AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

బట్టల ఎడారి.. గుట్టలుగా లేటెస్ట్ ఫ్యాషన్ దుస్తులు! ఫ్రీగా తెచ్చుకోవచ్చు.. ఎక్కడంటే?

ఎడారి ఫాస్ట్‌ ఫ్యాషన్‌ వ్యర్థాలకు డంపింగ్‌ గ్రౌండ్‌గా మారుతోంది. ప్రపంచం నలుమూలల నుంచి దిగుమతయ్యే చౌక, అమ్ముడుపోని దుస్తుల్లో భారీ భాగం ఇక్కడ పడేస్తున్నారు. సింథటిక్‌ బట్టలు త్వరగా కుళ్లకపోవడంతో నేల, గాలి కాలుష్యానికి కారణమవుతున్నాయి. ఈ సమస్యకు రీయూజ్‌, రిపేర్‌, రీసైక్లింగ్‌, సర్క్యులర్‌ ఫ్యాషన్‌ విధానాలను నిపుణులు సూచిస్తున్నారు.

బట్టల ఎడారి.. గుట్టలుగా లేటెస్ట్ ఫ్యాషన్ దుస్తులు! ఫ్రీగా తెచ్చుకోవచ్చు.. ఎక్కడంటే?
Atacama Desert Clothing Waste
SN Pasha
|

Updated on: Aug 20, 2026 | 5:18 PM

Share

ప్రపంచంలో ఫ్యాషన్‌, ట్రెండ్ ఎలా మారుతుందో దాని కంటే వేగంగా బట్టల ఉత్పత్తి పెరుగుతోంది. కొత్త డిజైన్లు, తక్కువ ధరలు, తరచూ మారే ట్రెండ్లతో ఫాస్ట్‌ ఫ్యాషన్‌ మార్కెట్‌ విస్తరిస్తుండగా.. దాని మరోవైపు మాత్రం భారీ పర్యావరణ సమస్య ఏర్పడుతోంది. చిలీలోని ప్రపంచంలోనే అత్యంత పొడి ప్రాంతాల్లో ఒకటైన అటకామా ఎడారి ఇప్పుడు ఉపయోగించని, అమ్ముడుపోని దుస్తుల భారీ డంపింగ్‌ గ్రౌండ్‌గా మారింది. దీన్ని ఒక ఎడారి అనేకంటే బట్టల ఎడారి అనడం ఉత్తమం. ఎందుకంటే అక్కడ డంప్ చేసిన దుస్తులు గుంటలు కొండలను మించిపోతున్నాయి.

ఏటా కోట్ల టన్నుల టెక్స్‌టైల్‌ వ్యర్థాలు

ఐక్యరాజ్యసమితి పర్యావరణ కార్యక్రమం (UNEP) ప్రకారం ప్రపంచవ్యాప్తంగా ప్రతి సంవత్సరం సుమారు 9.2 కోట్ల టన్నుల టెక్స్‌టైల్‌ వ్యర్థాలు ఉత్పత్తి అవుతున్నాయి. ప్రతి సెకనుకు ఒక చెత్త ట్రక్కులో ఉండేంత దుస్తులను ల్యాండ్‌ఫిల్‌ చేయడం లేదా కాల్చేయడం జరుగుతోందని UNEP పేర్కొంది. అంతేకాదు, 2000 నుంచి 2015 మధ్య ప్రపంచ దుస్తుల ఉత్పత్తి దాదాపు రెట్టింపు కాగా, ఒక్కో దుస్తును ఉపయోగించే వ్యవధి 36 శాతం తగ్గింది.

చిలీకి ఇంత బట్టల వ్యర్థం ఎలా వస్తోంది?

