకి దక్కుతుందన్నారు కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్. G-20 సమావేశాల్లో విద్యా ఎజెండాలో… సమానమైన, స్థిరమైన విద్య అనే అంశంపై ఉన్నతమైన చర్చ జరిగిందన్నారు. పర్యావరణాన్ని కాపాడితేనే మనం కూడా మరింతగా మనుగడ సాగించగలమనే.. భారత్ ‘మిషన్ లైఫ్’ కార్యక్రమానికి అందరి నుంచి అంగీకారం లభించిందన్నారు. వాతావరణ మార్పుల తీవ్రమైన పరిణామాలను దృష్టిలో ఉంచుకుని ఈ ప్రచారం ప్రారంభించబడింది. కాగా ప్రధాని మోదీ నాయకత్వంలో, G20 సమ్మిట్ విజయవంతంగా ముగిసిందన్నారు ధర్మేంద్ర ప్రధాన్. సమ్మిట్ జరిగిన సెప్టెంబర్ 8, 9, 10 తేదీలు విశ్వ చరిత్రపై సువర్ణాక్షరాలతో లిఖించబడతాయని చెప్పారు.
#WATCH | Union Minister Dharmendra Pradhan says, "Under the leadership of PM Modi, the G20 Summit has been successfully concluded. September 8,9 & 10 have been written on the history of the universe in golden letters… The biggest achievement of this summit is the inclusion of… pic.twitter.com/NDHA8t3ZNk
— ANI (@ANI) September 11, 2023
చైనా చేపట్టిన బెల్ట్ అండ్ రోడ్ ఇనీషియేటివ్ -BRIకి దీటుగా భారత్-పశ్చిమాసియా-యూరప్ కనెక్టివిటీ కారిడార్‌ను G20 సమ్మిట్‌లో మోదీ అనౌన్స్ చేశారు. దీనికింద రైల్వే, పోర్టు సౌకర్యాలను అభివృద్ధి చేస్తారు. మున్ముందు పశ్చిమాసియాకు, యూరప్‌కు మధ్య ఆర్థిక అనుసంధానానికి భారత్ కీలకపాత్ర పోషిస్తుందని చెప్పారు. ఈ ప్రాజెక్టుకు సహకారం అందిస్తామని యూరపియన్ దేశాలు చెప్పాయి. అయితే ఈ ప్రాజెక్టు కోసం ప్రపంచబ్యాంక్ అదనంగా 305 మిలియన్ యూరోలను ఇస్తామని జర్మనీ చాన్సలర్ షోల్జ్ వివరించారు.
భారత్-యూరప్-పశ్చిమాసియా కారిడార్‌ను గేమ్‌ఛేంజింగ్ పెట్టుబడిగా అమెరికా అధ్యక్షుడు బైడెన్ అభివర్ణించారు. మెరుగైన భవిష్యత్తు కోసం సుస్థిర, నాణ్యమైన మౌలికవసతులను కల్పించడం, అందుకు పెట్టుబడులు పెట్టడం విశేషమన్నారు. అమెరికా, ఇతర దేశాలు కలపి, దీన్ని వాస్తవికంగా మలచడానికి ప్రయత్నిస్తున్నాయని చెప్పారు. ఉక్రెయిన్‌పై రష్యా వార్ కరెక్ట్ కాదంటూ G20 సదస్సు ఏకగ్రీవ తీర్మానం చేసింది. ఐక్యరాజ్యసమితి చార్టర్ ప్రకారం ఇతర దేశాల ప్రాదేశిక సమగ్రతను, సార్వభౌమత్వాన్ని, రాజకీయ స్వతంత్రతను దెబ్బతీసేలా బలప్రయోగం చేయడాన్ని వ్యతిరేకిస్తున్నట్లు ఈ తీర్మానం ప్రకటించింది.
బలమైన, సుస్థిర, సమ్మిళిత వృద్ధికి ఆమోదం లభించింది. అలాగే సుస్థిరాభివృద్ధి లక్ష్యాలను చేరుకోవడంలో వేగం పెంచాలని తీర్మానించారు. సుస్థిర భవిష్యత్ కోసం పర్యావరణహిత అభివృద్ధికి కృషిచేయాలని కూడా G20 తీర్మానం చేసింది. కర్బన ఉద్గారాలను తగ్గించే దిశగా “అంతర్జాతీయ జీవ ఇంధన కూటమి”ని ప్రధాని మోదీ స్టార్ట్ చేశారు. దీనిప్రకారం, పెట్రోల్‌లో ఇథనాల్‌ను 20 శాతం వరకు కలపి వాడాలన్నది దీని ఉద్దేశం. అమెరికా అధ్యక్షుడు బైడెన్‌తోపాటు, బ్రెజిల్, అర్జెంటీనా, ఇటలీ దేశాధినేతలతో ఆయన ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఇథనాల్ బ్లెండింగ్ విషయంలో ఇతర దేశాలు కూడా కలసి రావాలని మోదీ పిలుపునిచ్చారు.
అంతర్జాతీయ శాంతికి, భద్రతకు- ఉగ్రవాదం అనేది అత్యంత తీవ్రమైన పెనుముప్పుల్లో ఒకటని G20 సదస్సు తీర్మానించింది. అన్నిరకాల ఉగ్రవాద చర్యలు- ఎవరు, ఎక్కడ, ఎలా చేపట్టినా- అవి నేరపూరితమైనవనీ, సమర్థనీయం కావనీ- న్యూఢిల్లీ G20 సదస్సు తీర్మానించనట్లు విదేశాంగ మంత్రి జైశంకర్ చెప్పారు. ఉగ్రవాదాన్ని, దాన్ని రూపాంతరాలను G20 దేశాధినేతలు ఖండించారన్నారు.
సబ్‌కా సాత్ అనే భావనతో G20 నాయకత్వం చేపట్టిన భారత్- ఈ కూటమిలో ఆఫ్రికన్ యూనియన్‌కు శాశ్వత సభ్యత్వం కల్పిస్తున్నట్లు ప్రధాని మోదీ ప్రకటించారు. G20లో భారత ప్రజల భాగస్వామ్యం ఉన్నట్లు తన ప్రారంభోపన్యాసంలో చెప్పారాయన. దేశవ్యాప్తంగా 60కి పైగా నగరాల్లో 200కి పైగా సమావేశాలు జరిగినట్లు ప్రధాని మోదీ వివరించారు. అంతకుముందు దేశాధినేతలు, ఆర్థిక సంస్థల అధిపతులను ప్రధాని మోదీ ఘనంగా స్వాగతం పలికారు. అమెరికా, దక్షిణాఫ్రికా, బ్రిటన్, ఇటలీ అధినేతలతోపాటు, ప్రపంచబ్యాంక్ చీఫ్ అజయ్ బంగా వంటివారికి- సమావేశ వేదిక అయిన భారత మండపంలో ప్రధాని మోదీ సాదరంగా స్వాగతం పలికారు.
15 ఏళ్ల కిందట ఆర్థిక సంక్షోభం తర్వాత ప్రపంచాభివృద్ధి కోసం తొలిసారిగా G20 దేశాధినేతలు సమావేశం అయ్యారని బ్రిటన్ ప్రధాని రిషి సునక్ గుర్తుచేశారు. ఇప్పుడు అనాకానేక సవాళ్ల మధ్య G20 పమావేశం జరుగుతోందని చెప్పారాయన. G20 కూటమి నాయకత్వం కోసం యావత్ ప్రపంచం ఎదురుచూస్తోందని, కలసి పనిచేద్దామని రిషి సునక్ పిలుపునిచ్చారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి.