Delhi Elections 2025: ఆమ్ ఆద్మీనా.. కాంగ్రెస్ పార్టీయా.. ఉద్ధవ్ సేన మద్దతు ఎవరికి?

Delhi Elections 2025: ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఇండియా కూటమిలోని భాగస్వామ్య పార్టీలు ఎవరికి వారే యమునా తీరే అన్నట్లుగా వ్యవహరిస్తున్నాయి. అధికార ఆమ్ ఆద్మీ పార్టీకే తాము మద్ధతు ఇస్తున్నట్లు ఇండియా కూటమిలో భాగస్వామ్య పార్టీలైన తృణమూల్ కాంగ్రెస్, సమాజ్‌వాది పార్టీలు ఇది వరకే ప్రకటించాయి. కాంగ్రెస్ పార్టీని కాదని ఆ పార్టీలు ఆప్ వైపు నిలబడటం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ఇప్పుడు శివసేన (ఉద్దవ్ వర్గం) కాంగ్రెస్ పార్టీ వైపు నిలబడాలా? ఆప్‌నకు మద్ధతు ఇవ్వాలా? అన్నది తేల్చుకోలేకపోతోంది.

Delhi Elections 2025: ఆమ్ ఆద్మీనా.. కాంగ్రెస్ పార్టీయా.. ఉద్ధవ్ సేన మద్దతు ఎవరికి?
Aap Vs Congress
Follow us
Janardhan Veluru

|

Updated on: Jan 11, 2025 | 1:07 PM

Delhi Assembly Election 2025: ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ సారథ్యంలోని విపక్ష కూటమి (I.N.D.I.A) పార్టీలు ఎవరికివారే యమునా తీరే అన్నట్టుగా వ్యవహరిస్తున్నాయి. ఇప్పటికే సమాజ్‌వాదీ పార్టీ (SP), తృణమూల్ కాంగ్రెస్ (TMC) పార్టీలు నిర్మొహమాటంగా కాంగ్రెస్‌ను కాదని తమ మద్దతు ఆమ్ ఆద్మీ పార్టీ (AAP)కే అంటూ తేల్చి చెప్పేశాయి. శివసేన (ఉద్దవ్ వర్గం) పార్టీ ఎటూ తేల్చుకోలేని సందిగ్ధావస్తను ఎదుర్కొంటోంది. అటు కాంగ్రెస్‌ను కాదనలేక, ఇటు ఆప్‌కు నో చెప్పలేక.. మధ్యేమార్గంగా ఈ రెండు పార్టీలూ కలిసి పోటీ చేయాలని సూచిస్తోంది. ఉమ్మడి ప్రత్యర్థి భారతీయ జనతా పార్టీ (BJP)ని ఓడించే క్రమంలో లోక్‌సభ ఎన్నికల్లో దేశవ్యాప్తంగా కలిసి పోటీ చేసి ఐక్యతను చాటిన విపక్ష కూటమి పార్టీలు.. రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో మాత్రం ఆ ఐక్యతను చాటలేకపోతున్నాయి. ముఖ్యంగా కూటమి సారధి కాంగ్రెస్ పార్టీపై దాని మిత్రపక్షాల్లో అసహనం, అసంతృప్తి నెలకొంది. అందుకు కాంగ్రెస్ పార్టీ తీరు, వ్యవహారశైలే కారణమని ఆయా పార్టీలు ఆరోపిస్తున్నాయి. ఉదాహరణకు ఢిల్లీలో ఒక్క అసెంబ్లీ, పార్లమెంట్ సీటు గెలుచుకోలేకపోయిన కాంగ్రెస్ పార్టీకి లోక్‌సభ ఎన్నికల్లో పొత్తు ధర్మాన్ని పాటిస్తూ ఉన్న 7 సీట్లలో ఏకంగా 3 సీట్లను కాంగ్రెస్ పార్టీకి కేటాయించి ఆమ్ ఆద్మీ పార్టీ తన ఉదార స్వభావాన్ని చాటుకుంటే.. పొరుగునే ఉన్న హర్యానా రాష్ట్రానికి జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఆప్ (AAP)ను దరిచేర్చుకోకుండా కాంగ్రెస్ తన కుటిల నీతిని ప్రదర్శించింది. రాజకీయ ప్రత్యర్థిని ఒంటరిగా ఢీకొట్టలేనప్పుడు భావసారూప్యత కల్గిన పార్టీలతో జట్టుకట్టడం, ఒంటరిగా ఎదుర్కోగలం అనుకున్నప్పుడు దూరం చేయడం కాంగ్రెస్ పార్టీకి కొత్తేమీ కాదు. అందుకే.. విపక్ష కూటమికి నేతృత్వం వహించే పార్టీనే కాదని ఎస్పీ, టీఎంసీ వంటి పార్టీలు ఆమ్ ఆద్మీ పార్టీకి బహిరంగంగా మద్దతు ప్రకటించాయి.