ఉత్తర చిలీలోని ఇకికే, ఆల్టో హోస్పిసియో ప్రాంతాలు అంతర్జాతీయంగా సెకండ్‌హ్యాండ్‌, అదనపు దుస్తుల వాణిజ్యానికి కీలక కేంద్రాలుగా మారాయి. 2022లోనే చిలీకి 1.24 లక్షల టన్నుల సెకండ్‌హ్యాండ్‌ టెక్స్‌టైల్స్‌ దిగుమతి అయ్యాయని చిలీ నేషనల్‌ కస్టమ్స్‌ డేటాను ఉటంకిస్తూ UNEP తెలిపింది. వీటిలో కొంత భాగం స్థానికంగా లేదా ఇతర దేశాల్లో తిరిగి అమ్ముడవుతుంది. కానీ అమ్ముడుకాని, తిరిగి ఉపయోగించలేని దుస్తులు చివరకు వ్యర్థాలుగా మారుతున్నాయి. ఇకికే ఫ్రీ-ట్రేడ్‌ జోన్‌ కారణంగా దిగుమతులు పెద్ద ఎత్తున జరుగుతుండటం కూడా ఈ వ్యవస్థలో కీలక పాత్ర పోషిస్తోంది. చౌకగా వచ్చే భారీ మొత్తంలో దుస్తుల్లో కొంత భాగానికి మార్కెట్‌ లేకపోవడంతో అవి అక్రమంగా ఎడారి ప్రాంతాలకు తరలిస్తున్నారు. అయితే ఇక్కడికి వచ్చి కొంతమంది పేదలు అందులో కాస్త మంచిగా ఉన్న వాటిని ఎరుకొని తీసుకెళ్తుంటారు.

ఎడారిలో బట్టలు ఎందుకు ప్రమాదకరం?

అటకామా ఎడారి చాలా పొడి ప్రాంతం కావడంతో అక్కడ పడేసిన దుస్తులు సాధారణ చెత్తలా త్వరగా కుళ్లిపోవు. ముఖ్యంగా పాలిస్టర్‌, నైలాన్‌ వంటి సింథటిక్‌ ఫైబర్లతో తయారైన బట్టలు పర్యావరణంలో ఎక్కువకాలం మిగిలిపోతాయి. కొన్ని చోట్ల ఈ దుస్తులకు నిప్పుపెట్టడం వల్ల సమస్య మరింత తీవ్రమవుతోంది. బహిరంగంగా టెక్స్‌టైల్‌ వ్యర్థాలను కాల్చడం వల్ల గాలి కాలుష్యం, హానికరమైన పొగలు, మానవ ఆరోగ్యానికి ముప్పు ఏర్పడే అవకాశం ఉందని UNEP హెచ్చరిస్తోంది.

నేల, నీరు, గాలిపైనా ప్రభావం

టెక్స్‌టైల్‌ వ్యర్థాల్లోని కొన్ని రసాయనాలు నేలలోకి చేరి కాలుష్యానికి కారణమయ్యే అవకాశం ఉంది. సింథటిక్‌ బట్టలు కాలక్రమంలో సూక్ష్మ ప్లాస్టిక్‌ ఫైబర్లుగా విడిపోయే ప్రమాదం కూడా ఉంది. UNEP ప్రకారం సరిగ్గా నిర్వహించని టెక్స్‌టైల్‌ వ్యర్థాలు నేలలోకి రసాయన కాలుష్యాలను చేరవేసి, నీటి వనరులను కలుషితం చేసే అవకాశం ఉంది.

పరిష్కారం కోసం చిలీ చర్యలు

ఈ సమస్యను ఎదుర్కొనేందుకు చిలీ ప్రభుత్వం 2040 వరకు టెక్స్‌టైల్స్‌ కోసం సర్క్యులర్‌ ఎకానమీ స్ట్రాటజీపై పనిచేస్తోంది. ఉపయోగించిన దుస్తులను పారేయడం కంటే వాటిని తిరిగి ఉపయోగించడం, మరమ్మతు చేయడం, రీసైకిల్‌ చేయడం, కొత్త ఉత్పత్తులుగా మార్చడం వంటి విధానాలకు ప్రాధాన్యం ఇవ్వాలని లక్ష్యంగా పెట్టుకుంది.

అసలు సమస్య మన షాపింగ్‌ అలవాట్లలోనే!

అటకామాలో కనిపిస్తున్న బట్టల కొండలు కేవలం చిలీ సమస్య కాదు. తక్కువ ధరకు ఎక్కువ బట్టలు కొనడం, కొద్దిసార్లు మాత్రమే ఉపయోగించి పారేయడం, అమ్ముడుకాని స్టాక్‌ను కొత్త ఉత్పత్తులతో భర్తీ చేయడం వంటి ఫాస్ట్‌ ఫ్యాషన్‌ వ్యవస్థ ప్రపంచవ్యాప్తంగా వ్యర్థాలను పెంచుతోంది. UNEP కూడా ఉత్పత్తి తగ్గించడం, బట్టల జీవితకాలాన్ని పెంచడం, రీయూజ్‌, రిపేర్‌, రీసైక్లింగ్‌ వంటి సర్క్యులర్‌ విధానాలే దీర్ఘకాలిక పరిష్కారమని చెబుతోంది.

Follow Us