Triple Murder: ఎంత ఘోరం! మార్నింగ్ వాక్‌కు వెళ్లి ఇంటికి తిరిగొచ్చేసరికి.. తండ్రి, తల్లి, చెల్లి ఒకేసారి..
అతడు ఉదయాన్నే నిద్ర లేచి ఎప్పటి మాదిరిగానే వాకింగ్ వెళ్లాడు. కానీ అతడు బయటికి వెళ్లడమే అదునుగా గుర్తు తెలియని అగంతకుడు ఇంట్లో దూరి మొత్తం కుటుంబాన్ని బలి తీసుకున్నాడు. ఆ రోజు అతడు వాకింగ్ కు వెళ్లకపోయి ఉంటే తన వాళ్లను కాపాడుకునే వాడు.. కానీ విధి అతన్ని నిలువెళ్లా మోసం చేసింది..
న్యూఢిల్లీ, డిసెంబర్ 5: రోజు మాదిరిగానే ఉదయాన్నే నిద్రలేచి మార్నింగ్ వాక్‌కు వెళ్లాడు అతడు. ఇంటికి తిరిగి వచ్చేసరికి ఊహించని షాకింగ్ సీన్ అతని కంట పడింది. ఇంట్లో కుటుంబం అంతా రక్తపు మడుగులో విగతజీవులుగా పడి ఉండటం చూసి అతని గుండె బద్దలైంది. ఎవరు చేశారో.. ఎలా జరిగిందో తెలియక.. ఒక్క క్షణం అతని గుండె ఆగినంత పనైంది. తేరుకుని పెద్దగా కేకలు వేయడంతో ఇరుగుపొరుగు పరుగుపరుగున వచ్చారు. అక్కడి సీన్ చూసి పోలీసులకు సమాచారం ఇవ్వడంలో ట్రిపుల్ మర్డర్ కేసు వెలుగులోకి వచ్చింది. ఈ దారున ఘటన దేశ రాజధాని ఢిల్లీలో బుధవారం (డిసెంబర్ 4) ఉదయం చోటు చేసుకుంది. వివరాల్లోకెళ్తే..
ఢిల్లీలో బుధవారం ఉదయం అర్జున్ అనే వ్యక్తి ఇంటి నుంచి బయటకు జాగింగ్ కోసం వెళ్లాడు. మార్నింగ్ వాక్ తర్వాత తిరిగి ఇంటికి వచ్చిన అతడు ఇంటి తలుపులు తీయగా తండ్రి రాజేష్ కుమార్ (51), తల్లి కోమల్ ()46, సోదరి కవిత (23) కత్తిపోట్లతో రక్తం మడుగులో విగతజీవులుగా పడి ఉండటాన్ని చూసి షాకయ్యాడు. అతడి కేకలు విన్న స్థానికులు ఆ ఇంటి వద్దకు పరుగుపరుగున వచ్చారు. వెంటనే వారు పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు అక్కడి పరిస్థితిని సమీక్షించారు. బుధవారం పెళ్లి రోజు కావడంతో తన తల్లిదండ్రులకు విష్ చేసి తాను మార్నింగ్ వాక్‌కు వెళ్లానని, తిరిగొచ్చేసరికి ఈ ఘోరం జరిగిందని అర్జున్ తెలిపాడు. అయితే ఇంట్లో చోరీ, చోరీ జరిగిన ఆనవాళ్లు కనిపించలేదని పోలీసులు తెలిపారు.
మేము అర్జున్ ఇంటికి రాగానే అతను మార్నింగ్ వాక్ కోసం బయటకు వెళ్లాడని, తిరిగి వచ్చిచూడగా తన తల్లిదండ్రులు, సోదరిని ఎవరో కత్తితో పొడిచి చంపినట్లు మాకు చెప్పాడని ఇరుగుపొరుగువారు తెలిపారు. దేశ నడిబొడ్డులో ఇంత దారుణంగా ముగ్గురు వ్యక్తులను చంపడం స్థానికంగా కలకలం సృష్టించింది. మృతికి గల కారణాలను గుర్తించేందుకు అధికారులు విచారణ చేపట్టారు. ఆధారాలను సేకరించేందుకు క్రైమ్ సీన్, ఫోరెన్సిక్ బృందాలను రప్పించారు. అనంతరం ముగ్గురి మృతదేహాలను పోస్ట్‌మార్టం కోసం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ సంఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.