స్థానికేతర పార్టీల మద్దతుతో ఒరిగేదేంటి?

దేశ రాజధాని ఢిల్లీలో శతాబ్దాలుగా అక్కడే పుట్టిపెరిగినవారితో పాటు దేశంలోని నలుమూలల నుంచి వచ్చి స్థిరపడినవారు పెద్ద సంఖ్యలో ఉన్నారు. వారిలో తూర్పు యూపీ, బిహార్, జార్ఖండ్ ప్రాంతాలతో కూడిన పూర్వాంచల్ ప్రాంత వాసుల సంఖ్య ఎక్కువ. అలాగే రెండు మహారాష్ట్ర, బెంగాల్, రెండు తెలుగు రాష్ట్రాలకు చెందిన ఓటర్లు కూడా గణనీయమైన సంఖ్యలోనే ఉన్నారు. వారంతా తమ తమ రాష్ట్రాల్లో ఏదో ఒక ప్రాంతీయ పార్టీకి మద్దతుదారులుగా ఉంటారు. ఢిల్లీలో ఆ పార్టీలు లేవు కాబట్టి జాతీయ పార్టీల్లో తమకు నచ్చిన పార్టీని ఎంచుకుంటూ ఉంటారు. ఒకవేళ తాము ఇష్టపడే పార్టీ ఢిల్లీలో ఏ పార్టీకి మద్దతు ప్రకటిస్తే.. ఆ పార్టీకి ఓటేసే అవకాశాలు కూడా ఎక్కువగా ఉంటాయి. అందుకే ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో వివిధ రాష్ట్రాలకు చెందిన ప్రాంతీయ పార్టీల మద్దతు ఎంతో కొంత ఓటుబ్యాంకును ప్రభావితం చేసి ప్రయోజనం కల్పిస్తుంది. సమాజ్‌వాదీ మద్దతు కారణంగా ఢిల్లీలో నివసించే యూపీకి చెందిన ప్రజలు ప్రభావితమై ఆమ్ ఆద్మీ పార్టీ పక్షాన నిలబడే అవకాశం ఉంటుంది. అలాగే ఢిల్లీలో నివసించే బెంగాలీ ఓటర్లను తృణమూల్ కాంగ్రెస్ చాలా వరకు ప్రభావితం చేయగల్గుతుంది. ఢిల్లీలో మహారాష్ట్ర వాసులు కూడా పెద్ద సంఖ్యలోనే ఉండగా.. అందులో శివసేన (ఉద్దవ్ వర్గం) మద్దతుదారులైన ఓటర్లను ఎటువైపు దారిమళ్లించాలన్న విషయంపై మల్లగుల్లాలు పడుతోంది.

స్థానికేతర రాజకీయ పార్టీలు తమ ఓటర్లు ఉన్నారు కదా అని తమది కాని రాష్ట్రంలో పోటీ చేసినా ప్రయోజనం ఉండదు. వ్యక్తిగతంగా విశేష ప్రజాదరణ కల్గిన నేత ఉంటే తప్ప గెలిచే అవకాశాలు కూడా ఉండవు. అందుకే తమతో భావసారూప్యత కలిగిన పార్టీలకు మద్దతు ప్రకటిస్తూ ఉంటాయి. అవసరమైతే ప్రచారం కూడా చేస్తుంటాయి. ఆప్ తరఫున ప్రచారం చేసేందుకు సమాజ్‌వాదీ పార్టీ అధినేత అఖిలేశ్ యాదవ్ సభలు నిర్వహించేందుకు కూడా సిద్ధమయ్యారు. మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీఏ కూటమిలో భాగస్వాములుగా ఉన్న తెలుగుదేశం, జనసేన పార్టీలు బీజేపీ తరఫున ప్రచారం చేసిన విషయం తెలిసిందే. గతంలో ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లోనూ ప్రచారం చేయగా.. ఈసారి కూడా చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ వంటి నేతలు సీఎం, డిప్యూటీ సీఎం హోదాల్లో వచ్చి మరీ ప్రచారం చేసే అవకాశాలు లేకపోలేదు.

