Delhi: 5 రోజులుగా క్షీణించిన గాలి నాణ్యత.. అత్యంత విషమం అంటూ CPCB హెచ్చరిక
పేరుకే మహానగరం.. పైగా దేశ రాజధాని నగరం. కానీ.. చాలా విషయాల్లో అక్కడ జనజీవనం అత్యంత దుర్భరం అని అనేకసార్లు రుజువైంది. ద గ్రేట్ హస్తినాపురి గురించే మనం చెప్పుకుంటున్నాం... ఎస్... ఢిల్లీ నగరాన్ని మళ్లీ కమ్మేసింది కాలుష్య భూతం. దాదాపుగా ఎమర్జెన్సీ పరిస్థితి కనిపిస్తోందక్కడ.

ప్రస్తుతం హస్తినలో గాలి నాణ్యత ప్రమాణాలు అత్యంత విషమం… అంటే సివియర్ కేటగిరీలోకి చేరినట్టు సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ ప్రకటించింది. ఇదే స్థాయి కొన్నాళ్లు కొనసాగితే ఆక్సిజన్ మాస్కులేసుకుని తిరగాల్సిన పరిస్థితి. కోవిడ్ టైమ్‌లో కరోనా పురుగు పొంచి ఉందన్న భయంతో ఊపిరి పీల్చాలంటే భయపడి బిక్కచచ్చిపొయ్యాం.. ఇప్పుడు ఢిల్లీలో దాదాపుగా అటువంటి పరిస్థితే దాపురించింది. దట్టమైన పొగమంచు కారణంగా వాహనాల రాకపోకలకు అంతరాయం కలుగుతోంది.. రోడ్లపై ఎదురుగా వచ్చే వాహనాలు కనిపించకపోవడంతో యాక్సిడెంట్లవుతున్నాయి. హస్తినలో క్రమంగా చలి తీవ్రత కూడా పెరుగుతోంది. ముఖ్యంగా… ఉదయం పూట ఎక్కువగా ఇబ్బందిపడుతున్నారు ఢిల్లీ వాసులు.
ఢిల్లీలోని సిగ్నేచర్ బ్రిడ్జ్ మీదుగా తీసిన ఈ డ్రోన్ వీడియో చూశారా..? దట్టమైన పొగమంచు దుప్పటి కప్పినట్టు… పట్టపగలే చిమ్మచీకట్టు పట్టినట్టు నేల మీద ఏమీ కనిపించని పరిస్థితి. ఢిల్లీ మహానగరం మొత్తం ఎటుచూసినా ఇదే దృశ్యం. గంటగంటకూ పెరుగుతున్న గాలికాలుష్యంతో నగరం నరకం చూస్తోంది. దీంతో వెంటనే ఎలర్ట్ అయింది ఢిల్లీ ప్రభుత్వం. ఢిల్లీలో వాయుకాలుష్యం పరాకాష్టకు చేరుకోవడంతో… ప్రజానీకానికి ప్రత్యేక మార్గదర్శకాలు జారీ అయ్యాయి. నిన్న రాత్రి గాలి నాణ్యత సూచీ 357 పాయింట్లు సూచించింది. తర్వాత ముంద్ఖా ప్రాంతంలో ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ 616 పాయింట్లకు చేరింది. ఇది అత్యంత ప్రమాదకరం. వాయు నాణ్యతను మెరుగుపరచడానికి చర్యలు తీసుకోవాలంటూ అటవీ శాఖకు ఆదేశాలిచ్చింది హైకోర్టు. ముందస్తుగా ప్రైమరీ స్కూళ్లకు రెండురోజుల పాటు సెలవులు ప్రకటించింది సర్కార్. అటు… కలుషిత గాలి పీల్చడం వల్ల అస్తమా రోగుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. గాలి నాణ్యత సూచిలో 0-50 ఉంటే ఆరోగ్యమైన గాలి ఉన్నట్లు.. 50 నుంచి 100 ఉంటే సంతృప్తికరంగా ఉందని స్వేచ్ఛగా ఊపిరి పీల్చుకోవచ్చని లెక్క. కానీ… గాలి నాణ్యత 101 నుంచి 300 ఉంటే ఈ గాలి పేలవమైనదని అర్థం. 400 దాటితే ఆ గాలి విషపూరితమని నిర్ధారణ. ప్రస్తుతం 600 మార్క్‌ని కూడా క్రాస్ చేసింది ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్. ఇది అత్యంత ప్రమాదకర పరిస్థితి
అటు సుప్రీంకోర్టు కూడా వాయు కాలుష్యం రాబోయే తరాలపై తీవ్ర ప్రభావం చూపుతుందని ఆందోళన వ్యక్తం చేసింది. ఒక్క ఢిల్లీ మాత్రమే కాదు.. ఉత్తరాదిన పంజాబ్, హర్యానా, యూపీ, రాజస్థాన్ రాష్ట్రాలకు సైతం అలర్ట్ నోటీసులిచ్చింది. గాలి నాణ్యత మెరుగుపడ్డానికి మీరు ఏమేం చర్యలు చేపట్టారో చెప్పండి.. అంటూ వారం రోజుల్లోగా అఫిడవిట్ దాఖలు చేయాలని ఆదేశించింది సుప్రీం కోర్టు.
పంజాబ్, హర్యానాలో పంట వ్యర్థాలు కాల్చడమే వాయు కాలుష్యానికి ప్రధాన కారణంగా ఎప్పుడో గుర్తించారు. అక్కడి రైతాంగాన్ని ఎంత ఎడ్యుకేట్ చేసినా ప్రయోజనం లేకుండా పోతోంది. దీని ప్రభావం మొత్తం ఐదు రాష్ట్రాలపై పడుతోంది. ముఖ్యంగా హస్తినాపురికి ఈ కాలుష్య పీడ ఇప్పట్లో విరగడయ్యే అవకాశాలు కనిపించడం లేదు.
మరిన్ని తాజా జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి.