AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IMD Alert: దేశవ్యాప్తంగా పిడుగులు, ఈదురుగాలులతో భారీ వర్షాలు.. ఐఎండీ హెచ్చరిక

దేశవ్యాప్తంగా వాతావరణంలో మార్పులు చోటుచేసుకుంటుండగా, పలు రాష్ట్రాల్లో వర్షాలు, ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులు వచ్చే అవకాశం ఉందని ఐఎండీ హెచ్చరించింది. తూర్పు, ఈశాన్య ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే సూచనలు ఉండగా, కొన్ని చోట్ల వడగళ్ల వానలు కూడా పడవచ్చు. గంటకు 60–80 కి.మీ. వేగంతో గాలులు వీచే అవకాశం ఉండటంతో అప్రమత్తంగా ఉండాలని సూచించింది.

IMD Alert: దేశవ్యాప్తంగా పిడుగులు, ఈదురుగాలులతో భారీ వర్షాలు.. ఐఎండీ హెచ్చరిక
Weather Report
Ram Naramaneni
|

Updated on: Mar 21, 2026 | 7:13 PM

Share

దేశవ్యాప్తంగా వాతావరణ పరిస్థితులు ఒక్కసారిగా మారనున్నాయని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) హెచ్చరించింది. రాబోయే కొన్ని రోజులపాటు తూర్పు, మధ్య, ఈశాన్య ప్రాంతాల్లో విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. పిడుగులు, ఈదురుగాలులు, వడగళ్ల వానలు చోటుచేసుకునే అవకాశం ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. సబ్‌హిమాలయ పశ్చిమ బెంగాల్, సిక్కిం ప్రాంతాల్లో మార్చి 21 నుంచి 24 వరకు విస్తారంగా వర్షాలు కురిసే సూచనలు ఉన్నాయి. ఇందులో కొన్ని ప్రాంతాల్లో భారీ నుంచి అతిభారీ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని పేర్కొంది. గంగేటిక్ పశ్చిమ బెంగాల్‌లో గంటకు 80 కి.మీ. వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉండగా, ఒడిశాలో 70 కి.మీ. వేగంతో గాలులు వీచి వడగళ్ల వాన కురిసే అవకాశం ఉందని వెల్లడించింది.

ఈశాన్య రాష్ట్రాలైన మణిపూర్, మిజోరం, త్రిపురలో విస్తృతంగా వర్షాలు, పిడుగులు పడే అవకాశముంది. అసోం, మేఘాలయ, అరుణాచల్ ప్రదేశ్ ప్రాంతాల్లో మార్చి 24న కొన్ని చోట్ల భారీ వర్షాలు నమోదయ్యే అవకాశం ఉంది. తూర్పు, మధ్య భారతంలోని బీహార్, జార్ఖండ్, ఛత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లో కూడా విడివిడిగా వర్షాలు, బలమైన ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని ఐఎండీ తెలిపింది. ఉత్తర పశ్చిమ భారతదేశంలో కూడా వాతావరణం మారనుంది. హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్ ప్రాంతాల్లో మార్చి 23న తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు, మంచు కురిసే అవకాశం ఉంది. తూర్పు ఉత్తరప్రదేశ్‌లో కూడా గాలులు గంటకు 40 కి.మీ. వేగంతో వీచే అవకాశముంది.

ప్రస్తుతం దేశవ్యాప్తంగా భారీ ఉరుములు, మెరుపులతో కూడిన వర్షపాతం కొనసాగుతోందన్నారు ఐఎండీ శాస్త్రవేత్త అఖిల్ శ్రీవాస్తవ తెలిపారు. ఢిల్లీలో ఇప్పటికే వర్షం కురవడంతో ఉష్ణోగ్రతలు బాగా తగ్గాయని చెప్పారు. శనివారం సాయంత్రం వరకు వర్షాలు కొనసాగవచ్చని, అయితే ఆదివారం నుంచి తగ్గుముఖం పట్టే అవకాశం ఉందని తెలిపారు. అదే సమయంలో తూర్పు ఉత్తరప్రదేశ్, బీహార్, జార్ఖండ్, ఛత్తీస్‌గఢ్, ఒడిశా, పశ్చిమ బెంగాల్ ప్రాంతాలకు ‘ఆరెంజ్ అలర్ట్’ జారీ చేసినట్లు వెల్లడించారు. ఈ ప్రాంతాల్లో గంటకు 60–70 కి.మీ. వేగంతో గాలులు వీచే అవకాశం ఉందని హెచ్చరించారు. దక్షిణ రాష్ట్రాలు, మహారాష్ట్రలో కూడా విడివిడిగా వర్షాలు కురిసే అవకాశం ఉంది. అయితే తీర ప్రాంతాల్లో వేడి, తేమ ఎక్కువగా ఉండే అవకాశం ఉందని ఐఎండీ తెలిపింది.

ఏపీకి పిడుగుపాటు హెచ్చరిక

అల్లూరి, పోలవరం, కాకినాడ, తూర్పుగోదావరి , ఏలూరు,ఎన్టీఆర్, గుంటూరు,పల్నాడు, మార్కాపురం, ప్రకాశం జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో పిడుగులతో కూడిన మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. విశాఖ, అనకాపల్లి, నెల్లూరు, వైఎస్ఆర్ కడప జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలకు అవకాశముందని వెల్లడించింది. ఉరుములు, మెరుపులు ఉన్నప్పుడు సురక్షితమైన భవనాల్లో తలదాచుకోవాలి.  పిడుగులు పడే అవకాశం ఉన్నందున చెట్ల కింద లేదా బహిరంగ ప్రదేశాల్లో నిలబడరాదు. ఇంట్లో ఉన్నప్పుడు ఎలక్ట్రానిక్ వస్తువులను వాడటం తగ్గించండి.

Also Read: మీకు బొటన వేలు, మణికట్టు మధ్య నొప్పి ఉందా..? అయితే.. 

Follow Us