ఆప్-కాంగ్రెస్ కలిసి పోటీ చేయాలి – రౌత్

మహారాష్ట్రలో తమతో కలిసి ఉన్న కాంగ్రెస్ పార్టీని కాదని ఆమ్ ఆద్మీ పార్టీకి మద్దతిచ్చే పరిస్థితి శివసేన (ఉద్దవ్ వర్గం) పార్టీలో కనిపించడం లేదు. అందుకే ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్, ఆప్ కలిసి పోటీ చేయాలని సూచిస్తోంది. శివసేన (యూబీటీ) నేత సంజయ్ రౌత్ మాట్లాడుతూ ఢిల్లీ ఎన్నికల్లో ఎవరికి మద్దతివ్వాలన్న అంశంపై ఇంకా నిర్ణయం తీసుకోలేదని, రెండు పార్టీలను కలిసి పోటీ చేయాలని మాత్రం చెబుతున్నామని అన్నారు. ఢిల్లీలో ఆప్ పెద్ద పార్టీగా ఉందని, కానీ దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పెద్ద పార్టీ అని గుర్తుచేశారు. అయితే రెండు పార్టీలూ తమకు మిత్రులేనని వ్యాఖ్యానించారు. తమ శత్రువు బీజేపీ మాత్రమేనని, కాంగ్రెస్, ఆప్ కాదని రౌత్ అన్నారు. సార్వత్రిక ఎన్నికల్లో బలమైన బీజేపీని ఎదుర్కొనేందుకు మాత్రమే విపక్ష కూటమి ఏర్పడిందని, మిగిలిన ఎన్నికలు స్థానిక అంశాల ఆధారంగా జరుగుతాయని ఆయన సూత్రీకరించారు.

రౌత్ సూచన ఇలా ఉంటే.. ఢిల్లీలో ఆప్, కాంగ్రెస్ పార్టీలు కత్తులు దూసుకుంటున్నాయి. ఆప్ ప్రభుత్వ పదేళ్ల పాలనను ‘దుష్పరిపాలన’గా అభివర్ణస్తూ ఢిల్లీ కాంగ్రెస్ నేతలు టార్గెట్ చేస్తున్నారు. కొద్ది రోజుల క్రితం అరవింద్‌ కేజ్రీవాల్‌ను ‘దేశ వ్యతిరేకి’ అని కాంగ్రెస్‌ నేత అజయ్‌ మాకెన్‌ వ్యాఖ్యానించారు. మాకెన్ ఈ ప్రకటనపై క్షమాపణలు చెప్పాలంటూ ఆమ్ ఆద్మీ పార్టీ అల్టిమేటం ఇచ్చింది. ఈ పరిస్థితుల్లో రెండు పార్టీలు కలిసి పోటీ చేయాలన్న శివసేన (ఉద్దవ్ వర్గం) సూచన పూర్తిగా నిష్ఫలం, నిష్ప్రయోజనం.

ఢిల్లీలో త్రిముఖ పోరు..

కాగా ఢిల్లీ అసెంబ్లీలో అధికార ఆప్, బీజేపీ, కాంగ్రెస్ పార్టీల మధ్య త్రిముఖ పోరు నెలకొంటోంది. మూడు పార్టీలు ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకుని విజయం కోసం శర్వశక్తులు ఒడ్డుతున్నాయి. ఢిల్లీలోని మొత్తం 70 అసెంబ్లీ నియోజకవర్గాలకు ఒకే విడతలో ఫిబ్రవరి 5న పోలింగ్ జరగనుంది. ఫిబ్రవరి 8న ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు. నామినేషన్లకు సంబంధించిన గెజిట్ నోటిఫికేషన్ శుక్రవారం( 10 జనవరి 2025) నాడు విడుదలయ్యింది. జనవరి 17నాటి వరకు నామినేషన్లు స్వీకరించనున్నారు. 18 తేదీన నామినేషన్లను పరిశీలించనున్నారు. నామినేషన్ల ఉపసంహరణకు 20 జనవరి వరకు గడువు ఇవ్వనున్నారు.